704 ఔట్ క్రికెట్​కు ఇంగ్లండ్ లెజెండ్ జేమ్స్ అండర్సన్ గుడ్‌‌‌‌‌‌‌‌బై

  • టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా  రికార్డు 
  • విండీస్‌‌‌‌‌‌‌‌తో తొలి టెస్టులో  ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ గెలుపు

లండన్‌‌‌‌‌‌‌‌ : ఇంగ్లండ్ లెజెండరీ పేసర్ జేమ్స్‌‌‌‌‌‌‌‌ అండర్సన్‌‌‌‌‌‌‌‌ తన  టెస్టు కెరీర్ మొదలెట్టిన చోటే అద్భుతవిజయంతో క్రికెట్‌‌‌‌‌‌‌‌కు వీడ్కోలు పలికాడు. తనకిష్టమైన టెస్టు ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో 704 వికెట్లతో  అత్యంత విజయవంతమైన పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఆట ముగించాడు.  ప్రఖ్యాత లార్డ్స్‌‌‌‌‌‌‌‌ స్టేడియంలో చివరి మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ఆడిన 41 ఏండ్ల అండర్సన్ (3/32)కు తోడుగా గస్‌‌‌‌‌‌‌‌ అట్కిన్సన్‌‌‌‌‌‌‌‌ (5/61) చెలరేగడంతో.. వెస్టిండీస్‌‌‌‌‌‌‌‌తో మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌లో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ 114 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌లో హోమ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ 1–0 లీడ్‌‌‌‌‌‌‌‌లో నిలిచింది.

79/6 ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ స్కోరుతో శుక్రవారం మూడో రోజు ఆట కొనసాగించిన విండీస్‌‌‌‌‌‌‌‌ రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 47 ఓవర్లలో 136 రన్స్‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైంది. గుడకేశ్‌‌‌‌‌‌‌‌ మోతీ (31 నాటౌట్‌‌‌‌‌‌‌‌) కాసేపు పోరాడినా, మిగతా వారి నుంచి సహకారం దక్కలేదు. తొలి సెషన్‌‌‌‌‌‌‌‌లో 13.5 ఓవర్లు మాత్రమే ఆడిన కరీబియన్లు 57 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. మ్యాచ్‌‌‌‌‌‌‌‌ మొత్తంలో 12 వికెట్లు తీసిన అట్కిన్సన్‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. అలెక్‌‌‌‌‌‌‌‌ బెడ్సర్‌‌‌‌‌‌‌‌ (1946) తర్వాత ఒక మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 10 వికెట్ల హాల్‌‌‌‌‌‌‌‌ సాధించిన ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా అట్కిన్సన్‌‌‌‌‌‌‌‌ రికార్డులకెక్కాడు. ఇరుజట్ల మధ్య రెండో టెస్ట్‌‌‌‌‌‌‌‌ ఈ నెల 18 నుంచి నాటింగ్‌‌‌‌‌‌‌‌హామ్‌‌‌‌‌‌‌‌లో జరగనుంది. 

గ్రేటెస్ట్‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌..

కాలం మారింది.. కెప్టెన్లూ మారారు.. చాలా మంది ప్లేయర్లు వచ్చి పోయారు.. కానీ ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌లో అండర్సన్‌‌‌‌‌‌‌‌ మాత్రం అలానే ఉండిపోయాడు. 2003లో టెస్ట్‌‌‌‌‌‌‌‌ల్లో అరంగేట్రం చేసినప్పట్నించి నిన్నటి వరకు అతను ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌ పేస్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ బలాన్ని ఒంటిచేత్తో నడిపించాడు. ఈ ఫార్మాట్‌‌‌‌కు అసలైన బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌‌‌‌‌గా మారాడు.  మొత్తంగా 21 ఏండ్ల కెరీర్‌‌‌‌‌‌‌‌లో 181 టెస్టులు ఆడి 704 వికెట్లు తీసిన అండర్సన్‌‌‌‌‌‌‌‌ ఎట్టకేలకు ఆటకు సగర్వంగా గుడ్‌‌‌‌‌‌‌‌బై చెప్పాడు.  టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌‌‌‌‌‌‌‌గా రికార్డులకెక్కాడు. స్పిన్నర్లు ముత్తయ్య మురళీధరన్‌‌‌‌‌‌‌‌ (800), షేన్‌‌‌‌‌‌‌‌ వార్న్‌‌‌‌‌‌‌‌ (708).. జిమ్మీ కంటే ముందున్నారు.

అత్యధిక మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఆడిన సచిన్‌‌‌‌‌‌‌‌ (200) రికార్డును మాత్రం జిమ్మీ టచ్‌‌‌‌‌‌‌‌ చేయలేకపోయాడు. తన కెరీర్‌‌‌‌‌‌‌‌లో చివరి రోజు ఆడేందుకు గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చిన అండర్సన్‌‌‌‌‌‌‌‌కు ముందుగా ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ స్టాండింగ్‌‌‌‌‌‌‌‌ ఒవేషన్‌‌‌‌‌‌‌‌తో వెల్‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. వచ్చీ రాగానే డ సిల్వా వికెట్‌‌‌‌‌‌‌‌ తీశాడు. ఆ వెంటనే తన బౌలింగ్‌‌‌‌‌‌‌‌లోనే మోతీ ఇచ్చిన క్యాచ్‌‌‌‌‌‌‌‌ను అందుకోలేక మరో వికెట్‌‌‌‌‌‌‌‌ చేజార్చుకున్నాడు. మ్యాచ్‌‌‌‌‌‌‌‌ గెలిచిన తర్వాత ఇరుజట్లు ‘గార్డ్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ హానర్‌‌‌‌‌‌‌‌’తో అండర్సన్‌‌‌‌‌‌‌‌కు ఘనంగా వీడ్కోలు పలికాయి. ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన జిమ్మీ మోకాళ్ల మీద కూర్చొని ముఖానికి చేతులు జోడించి చాలాసేపు అలానే ఉండిపోయాడు.

మ్యాచ్‌‌‌‌‌‌‌‌ చూసేందుకు వచ్చిన అండర్సన్‌‌‌‌‌‌‌‌ భార్య, పిల్లలు, తల్లిదండ్రులు కూడా కాస్త ఎమోషనల్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. అండర్సన్‌‌‌‌‌‌‌‌ 2003లో జింబాబ్వేపై టెస్టు అరంగేట్రం చేశాడు.  ఓ బక్క పల్చని కుర్రాడిగా తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఐదు వికెట్లతో మొదలు పెట్టిన  ప్రస్థానం టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌‌‌‌‌‌‌‌గా రికార్డు సృష్టించే వరకు వెళ్లింది. తన ఆటతో ఈ ఫార్మాట్‌‌‌‌లో గ్రేటెస్ట్‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇక 2002లోనే ఆస్ట్రేలియాపై తొలి వన్డే ఆడిన జిమ్మీ 2015లో అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌పై ఆఖరి మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ఆడాడు. ఈ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో 194 మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో 269 వికెట్లు పడగొట్టాడు. 19 టీ20ల్లో 18 వికెట్లు తీశాడు. 

‘గిన్నిస్‌‌‌‌‌‌‌‌ పింట్’ను పట్టుకుని..

మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన అండర్సన్‌‌‌‌‌‌‌‌ చేతిలో గిన్నిస్‌‌‌‌‌‌‌‌ పింట్‌‌‌‌‌‌‌‌ (గాజు గ్లాస్‌‌‌‌‌‌‌‌లో ఎనిమిది రకాలతో కూడిన బ్లాక్ డ్రింక్) పట్టుకుని లార్డ్స్‌‌‌‌‌‌‌‌ బాల్కనీ నుంచి చివరిసారి ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌కు అభివాదం చేశాడు. అక్కడే పింట్‌‌‌‌‌‌‌‌ను తాగేసి లోపలికి వెళ్లిపోయాడు. ‘ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ కోసం ఆడటం ప్రపంచంలోనే అత్యుత్తమ ఉద్యోగం. చాలా కాలం పాటు ఈ పని చేయడం నా అదృష్టం. నాతో కలిసి ఆడిన ప్లేయర్లలో చాలా గొప్ప వాళ్లతో పాటు అద్భుతమైన నైపుణ్యం కలిగిన వాళ్లు ఉన్నారు.

ఈ ఆటతో నేను చాలా మంది స్నేహితులను సంపాదించుకున్నా. ప్రస్తుతం ఉన్న కుర్రాళ్లు రాబోయే రోజుల్లో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ను మరింత ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నా. వాళ్లకు నేను ఇచ్చే సలహా ఒక్కటే. ప్రతి క్షణం ఆటను ఆస్వాదించండి’ అని అండర్సన్‌‌‌‌‌‌‌‌ తన వీడ్కోలు ప్రసంగంలో వ్యాఖ్యానించాడు.

  • 704  టెస్టుల్లో అండర్సన్‌‌‌‌‌‌‌‌ తీసిన వికెట్లు. ఓ పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అత్యుత్తమం. ఇంగ్లండ్‌‌‌‌కే చెందిన బ్రాడ్ 604 వికెట్లతో అతని తర్వాతి స్థానంలో నిలిచాడు. 
  • 40,037  టెస్టుల్లో అండర్సన్ వేసిన బాల్స్‌‌‌‌. ఈ ఫార్మాట్‌‌‌‌‌‌‌‌లో ఎక్కువ బాల్స్‌‌‌‌‌‌‌‌ వేసిన పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • 109 కెరీర్ ఆరంభించిన తర్వాత  టెస్టులో అండర్సన్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఆడిన ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ జట్టు ఆటగాళ్లు