దేశంలో మరో బిజినెస్ టైకూన్ కన్నుమూశారు. 2024, అక్టోబర్ 9వ తేదీన భారత దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా మృతి చెందగా.. గురువారం (అక్టోబర్ 31) బీపీఎల్ గ్రూప్ చైర్మన్ గోపాలన్ నంబియార్ (94) కన్నుమూశారు. గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన.. బెంగుళూరులోని తన నివాసంలో ఇవాళ తుదిశ్వాస విడిచారు. గోపాలన్ నంబియార్ మృతిని అతని అల్లుడు, మాజీ కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ధృవీకరించారు.
ఈ మేరకు రాజీవ్ చంద్రశేఖర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రాజీవ్ చంద్రశేఖర్ మృతికి సంతాపం తెలిపారు. వ్యాపార దిగ్గజం గోపాలన్ నంబియార్ మృతి పట్ల ప్రధాని మోడీ సైతం సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. గోపాలన్ నంబియార్ మృతి బాధ కలిగించిందని.. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలిపారు. భారతదేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడంలో గోపాలన్ నంబియార్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు.
1963లో నంబియార్ బీపీఎల్‌ను స్థాపించారు. కేరళలోని పాలక్కడ్‌లో ఫస్ట్ బీపీఎల్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పిన నంబియార్.. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల బీపీఎల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను బెంగళూరుకు తరలించాడు. 90ల్లో కలర్ టీవీ, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషీన్లు తయారు చేసి ఆ రోజుల్లో దేశీయ మార్కెట్‌లో బీపీఎల్ ఒక సంచలనం సృష్టించింది. శాంసంగ్, ఎల్‌జీ వంటి అంతర్జాతీయ కంపెనీలు భారత మార్కెట్‌లో అడుగు పెట్టడంతో మార్కెట్‌లో బీపీఎల్ డౌన్ ఫాల్ అయ్యింది. బీపీఎల్ గ్రూప్ బాధ్యతలను ప్రస్తుతం గోపాలన్ నంబియార్ తనయుడు అజిత్ నంబియార్ పర్యవేక్షిస్తున్నారు. బీపీఎల్‌కు ఛైర్మన్‌గా, సీఈఓగా అజిత్ నంబియారే వ్యవహరిస్తున్నారు.