లెఫ్ట్ పార్టీల అబద్ధాల ప్రచారం

లోక్​సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత మనదేశంలోని లెఫ్ట్ పార్టీలు తీవ్ర నిరాశకు గురయ్యాయి. ఒకమాటలో చెప్పాలంటే పొలిటికల్ ఫ్రస్ట్రేషన్ కు గురయ్యాయి. ప్రజల ఆశీర్వాదంతో రెండోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వంపై  అబద్ధాలు ప్రచారం చేయడం మొదలెట్టాయి. అబద్ధాలతో మోడీ సర్కార్​ను బద్నాం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి.

కేంద్రంలోని ఎన్డీయే టూ సర్కార్ ఏం చేసినా అందులో లోపాలు వెతకడమే పనిగా పెట్టుకున్నాయి లెఫ్ట్ పార్టీలు. నిజంగా లోపాలుంటే, వెతకవచ్చు. వాటి గురించి సర్కార్ పెద్దలకు చెప్పవచ్చు. లోపాలను సరిదిద్దుకోవడానికి  ఏం చేయాలో సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. ఎవరూ కాదనరు. కానీ ఈ పని చేయడం లేదు లెఫ్ట్ పార్టీలు. సరికదా సర్కార్ చేసిన మంచి పనులను కూడా వక్రీకరించి నెగెటివ్ గా చూపించే ప్రయత్నాలు మొదలెట్టాయి. సిటిజన్​షిప్ అమెండ్​మెంట్ యాక్ట్ (సీఏఏ) యే దీనికి ఉదాహరణ. మూడు ముస్లిం దేశాల్లోని ఆరు మతాలకు చెందిన వాళ్లు అక్కడ మతపరంగా ఇబ్బందులు, వేధింపులు ఎదుర్కొంటే వారిని అక్కున చేర్చుకోవడానికి, వాళ్లకు పౌరసత్వం ఇచ్చి ఆదుకోవడానికి  ప్రభుత్వం చట్టం చేస్తే దానిపై  తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి ఈ పార్టీలు. పౌరసత్వాన్ని ఇచ్చే చట్టాన్ని , లాక్కునే చట్టంగా జనం ముందుకు తీసుకెళుతున్నాయి. నిజానికి సీఏఏ తో మనదేశంలోని ముస్లింలకు ఏమాత్రం సంబంధం లేదు. వాళ్ల ప్రయోజనాలు ఏమాత్రం దెబ్బతినవు. అయినా సీఏఏతో ఇక్కడి ముస్లింల ఉనికికే ప్రమాదం వచ్చినంతగా విష ప్రచారం చేసి పబ్బం గడుపుకుంటున్నాయి.

సీఏఏ ను ఎవరు ఎంతగా వ్యతిరేకిస్తే వాళ్లు అంతగా  ప్రోగ్రెసివ్ అనేలా బిల్డప్ లు ఇస్తున్నాయి లెఫ్ట్ పార్టీలు. లెక్కా పత్రం లేకుండా సరిహద్దుల నుంచి చొరబడుతున్న బంగ్లాదేశ్ వాసులను కట్టడి చేయడానికి ‘నేషనల్ రిజస్టర్ ఆఫ్ సిటిజన్స్’ ( ఎన్నార్సీ) తీసుకువస్తే దానిని వ్యతిరేకిస్తున్నాయి. చొరబాటుదారులకు తలుపులు తీసి మరీ వెల్ కం పలుకుతున్నాయి. అయితే లెఫ్ట్ పార్టీలు ఏం చెప్పినా అదే నిజమని ప్రజలు నమ్మే రోజులు పోయాయి. అబద్ధాలు ఏవో, నిజాలు ఏవో తెలుసుకునే  చైతన్యం ప్రజల్లో పెరిగింది. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్నార్పీ ….వీటి గురించిన నిజాలు ప్రజలకు తెలుసు. లెఫ్ట్ పార్టీలు ఎంతగా అబద్ధాలను ప్రచారం చేసినా నమ్మేటంతటి అమాయకులు కారు ఇప్పటి ప్రజలు.

సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ పై చేసిన ప్రచారం చాలదన్నట్లు లేటెస్ట్ గా ఢిల్లీలోని జవహర్​లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్​యు) ఎపిసోడ్ ను లెఫ్ట్ పార్టీలు తలకెత్తుకున్నాయి. యూనియన్ల ముసుగులో కొంతమంది స్టూడెంట్స్ హింసకు పాల్పడితే దానిని కూడా కేంద్ర ప్రభుత్వ అకౌంట్ లోకి వేయడానికి ప్రయత్నాలు చేశాయి. హింస ఎక్కడ జరిగినా వ్యతిరేకించాల్సిందే. ప్రజాస్వామ్యంలో  హింసకు తావు లేదు. అయితే ఈ విషయంలో  లెఫ్ట్ పార్టీలకు ఒక పాలసీ అంటూ లేదు. డబుల్ స్టాండర్డ్స్ తో  పనిచేస్తుంటాయి. నిరసన పేరుతో ఢిల్లీలో  పబ్లిక్  ప్రాపర్టీని ధ్వంసం చేస్తే  ఆ విషయాన్ని పట్టించుకోవు. కేరళలో రాజకీయ ప్రత్యర్థుల హత్యలు జరిగితే నోరు మెదపవు. రాజ్యాంగం, గాంధీయిజం ఇవేమీ అప్పుడు గుర్తుకురావు.

అనేక అంశాల పట్ల లెఫ్ట్ పార్టీల నాయకులు  హిపోక్రసీతో  వ్యవహరిస్తుంటారు.  తస్లిమా నస్రీన్ పుస్తకం నిషేధానికి గురైనప్పుడు  ‘ ఫ్రీడం ఆఫ్ ఎక్స్​ ప్రెషన్ ’ ను గురించి మాట్లాడరు. హిందూ దేవతల బొమ్మలు టాయిలెట్ల పై కనిపించినా ఏమాత్రం రియాక్ట్ కారు. అదేదో సాధారణ విషయమైనట్లు ప్రవర్తిస్తారు.

జాతీయవాదం పదమే నచ్చదు

లెఫ్ట్ పార్టీలకు ఎందుకో గానీ మొదటి నుంచి ‘నేషనలిజం’ అనే మాటే నచ్చదు. అసలు జాతీయవాదం అనేదానికి అర్థమే లేదని చాలా మంది కమ్యూనిస్టులు బలంగా నమ్ముతారు. రకరకాల కారణాలు చెప్పి దేశాన్ని ముక్కలు చేయాలని ప్రయత్నించే వేర్పాటు వాదులకు వీళ్లు అండగా నిలబడుతుంటారు. జమ్మూ కాశ్మీర్ ను కొన్నేళ్ల పాటు అభివృద్ధికి దూరంగా నెట్టేసిన ఆర్టికల్ 370 ను రద్దు చేయడాన్ని  లెఫ్ట్ పార్టీలు వ్యతిరేకించిన విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. సివిల్ వ్యవహారాలకు సంబంధించి దేశ ప్రజలందరికీ ఒకే చట్టం ‘కామన్ సివిల్ కోడ్’ ఉండాలని అందరూ భావిస్తుంటే కమ్యూనిస్టులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఎన్డీయే టూ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి,  ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నాయి లెఫ్ట్  పొలిటికల్ పార్టీలు.

‑ వినయ్ సహస్రబుద్దే, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఎంపీ (రాజ్యసభ )