చట్ట బద్ధంగా ఎన్నికైన పాలకులే నిరంకుశంగా పాలిస్తున్రు

నిరంకుశ పాలన విషయంలో సమాజంలో పరిమితమైన అవగాహన ఉన్నది. సైనిక అధికారులు పాలనలో ఉంటే, మార్షల్ లా, ఎమెర్జెన్సీ వంటి ప్రకరణలను విధించినప్పుడే నిరంకుశ పాలన వస్తుందని అనుకుంటాం. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. చట్ట బద్ధంగా ఎన్నికైన పాలకులే నిరంకుశ పాలన చెలాయిస్తున్నారు. అందుకు మన రాష్ట్రం ఉదాహరణ. తెలంగాణాలో నిరంకుశ  పాలన సాగుతున్నది. ఈ పాలనకు ఏక వ్యక్తి పాలన, నిరంకుశత్వం, నిధుల దుర్వినియోగమనే లక్షణాలు ఉంటాయి.

మనం ఇది వరకు చూడని పాలనా సంస్కృతి తెలంగాణలో అభివృద్ధి చెందింది. ఏ వ్యవస్థలూ పనిచేయడం లేదు. నియమ, చట్టబద్ధమైన పాలన లేదు. అధికార యంత్రాంగాన్ని పాలకుల ఇష్టానుసారం, వారి ప్రయోజనాల కోసం ఉపయోగించే పద్దతి బలపడింది. ప్రజల భాగస్వామ్యాన్ని నిలువరించడానికి చేయని ప్రయత్నం లేదు. ఏ పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినా అనుమతులు ఇవ్వడం లేదు.

కార్యకర్తలను సెక్షన్151 ఉపయోగించి రాత్రుళ్లు ఇంటి వద్దనే అరెస్టు చేస్తున్నారు. సెక్షన్ 30, సెక్షన్ 144 నిబంధనలను ఎప్పుడు పడితే అప్పుడు ప్రయోగిస్తున్నారు. పార్టీలకే కాదు సాధారణ ప్రజలకు కూడా న్యాయసమ్మతమైన డిమాండ్ల సాధనకు అనుమతులు ఇవ్వడం లేదు. అరెస్టులకు పాల్పడుతున్నారు.

ఈ ఎనిమిదేండ్ల పాలనలో ఉద్యోగ భద్రత కోసం ఆందోళన చేసిన కాంట్రాక్టు ఉద్యోగులతో, కమిషన్ పెంచాలని కొట్లాడిన రేషన్ డీలర్లతో, తమ హక్కుల కోసం సంఘటితమైన  భూ నిర్వాసితుల పట్ల, ఉద్యోగాలు కోల్పోయిన కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో, అటవీ హక్కుల చట్టం ప్రకారం భూమిపై హక్కులను కోరిన ఆదివాసులు, గిరిజనులు, పేద రైతుల పట్ల, స్కాలర్​షిప్​ల కోసం కదిలిన విద్యార్థులతో, ఉద్యోగాలడిన నిరుద్యోగులతో, గిట్టుబాటు ధర కోసం రోడ్డెన రైతుల విషయంలో, వీఆర్ఏల్ తోనూ అదే రీతిలో వ్యవహరించారు. నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన వారిని బెదిరించి ఆ కార్యక్రమాలను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెస్తారు. వినకపొతే అరెస్టుల పర్వం మొదలవుతుంది. 

కోర్టుల జోక్యంతోనే స్పందించి..

నిరసనకు వేదికైన ధర్నా చౌక్​ను మూసేశారు. అఖిల పక్ష ఆందోళనల తర్వాత కుడా ప్రభుత్వ వైఖరి మారలేదు. కోర్టు జోక్యంతోనే న్యాయం జరిగింది. పౌరులకు  న్యాయం చేకూర్చడానికి  రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన సమాచార కమిషన్, మానవ హక్కుల వేదిక, మహిళా కమిషన్ వంటి సంస్థలకు సభ్యులను నియమించలేదు. చివరకు కోర్టు ఉత్తర్వులతోనే ప్రభుత్వం సభ్యులను నియమించింది.

ఎవరైనా మాట్లాడితే.. దబాయింపు, బెదిరింపు తప్ప ప్రజల సమస్యలకు పరిష్కారాలను వెతికే ప్రయత్నం జరగడం లేదు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియాను, ప్రభుత్వం ప్రకటనల ఎర చూపి నియంత్రిస్తుండటం వల్ల ప్రజాస్వామిక చర్చకు అవి వేదికలుగా నిలబడలేకపోతున్నాయి. ధర్నాలు, నిరసన ర్యాలీలు, సభలు నిషేధించడంతో ఆ మార్గాన ప్రజల గొంతు వినిపించే అవకాశం అడుగంటి పోయింది.

ఒక రకంగా రాజకీయాలు మృతప్రాయం అయ్యాయి. ప్రజల భాగస్వామ్యం తగ్గిపోయింది. ఇప్పుడు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, ఎన్నికల్లో గెలవడానికి అధికార పార్టీ అనుసరిస్తున్న మార్గం ఏమిటంటే ఎన్నికల మేనేజ్​మెంట్, మీడియా మేనేజ్​మెంట్, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల మేనేజ్​మెంట్. ప్రజలు కేంద్రంగా చేసే రాజకీయాలు సమాజాన్ని ముందుకు నడిపిస్తాయి. మేనేజ్​మెంట్ పద్ధతులు పదవుల్లో ఉన్న వాళ్లకే లాభం చేస్తాయి.

పాలిటిక్స్,- ఆర్థిక రంగం వేరుగా లేవు

టీఆర్ఎస్ పాలనలో రాజకీయాలు, ఆర్థిక రంగం పెనవేసుకుపోయాయి. వాస్తవానికి ప్రజాస్వామ్య దేశాల్లో ఈ రెండూ విడివిడిగా ఉండాలి. ఆస్తి, అంతస్తు, హోదా, ప్రతిపత్తితో నిమిత్తం లేకుండా ప్రతీ వ్యక్తి తనకు నచ్చిన పని, వృత్తి చేసుకోవచ్చు. అందులో ప్రభుత్వ జోక్యం ఉండదు. ప్రభుత్వం అందరికీ సమాన అవకాశం కల్పించాలి. ఈ పరిస్థితి తెలంగాణలో లేదు.  ప్రజలు ఓట్ల ద్వారా ఇచ్చిన అధికారాన్ని సమష్టి  వనరులను కొల్లగొట్టడానికి, కొన్ని సార్లు ప్రైవేట్ ఆస్తులను కాజేయడానికి వాడుకోవడం ఇప్పుడు తెలంగాణాలో విచ్చల విడిగా కొనసాగుతున్నది.

ఈ దోపిడీపై ఏ అదుపూ లేదు. అధికార యంత్రాంగంపై చట్టబద్ధమైన నియంత్రణ ఏదీ పని చేయడం లేదు. ‘‘కేసీఆర్ తో చేతులు కలిపితే, ఆయనతో జతకడితే ఏ ఇబ్బందులు ఉండవు. యథేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవచ్చు. వ్యవహారాలు నడుపుకోవచ్చు. అట్ల కాకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది” అని నాయకులు, అధికారులు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు ఒక్కటై వ్యాపారాలు దక్కించుకుంటారు.

పత్రికలకు ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల పంపిణీ హక్కులు పొందడానికి, ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టులు చేజిక్కించుకోవడానికి, కంప్యూటర్ సేవలు అందచేసే కాంట్రాక్టులు దక్కించుకోవడానికి, భూముల సెటిల్​మెంట్లకు, ఇసుక పర్మిట్ల సాధనకు, సివిల్ కాంట్రాక్టులు పొందడానికి, కంపెనీలకు స్థలం మంజూరు కోసం వ్యాపార దక్షత కన్నా   అధికారంలో ఉన్న నాయకులతో పరిచయమే కీలకం. 

ఓట్లు కొనే ప్రక్రియలా ఎన్నికలు

సివిల్ కాంట్రాక్టుల డిజైన్లను ఇంజనీర్ల కన్నా కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు కలిసే నిర్ణయిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు సైటును మార్చడం విషయంలోనూ, ప్రాజెక్టు డిజైన్ విషయంలోనూ నాయకుల ప్రమేయమే ప్రధానమైంది. ఫలితంగా రూ. 30,000 కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు వ్యయం 1,25,000 కోట్ల రూపాయలకు పెరిగింది. నేడు రాష్ట్రంలో వ్యాపార దక్షతకన్నా, ప్రభుత్వంతో ఉన్న సంబంధాల వల్ల డబ్బు సంపాదిస్తున్న వాళ్లే ఎక్కువ కనబడతారు.

రాజకీయ అధికారానికి వ్యాపార కార్యకలాపాలకు నడుమ సంబంధం పెనవేసుకుపోయిన పరిస్థితిలో రాజకీయ అధికారాన్ని నిలబెట్టుకోవాలన్న తపన బలంగా ఉంటుంది. గతంలో ఒక సిద్ధాంతం కోసమో, ఒక విధానం అమలు కోసమో  అధికారాన్ని కోరుకునేవారు. ఇప్పడు అట్లా కాదు. అధికారం డబ్బు సంపాదనకు కీలకమైన సాధనంగా మారిన ప్రస్తుత తరుణంలో  అధికారం పోవడమంటే ఆస్తి పోయినట్టే. అంతే కాదు సంపాదనకు చేసిన తప్పుడు పనులను కప్పిపుచ్చుకోవడానికి అధికారాన్ని నిలబెట్టుకోవాలి. కానీ చేసిన అక్రమాల వల్ల నాయకత్వం స్థానికంగా పరపతిని కోల్పోయింది.

ఇప్పుడు మళ్లీ గెలవాలంటే ఎన్నికల ప్రక్రియను ఓట్ల కొనుగోలు కార్యక్రమంగా మార్చక తప్పని పరిస్థితి వచ్చింది. కలుషితమైన ఎన్నికలు ఎట్లా ఉంటాయో ఇప్పుడు చూస్తున్నాం. ప్రభుత్వ అధికారాన్ని పాలకులు సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించినప్పుడు, అధికారాన్ని ఆస్తులను పోగేసుకోవడానికి వాడినప్పుడు సమాజ ప్రయోజనాలను పూర్తిగా ప్రభుత్వం పక్కనబెడుతుంది.

పర్యావసానం ఏమిటంటే ఇయ్యాల తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వమే ఆటంకంగా మారింది. ఈ పాలన మారకుండా, రాజ్యాంగ బద్ధమైన పాలన రాకుండా తెలంగాణ పురోభివృద్ధి సాధ్యం కాదు. ప్రజస్వామిక పాలన మాత్రమే అభివృద్ధిని తీసుకురాగలదు. ఇప్పుడు మునుగోడు ఉప-ఎన్నికలో ప్రజాస్వామిక పాలన కోసం నిలబడాల్సిన ప్రతిపక్షాలు టీఆర్ఎస్ లాగే డబ్బులు కుమ్మరించి గెలవాలని చూస్తున్నాయి తప్ప ప్రజాస్వామ్యాన్ని బలోపేతం కోసం ప్రత్ర్యామ్నాయ మార్గాలను వెతికే ప్రయత్నం చేయడం లేదు. ఇది దురదృష్టకర పరిణామం.

ఏక వ్యక్తి పాలన

ఇయ్యాళ తెలంగాణాలో ఒక వ్యక్తి తన కుటుంబం, అనుచరగణం సాయంతో పాలన నడుపుతున్నాడు. ఇందులో ఏ వ్యవస్థకూ పాత్ర లేదు. సెక్రటేరియట్ అనే వ్యవస్థ కుప్పకూలిపోయింది. సీఎం సెక్రటేరియట్​కు వెళ్లకుండా తన నివాసం నుంచి పాలన చేస్తుంటే ఇక సెక్రటేరియట్​కు ప్రాధాన్యం ఎట్లా వస్తుంది? ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలకు ఆమోదముద్ర వేసేందుకే క్యాబినెట్ సమావేశం ఆనవాయితీగా జరుగుతుంటుంది.

అనేక సార్లు సంబంధిత మంత్రి లేకుండానే ఆయా శాఖల సమీక్షా సమావేశాలను తరచూ ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నాడంటే మంత్రుల స్థానం ఏమిటో తెలుస్తూనే ఉన్నది. వారికి కనీసం సమాచారం కూడా ఉండదు. సమీక్షా సమావేశం జరుగుతున్నట్టుగా విలేకరుల ద్వారా మంత్రులకు  తెలుస్తుంటది. రెండో సారి ఎన్నికైన తర్వాత అధికార కేంద్రీకరణ ఇంకా ఎక్కువైంది.

మొదటి దఫా మంత్రులకు, సెక్రటరీలకు అప్పుడో ఇప్పుడో మాట్లాడే అవకాశం దొరికేది. ఇప్పుడు అదీ లేదు. ముఖ్యమంత్రి ఇచ్చే ఫర్మానాల ప్రకారం ప్రభుత్వ కార్యకలాపాలు జరుగుతుంటాయి. అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ప్రతిరూపాలుగా ఉన్నంత వరకే తమ స్థానంలో ఉంటారు. అందరి ఫోన్లు నిరంతరం ట్యాప్ అవుతుంటాయి. కాబట్టికలలో కూడా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడటానికి కాదు కదా ఆలోచించడానికి కూడా సాహసించరు. ప్రగతి భవన్ ఒక గడి. సీఎం అక్కడి నుంచి రాచరిక పాలన నడిపిస్తున్నారు. ఈ గడిలోకి సునాయాసంగా ప్రవేశించగలిగేది ఆంధ్రా కాంట్రాక్టర్లు, కార్పొరేట్ శక్తులే.

ఇయ్యాళ తెలంగాణలో కాంట్రాక్టులు వారివే, కళాశాలలు వారివే. ఎప్పుడైతే చట్టబద్ధమైన పాలనా యంత్రాంగం ఒక వ్యక్తి నియంత్రణలో సాగుతుంటదో అప్పుడు ఆ వ్యవస్థ అందరి వ్యవస్థగా మిగలదు. అది గుప్పెడు మంది నాయకుల జేబు సంస్థగా మారిపోతుంటది. ఆ వ్యవస్థ నియంత్రించే వ్యక్తుల ఆదేశాల మేరకు, వారి అవసరాల మేరకు పనిచేస్తుంటది. - ఎం.కోదండరాం, అధ్యక్షులు, తెలంగాణ జన సమితి