ఫోన్ ట్యాపింగ్ చేసినోళ్లపై చర్యలుంటయ్ : పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి

  • కుల, మతాలను రెచ్చగొట్టే బీజేపీకి చరమగీతం పాడాలి
  • కేంద్రంలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్సేనని వెల్లడి 

వైరా, వెలుగు: రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌ చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, వారికి సువ్వలు లెక్కపెట్టే రోజులు దగ్గరపడ్డాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ రెడ్డి అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ వైరా నియోజకవర్గ ఖమ్మం పార్లమెంటరీ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌‌‌‌‌‌‌‌తో కలిసి పొంగులేటి మాట్లాడారు.

 గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌తో కాంగ్రెస్ లీడర్లను ఇబ్బంది పెట్టారని, దీనికి సంబంధించి బాధ్యులపై చట్టపరంగా చర్యలు ఉంటాయని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడాలని ఆయన పిలుపునిచ్చారు. కుల మతాలను రెచ్చగొట్టే బీజేపీకి వచ్చే ఎన్నికల్లో చరమగీతం పాడాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే ఐదు అమలు చేశామని తెలిపారు. 

కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో రూ.లక్షల కోట్లు దోచుకుందని, నీటిని స్టోరేజీ చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ఎండా కాలంలో నీటి సమస్యను తెరమీదకు తెచ్చి ప్రజల వద్దకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ వారిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. 

గత బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వంలో మంత్రులు భూ కబ్జాలకు పాల్పడ్డారని, వారికి తగిన శాస్తి జరిపిస్తామని మంత్రి హెచ్చరించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ముందుగా పాత బస్టాండ్‌‌‌‌‌‌‌‌ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, వైరా మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్ తదితరులు పాల్గొన్నారు.