నిజామాబాద్, వెలుగు: సామాన్యులకు సైతం న్యాయ సాయం అందేలా సేవలను మరింత విస్తృతపర్చాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ అన్నారు. ప్రజల న్యాయ సంబంధిత సమస్యల పరిష్కారంలో న్యాయ వ్యవస్థ అగ్రభాగాన ఉందని వెల్లడించారు. రోటరీ క్లబ్ సహకారంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నిజామాబాద్ కలెక్టరేట్‌లో 263 మందికి కృతిమ కాళ్లును ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ఉజ్జల్ భుయాన్‌తో పాటు హైకోర్టు న్యాయమూర్తులు పి.నవీన్‌రావు, పి.శ్రీసుధా చీఫ్‌గెస్ట్‌గా హాజరయ్యారు. ముందుగా ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్దకు చేరుకున్న చీఫ్ జస్టిస్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా జడ్జి కె.సునీత, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఇన్‌చార్జి పోలీస్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు బొకేలు అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన మీటింగ్‌లో ఉజ్జల్ భుయాన్ మాట్లాడారు. వైకల్యంతో బాధపడుతున్న వారికి కృత్రిమ అవయవాలు ఉపయోగపడతాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ తరహా సేవా కార్యక్రమాలు కొనసాగించాలని సూచించారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలను మమేకమై సామాజిక మార్పు కోసం పనిచేయాలన్నారు. ఉచిత న్యాయసేవలు పొందడం పౌరుల ప్రాథమిక హక్కు అని, దానిని ఎల్లవేళల అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బి.చంద్రశేఖర్, జిల్లా జడ్జీలు, న్యాయశాఖ అధికారులు, హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యులు ఎం.రాజేందర్ రెడ్డి, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రం గణపతి, రోటరీ క్లబ్ అధ్యక్షుడు సతీశ్ షా పాల్గొన్నారు.
హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కలిసిన జడ్జీలు
కామారెడ్డి, వెలుగు: హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జడ్జి నవీన్‌రావు ఆదివారం హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తూ మార్గమధ్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొద్ది సేపు ఆగారు. ఆర్ అండ్‌బీ గెస్ట్‌హౌజ్ చేరుకున్న ఛీప్ జస్టిస్‌కు కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి స్వాగతం పలికారు. స్థానిక జడ్జిలతో పాటు బార్ అసోసియేషన్ ప్రతినిధులు చీఫ్ జస్టిస్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.