గోదావరిఖని, వెలుగు : సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే కోల్‌బె ల్ట్ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేల ఇండ్లు ముట్టడిస్తామని వామపక్ష పార్టీల లీడర్లు హెచ్చరించారు. కాంట్రాక్టు కార్మికుల సమ్మెకు మద్దతుగా ఆదివారం వామపక్ష పార్టీల లీడర్లు గోదావరిఖని అంబేడ్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి సదానందం, సీపీఎం జిల్లా కార్యదర్శి యాకయ్య, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ లీడర్లు ఇ.నరేశ్, కె.విశ్వనాథ్ మాట్లాడుతూ సమ్మెను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని విమర్శించారు. అలాగే సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆర్జీ-1 ఏరియా గోదావరిఖనిలోని గంగానగర్‌లో ఉన్న కోల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసు వద్ద కార్మికులు నిరసన తెలిపారు. 1 ఇంక్లైన్ సీహెచ్‌పీ ప్లాంట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి చెక్ పోస్ట్ వద్ద రాస్తారోకో చేశారు.
జడ్పీటీసీకి చాకలి ఐలమ్మ అవార్డు
గోదావరిఖని, వెలుగు : పాలకుర్తి జడ్పీటీసీ సభ్యురాలు కందుల సంధ్యారాణి ఆదివారం చాకలి ఐలమ్మ ఆవార్డు అందుకున్నారు. చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల సందర్భంగా మహాత్మా పూలే ఫౌండేషన్, బీసీ టైమ్స్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు, చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ శివకుమార్ గౌడ్ చేతులమీదుగా ఆమె అవార్డు స్వీకరించారు. సామాజిక సేవా రంగంలో అందిస్తున్న సేవలకుగాను అవార్డును అందజేసినట్టు మహాత్మ పూలే ఫౌండేషన్ ట్రస్ట్ ఫౌండర్ సంగెం సూర్యా రావు, చైర్మన్ వి.రవిశంకర్ తెలిపారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ప్రాణమున్నంత వరకు ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతానని అన్నారు.
స్కూళ్లకు కొత్త బిల్డింగులేవి?
కరీంనగర్/చిగురుమామిడి, వెలుగు: కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేశామని గొప్పలు చెబుతున్నారని, కానీ ఎక్కడా కొత్త బిల్డింగులు కట్టలేదని, అన్నీ మురికికూపాలుగా ఉన్నాయని హుజూరాబాద్ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడిలో ఇటీవల మరణించిన జడ్పీటీసీ సభ్యుడు గీకూరి రవీందర్ భార్య కావ్య ఫొటోకు ఆదివారం ఆయన నివాళులర్పించారు. వెంట లీడర్లు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, కోమటి రెడ్డి రామ్ గోపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.
టీఆర్ఎస్ ఖేల్ ఖతం
హుజూరాబాద్: నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్ప్రభుత్వాన్ని ప్రజలు ఆరు నెలల్లో మట్టిలో కలిపేస్తారని ఈటల అన్నారు. ఆదివారం హుజూరాబాద్‌లో క్యాంపు ఆఫీస్‌లో ఆయన మాట్లాడారు. పోడు భూములు కోసం ఆందోళన చేసిన మహిళలు, గర్భిణులపై డాడి చేశారని, ఇందుకోసమే మీకు అధికారం ఇచ్చారా అని ప్రశ్నించారు. అక్రమాలకు సహకరిస్తున్న అధికారుల భరతం పట్టక తప్పదని హెచ్చరించారు.
విగ్రహ ఏర్పాటుపై ‘రసమయి’కి చిత్తశుద్ధి లేదు
తిమ్మాపూర్, వెలుగు: అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు చిత్తశుద్ధి లేదని అంబేద్కర్ దళిత సంఘాల లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని అలుగునూరు చౌరస్తా వద్ద కొన్నేళ్లుగా అంబేద్కర్ విగ్రహాన్ని పక్కకు పడేయడంతో ఆదివారం అంబేద్కర్ సంఘ నాయకులు విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు గూడ కనకయ్య మాట్లాడుతూ రోడ్డు వెడల్పు కోసం చౌరస్తాలో ఉన్న విగ్రహాన్ని పక్కకు పడేశారని అన్నారు. అధికారులు, లీడర్లు విగ్రహాన్ని చూసి కూడా చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నేతలు స్పందించి అంబేద్కర్విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని లేకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు జక్కుల శ్రీహరి, తాటిపల్లి రమేశ్, సిరిసిల్ల నారాయణ తదితరులు పాల్గొన్నరు.
జోనల్ లెవెల్ స్పోర్ట్స్ ప్రారంభం
తంగళ్లపల్లి,వెలుగు: మండలంలోని బద్దెనపల్లి గురుకుల పాఠశాలలో ఆదివారం ఎనిమిదో జోనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ఎన్. అరుణ మాట్లాడుతూ స్టూడెంట్లు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. ప్రతి రంగంలో పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం ప్రిన్సిపాల్ పద్మ మాట్లాడుతూ మూడు జిల్లాల్లో 13 గురుకులాల కు చెందిన 1105 మంది క్రీడల్లో పాల్గొంటున్నా రని తెలిపారు. అనంతరం క్రీడాకారులను పరిచ యం చేసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పడిగెల మానస, జడ్పీటీసీ మంజుల, ఎంపీటీసీ ప్రసూన, సీఐ ఉపేందర్, ఎస్సై లక్ష్మారెడ్డి, జిల్లా శిశు సంక్షేమ అధికారి లక్ష్మీరాజం పాల్గొన్నారు.
ఆటో, పెట్రోల్ ట్యాంకర్ ఢీ ఒకరు మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు
గొల్లపల్లి, వెలుగు: ప్యాసింజర్ ఆటో, పెట్రోల్ ట్యాంకర్ ఎదురెదురుగా ఢీకొనడంతో ఆటోలో ఉన్న ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా ఒకరు మృతి చెందారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గోవింద్ పల్లి స్టాప్ వద్ద జరిగింది. ఎస్ఐ దత్తాద్రి కథనం ప్రకారం.. వెల్గటూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన మల్యాల మండలం తక్కళ్లపెల్లి లో తమ బంధువు అనారోగ్యానికి గురికాగా పరామర్శకు ఆదివారం వెళ్లారు. ఆటోలో త్తునూర్, చిల్వకోడూరు మీదుగా తక్కళ్లపెల్లి కి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆటో డ్రైవర్ సింగం సత్తయ్య, బందెల లక్ష్మి, మెరుగు శ్యామల, బందెల లత, మెరుగు మనోజ్ఞ, ఆకుల లచ్చవ్వ, బుర్రగడ్డ రక్షిత్ కు తీవ్ర గాయాలు కాగా మెరుగు కళావతి(58)మృతి చెందింది. క్షతగాత్రులను జగిత్యాల, కరీంనగర్ అస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
భారతమ్మ సాహితీ సేవలు చిరస్మరణీయం
కరీంనగర్‌టౌన్, వెలుగు: నవ్య సాహిత్య పరిషత్ సంస్థ వ్యవస్థాపకురాలు సంగని భారతమ్మ సేవలు చిరస్మరణీయమని సాహితీవేత్తలు గుర్తు చేసుకున్నారు. ప్రముఖ కవి, రచయిత డాక్టర్ మలయశ్రీ సతీమణి భారతమ్మ మృతి చెంది ఏడాది గడిచిన సందర్భంగా రేకుర్తిలో ఆదివారం సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జీవితాంతం నాస్తికురాలిగా, మానవతావాదిగా ఉన్న భారతమ్మ తన సాహితీ సంస్థ ద్వారా మంచి పుస్తకాలను తెచ్చి ప్రజా చైతన్యానికి కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో డాక్టర్ మలయశ్రీ, ముదుగంటి పాపిరెడ్డి, డాక్టర్ కె.శ్యాంసుందర్, నడిమెట్ల రామయ్య, వి.భూపతిరెడ్డి, లక్ష్మణ బోధి, డి. మురళి, సత్య తిరునగరి, మేడిచంద్రయ్య, కూకట్ల తిరుపతి తదితర కవులు, రచయితలు పాల్గొన్నారు.
కరెంట్ షాక్‌తో మహిళ మృతి
మెట్ పల్లి : ట్యాంకులో నీళ్లు నింపేందుకు వెళ్లి కరెంట్ షాకుతో మహిళ చనిపోయిన ఘటన మెట్ పల్లి మండలం వెల్లుల్లలో జరిగింది. మృతురాలి కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలం కీసర గ్రామానికి చెందిన కన్నూరి కావ్యకు(24) ను మెట్ పల్లి మండలం వెల్లుల్లకు చెందిన సందీప్ తో 2019లో పెళ్లయ్యింది. వీరికి మూడేళ్ల కుమారుడు, ఎనిమిది నెలల కూతురు ఉంది. సందీప్ వెల్లుల్లలోనే మోటార్ వైండింగ్ చేస్తున్నాడు. ఆదివారం ఉదయం కావ్య ఇంట్లోని వాటర్ ట్యాంక్ లో నీళ్లు నింపడం కోసం బోరు స్టార్ట్ చేసింది. అయితే బటన్ నొక్కగానే కరెంటు షాక్‌తగిలి కిందపడిపోయింది. దీంతో కుటుంబసభ్యులు వెంటనే మెట్ పల్లి సివిల్ హాస్పిటల్ కు తరలించగా అప్పడికే కావ్య చనిపోయిందని డాక్టర్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.