లాహోర్: వన్డే వరల్డ్ కప్‌లో చెత్తాటతో నిరాశ పరుస్తున్న పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌కు మరో షాక్ తగిలింది. పాక్ నేషనల్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ పదవికి లెజెండరీ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్ రాజీనామా చేశాడు. పాక్ టీమ్ క్రికెటర్లను మేనేజ్ చేసే యజూ ఇంటర్నేషనల్ కంపెనీతో అతని అనుబంధం విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందా? అని తేల్చేందుకు పీసీబీ ఐదుగురితో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కంపెనీతో తన అనుబంధం సెలెక్టర్‌గా తన నిర్ణయాధికారాన్ని ప్రభావితం చేయలేదని ఇంజమామ్ స్పష్టం చేశాడు. అయినా విచారణ పూర్తయ్యే వరకు పక్కకు తప్పుకోవడమే మంచిదని రాజీనామా చేసినట్లు తెలిపాడు.