బ్యారేజీలు సరిగ్గా పనిచేస్తే ప్రజలకు ఎంతో లాభం జరుగుతుందన్నారు కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్. బ్యారేజీల వల్ల లాభం తప్ప నష్టం లేదని అనిపిస్తోందని చెప్పారు. ఈ మేరకు ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ విచారణ కొనసాగిస్తోన్న ఆయన మీడియతో కీలక విషయాలపై మాట్లాడారు. ఎక్కడో ఏదో తప్పుడు లెక్కల వల్ల ఇలా జరిగింది అనిపిస్తోందని వెల్లడించారు. జూన్25 లోపు విచారణకు వచ్చిన అందరూ అఫిడవిట్ ఫైల్ చేయాలని చెప్పామన్నారు. జరిగిన, తెలిసిన అంశాలను అఫిడవిట్ రూపంలో సమాధానం ఇవ్వాలని చెప్పామన్నారు. తప్పుడు అఫిడవిట్ ఇచ్చినట్లు తేలితే చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై నిన్న, ఈ రోజు ఇంజనీర్లతో సమావేశం జరిపామన్నారు జస్టిస్ చంద్ర ఘోష్. రేపటినుంచి ఏం చేయాలనేదానిపై లిస్టు రెడీ చేస్తామని తెలిపారు. త్వరలో నిర్మాణ సంస్థలను పిలుస్తామన్న ఆయన..ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులో అధికారులు ఉంటే వాళ్లకు కూడా నోటీసులు ఇస్తామని తెలిపారు. ప్రతీ ఒక్కరూ నిబంధనల ప్రకారమే వ్యవహరించాలని చెప్పారు. జూన్ 30లోపు విచారణ పూర్తి కాదని, ఇంకా సమయం పడుతుందని అన్నారు. అసలు విషయాలు, నిజాలు తెలుసుకోకుండా పూర్తి నివేదిక ఇవ్వలేనని తెలిపారు. మొన్నటి వరకు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి కొంత ఆలస్యం అవుతుందన్నారు.