
- జీవో 29ను రద్దు చేయాలనే పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
- ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్స్ విడుదల చేసిన టీజీపీఎస్సీ
- త్వరలో 1:2 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలన
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో గ్రూప్1 నియామకాలకు న్యాయపర చిక్కులు తొలిగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 29ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించి 2022లో ఆనాటి బీఆర్ఎస్ సర్కార్ జారీ చేసిన జీవో 55ను సవరిస్తూ.. ఫిబ్రవరి 8న తెలంగాణ సర్కార్ కొత్తగా జీవో 29ని జారీ చేసింది.
ఈ జీవో -29ని రద్దు చేయాలని సూరేపల్లి శ్రీనివాస్ ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు గత తీర్పునకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జోవో 29ని తీసుకొచ్చిందని, దీని వల్ల రాష్ట్రంలో వేల మంది అభ్యర్థులకు నష్టం జరిగిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ పమిడిఘంటమ్ శ్రీ నరసింహా, జస్టిస్ జే బాగి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా గతంలోనే జీవో 29పై పిటిషన్లు దాఖలయ్యాయని, వాటిని సుప్రీంకోర్టు తిరస్కరించిందని బెంచ్ గుర్తు చేసింది. గ్రూప్1కు సంబంధించి నియామక ప్రక్రియ చివరి దశలో ఉందని, ఈ టైమ్‌లో అందులో కలగజేసుకోలేమని వ్యాఖ్యానిస్తూ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. దీంతో గ్రూప్1 ఉద్యోగ నియామక ప్రక్రియకు న్యాయపర అడ్డంకులు తొలగినట్లయింది. కాగా, ఇప్పటికే టీజీపీఎస్సీ గ్రూప్1 జనరల్ ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది.