లోపాలు సరిచేయకపోతే ధరణి పోర్టల్‌తో​ లీగల్ సమస్యలు

లోపాలు సరిచేయకపోతే ధరణి పోర్టల్‌తో​ లీగల్ సమస్యలు

ధరణి అగ్రికల్చర్​ పోర్టల్ ప్రారంభమై నెలన్నర దాటుతున్నా అనేక టెక్నికల్​ ఇష్యూస్​ ఇప్పటికీ వెంటాడుతున్నాయి. రిజిస్ట్రేషన్లు చేసే క్రమంలో తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, ఆపరేటర్లు కొన్ని సమస్యలకు పరిష్కారం దొరక్క తలపట్టుకుంటున్నారు. ధరణిలో తలెత్తిన కొన్ని లోపాలను సవరించకపోతే భవిష్యత్​ లో అనేక లీగల్ సమస్యలు వచ్చే ప్రమాదముంది. పార్ట్​ బీ భూములకు పరిష్కారం చూపాలి. మ్యుటేషన్​ కాని భూముల డబుల్​ రిజిస్ట్రేషన్​ కు చెక్​ పెట్టే విధానాన్ని తీసుకురావాలి. ధరణి పోర్టల్​లో ఎదురవుతున్న కొన్ని సమస్యలను తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్(ట్రెసా) తరపున మేం గుర్తించాం. వీటికి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ధరణిలో మేము గుర్తించిన సమస్యలు ఏమిటంటే..

ఎన్నో సమస్యలు ఎదురవుతున్నయ్

కొత్త పట్టాదారు పాస్​బుక్​ యాక్ట్–2020 అమల్లోకి వచ్చిన తర్వాత ఇనాం, సీలింగ్, కౌలు, పీవోటీ, అసైన్​మెంట్, వక్ఫ్, భూదాన్​ లాంటి భూముల కేసులను పరిష్కరించేందుకు, పార్ట్–బీ కేసుల పరిష్కారానికి సరైన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 15 లక్షలకుపైగా అర్జీల సంగతిని ప్రభుత్వం మరిచింది. ధరణి పోర్టల్ వచ్చాక అందులో తమ భూముల వివరాలు లేకపోవడంతో రెవెన్యూ అధికారులపై రైతులు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. వీటి పరిష్కారానికి ప్రభుత్వం త్వరగా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలి.

ధరణి పోర్టల్ అమల్లోకి రావడానికి కొన్ని నెలల ముందు రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్‌‌, విరాసత్‌‌ అయిన కొన్ని  భూములకు కొత్త పట్టాదారు పాస్​ బుక్స్​ జారీ కాలేదు. దీంతో ఆ భూముల  వివరాలు ధరణిలో కనిపించడం లేదు. ఈ వివరాలను ధరణిలో నమోదు చేయాలని బాధితులు కోరడంతో తహసీల్దార్లు ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ సమస్యకు పరిష్కారం చూపాలి.

తహసీల్దార్లకు ఆప్షన్​ ఇవ్వాలి

గతంలో రిజిస్ట్రేషన్ అయిన కొన్ని భూములకు సంబంధించి ఆన్‌‌ లైన్‌‌ లో మ్యుటేషన్​ పెండింగ్​ లో ఉండడంతో ధరణిలో పాత యజమాని పేరే కనిపిస్తోంది. దీంతో సదరు వ్యక్తి ఆ భూములను వేరొకరికి రిజిస్ట్రేషన్​ చేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల ఇలాంటి ఘటనలు వెలుగు చూశాయి. అందుకే ధరణికి ఈసీని అనుసంధానం చేస్తే తహసీల్దార్లు చెక్​ చేయడానికి అవకాశం ఉంటుంది. పట్టాదారు పాస్​ బుక్ లో నమోదైన భూమి విస్తీర్ణానికి, వాస్తవ భూ విస్తీర్ణానికి తేడాలు ఉన్నాయి. ఇలాంటి సమస్యలపై లక్షలాది దరఖాస్తులు తహసీల్దార్ ఆఫీసుల్లో పెండింగ్ లో ఉన్నాయి. ధరణిలో రికార్డులు సరి చేసేందుకు తహసీల్దార్లకు ఆప్షన్​ ఇస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. గతంలో అగ్రిమెంట్​ ఆఫ్​ సేల్​ కం జనరల్ పవర్​ ఆఫ్​ అటార్నీ(ఏజీపీఏ) చేసుకుని ఉన్న  వ్యక్తులు సదరు ఆస్తిని మరొకరికి రిజిస్ట్రేషన్‌‌ చేసేందుకు ప్రస్తుతం ధరణి పోర్టల్‌‌ లో ఆప్షన్‌‌  లేదు. ఇందుకోసం ఏజీపీఏ ఉన్న వ్యక్తులు ధరణిలో స్లాట్ బుక్​ చేసుకునే అవకాశమివ్వాలి. తల్లిదండ్రుల భూములను విరాసత్​ చేసుకుంటున్న వ్యక్తులు తమ జాయింట్​ స్టేట్ మెంట్ లో కుటుంబంలో పెళ్లయిన మహిళలు, ఇతర కుటుంబ సభ్యుల పేర్లు ఇవ్వకుండానే ధరణి పోర్టల్‌‌ లో దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో సివిల్‌‌ తగాదాలు పెరిగే అవకాశం ఉంది. ఈ సమస్యకు పరిష్కారం చూపాలి.

డాక్యుమెంట్స్​ కాపీలను మీసేవ ద్వారా తీసుకునే చాన్స్​ ఇవ్వాలి

వ్యవసాయ భూముల్లో కొంత వ్యవసాయేతర భూమిగా మారింది. ఫీల్డ్ లో సరైన సమాచారం లేక ఈ భూమిని ప్లాట్లు అని ధరణిలో నమోదు చేశారు. ఇలాంటి ఫిర్యాదులు కూడా రాష్ట్రవ్యాప్తంగా వేలల్లో ఉన్నాయి. ఇలా నమోదైన ప్లాట్లను తిరిగి వ్యవసాయ భూములుగా నమోదు చేసేందుకు ఆప్షన్‌‌ ఇవ్వాలి.రాష్ట్రంలో తహసీల్దార్ల డిజిటల్ సంతకం కాక పట్టాదారు పాస్​ బుక్స్​ నిలిచిపోయిన ఖాతాలు లక్షల్లో ఉన్నాయి. ఇలాంటి ఖాతాల్లో డిజిటల్ సైన్​ చేసేందుకు తహసీల్దార్లకు ఆప్షన్​  ఇవ్వాలి. ధరణి పోర్టల్‌‌లో జరుగుతున్న రిజిస్ట్రేషన్‌‌ ప్రక్రియలో భాగంగా ఏదైనా భూవివాదంలో కోర్టులు జారీ చేసిన స్టే ఆర్డర్‌‌, స్టేటస్‌‌ కో తదితర ఉత్తర్వుల విషయంలో తహసీల్దార్లు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు కోర్టు ఉత్తర్వులను పరిశీలించి.. వారే రిజిస్ట్రేషన్​ నిలిపివేసేలా ఆప్షన్​ ఇవ్వాలి. ధరణిలో రిజిస్టర్​ అయిన డాక్యుమెంట్స్‌‌​ జిరాక్స్​ కాపీలను మీసేవ ద్వారా తీసుకునే అవకాశమిస్తే రైతులకు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ తప్పనుంది.

ధరణి పోర్టల్​లో ఎదురవుతున్న ఈ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలి. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వానికి మేము మెమొరాండం అందజేశాం. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

భూమి మొత్తానికి చలానా జనరేట్​ అవుతోంది

భూమిలో కొంత అమ్మినప్పుడు, లేదా గిఫ్ట్​ రిజిస్టర్​ చేసినప్పడు ఆ భూమికి మాత్రమే చలానా జనరేట్ కావాల్సి ఉండగా, మొత్తం భూమికి చలానా జనరేట్ అవుతోంది. ఇది ప్రజలకు భారంగా మారింది. ప్రభుత్వం వివిధ ప్రాజెక్టుల కోసం సేకరించిన భూముల వివరాలు పూర్తి స్థాయిలో ధరణిలో నమోదు కాలేదు. దీంతో అన్యాక్రాంతమయ్యే ప్రమాదముంది. ఇలాంటి భూముల సర్వే నంబర్లు, విస్తీర్ణాన్ని మొత్తం  ధరణిలో ఎంట్రీ చేయాల్సి ఉంది. ధరణిలో నమోదైన డాటాలో భూమి యజమాని పేరు, ఇంటి పేరులో తప్పులు దొర్లాయి. ఇలాంటి క్లరికల్‌‌ తప్పులను సవరించడానికి తహసీల్దార్లకు అవకాశం కల్పించాలి. క్షేత్ర స్థాయిలో రోజువారీగా ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను సీసీఎల్​ఏ స్థాయిలో మానిటరింగ్‌‌ అథారిటీ ద్వారా వెంటనే పరిష్కారమయ్యేలా ఆదేశాలు జారీచేయాలి.

జాయింట్​ రిజిస్ట్రేషన్‌‌ కావట్లే

అగ్రికల్చర్​ ధరణి పోర్టల్‌‌లో రిజిస్ట్రేషన్‌‌ చేసుకునే క్రమంలో కొనుగోలుదార్లు ఒకరి కన్నా ఎక్కువ మంది ఉంటే జాయింట్​ రిజిస్ట్రేషన్‌‌ కావడం లేదు. నలుగురైదుగురు కలిసి కొనుగోలు చేసినా రిజిస్ట్రేషన్​ అయ్యేలా ఆప్షన్​ ఇవ్వాలి.   పెండింగ్​ మ్యుటేషన్​ కోసం ధరణి పోర్టల్​ లో అప్లై చేసుకున్నప్పుడు కొందరికి చలానా జనరేట్​ అయినప్పటికీ స్లాట్ బుక్‌‌ కావడం లేదు. దీంతో మ్యుటేషన్‌‌ పూర్తికావడం లేదు. రెండు నెలల క్రితం మరోసారి ప్రభుత్వం సాదాబైనామా దరఖాస్తులను స్వీకరించింది. సాదాబైనామాల దరఖాస్తుల పరిష్కారం, ధరణిలో వివరాల నమోదుపై గందరగోళం నెలకొంది. వీటిపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలి. తల్లిదండ్రుల పేరిట ఉన్న అసైన్డ్ భూములను వారసత్వంగా వారి పిల్లల పేరిట రిజిస్టర్​ చేసుకునే వెసులుబాటు ఉన్నా ధరణిలో అసైన్డ్​ భూములు విరాసత్‌‌ కావడం లేదు. ఈ సమస్యకు ధరణిలో పరిష్కారం చూపాలి.

– వంగా రవీందర్​ రెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా)

For More News..

ఫస్ట్​ పనులు.. ఆ తర్వాతే ఎన్నికలు.. టీఆర్ఎస్ కొత్త వ్యూహం

రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యం

ప్రతి నెలా వెయ్యెకరాల్లో టమాట వెయ్యాలె