కొండ గాలి లాంటి పాట

ఖయ్యాం ప్రత్యేకతల్లో  కేవలం జానపద బాణీలు, పహాడీ సంగీతమే కాకుండా మరొకటికూడా ఉంది. ఆయన  కట్టిన పాటలు సూటిగా మొదలవుతాయి. ప్రి-ల్యూడ్, సాకీ వంటి నియమాలు లేకుండా నేరుగా పల్లవితో స్టార్టవుతాయి. కొన్ని కొన్ని మధ్యలో నుంచి పాట మొదలయ్యిందా అన్నట్లుగా ఉంటాయి ఖయ్యం ట్యూన్లు. ఉదాహరణకు… ప్యార్ కర్‌లియా తో క్యా (కభీ కభీ), మొహబ్బత్ బడే కామ్ కి ఛీజ్​ హై, జో హో యార్ అప్నా (త్రిశూల్) వంటివి.

రేఖ తాను నటించిన సినిమాల్లో ‘ఉమ్రావ్​ జాన్’ ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని ఒక ఫంక్షన్​లో చెప్పింది. ‘ఈ గుర్తింపు నా నటన వల్లనో, ముజఫర్​ అలీ డైరెక్షన్ వల్లనో కాదు. కేవలం ఖయ్యాం సాబ్​ చేసిన పాటలకు వచ్చిన రికగ్నిషన్​. నేను ఎక్కడకు వెళ్లినా ఉమ్రావ్​ జాన్​గానే పిలుస్తుంటారు’ అని చెప్పింది. ఖయ్యాం ఆ సినిమాలో ‘దిల్​ ఛీజ్​ క్యాహై ఆప్​ మేరీ జాన్​ లీజియే’, ‘ఇన్​ ఆఖోంకే మస్తీ మే’, ‘యే క్యా జగాహై దోస్తో’ లాంటి గొప్ప ట్యూన్​లిచ్చారు. ఈ సినిమా విడుదలై 40 ఏళ్లవుతున్నా వాటి తాజాదనం అలాగే ఉంది.

హిందీ సినిమా పాటల్లో… తెలి మంచు తెమ్మెర సోకినట్లుగా, గాలి అలలపై మనసు తేలుతున్నట్లుగా, బండరాళ్ల నడుమ మెలికలు తిరుగుతున్న నీళ్ల సవ్వడిలా, నిండుగా పూచిన పూలతో బరువుగా ఊగుతున్న మొక్కలా… అనుభూతి కలిగిందంటే, అది కచ్చితంగా ఖయ్యాం కట్టిన ట్యూన్ అయి ఉంటుంది.  హిమాలయాల్లోని జానపద (పహాడీ) సంగీతానికి ఖయ్యాం పెట్టింది పేరు. ఆయన పుట్టింది అటు కాశ్మీర్, ఇటు ఉత్తరాంచల్ ప్రాంతాలను ఆనుకుని ఉన్న నవాన్‌షహర్ జిల్లా (ప్రస్తుతం షహీద్ భగత్ సింగ్ నగర్ జిల్లా)లో. అందువల్లనే కొండ గాలి స్వచ్చత ఖయ్యాం సంగీతంలో ఉంటుందని మ్యూజిక్​ లవర్స్​ అంటారు.

ఆయన అసలు పేరు మహమ్మద్​ జహూర్​ ఖయ్యాం. 1948లో కేవలం 21 ఏళ్ల వయసుకే సంగీత దర్శకత్వం మొదలు పెట్టినా, సోలో కార్డ్ మాత్రం 1953లో పడింది.  హిందీ సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి దాదాపు 20ఏళ్లపాటు స్ట్రగుల్ చేశారు. మరి, ఆ సమయం అలాంటిది. నౌషాద్, శంకర్–-జై కిషన్, ఎస్.డి.బర్మన్, మదన్ మోహన్, కల్యాణ్‌జీ–-ఆనంద్‌జీ వగైరాలు చెలరేగిపోతున్న సమయం. ప్రతి ఒక్కరికీ ఓ మంచి రోజు వస్తుందన్నట్లే… ఖయ్యాంకి 1975లో దశ తిరిగింది. అప్పటి నుంచి 1985 వరకు పదేళ్లపాటు ఖయ్యాం ఆల్బమ్‌లు సూపర్ హిట్ అయ్యాయి.  కభీ కభీ, త్రిశూల్, నూరి, తోడిసీ బేవపా, ఉమ్రావ్ జాన్, బజార్, రజియా సుల్తానా తదితర ఆల్‌టైమ్ మ్యూజికల్ సూపర్ హిట్లిచ్చారు.

జగ్​జీత్​ కౌర్ అనే​ సంగీతాభిమానిని మతాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు.  ఆమెకూడా మంచి గాయని.  షగూన్‌ (1964)లోని ‘తుమ్ అప్నా రంజో గమ్ అప్నీ పరేషానీ ముఝే దేదో’ అనే పాట జగ్​జీత్​ కౌర్​ పాడినదే. భర్త మ్యూజిక్​ డైరెక్షన్​కి సహాయంగా ఉండేదే తప్ప, ఎక్కువగా పాడలేదు.

అలాగే, ఖయ్యాం పాటల్లో పల్లవి పదే పదే రిపీట్ కాదు. కొన్నిసార్లు అస్సలు వెనక్కి రాదు. ఎస్.డి.బర్మన్ పాటల్లో పల్లవి చికాకు పెడుతుంది.  పేయింగ్​ గెస్ట్​లోని ‘ఛోడ్ దో ఆంఛల్ జమానా క్యా కహేగా’ పాటలో పల్లవి పదే పదే రిపీట్​ అవుతుంది.

ఖయ్యాం భార్య జగ్‌జీత్ కౌర్, కొడుకు ప్రదీప్ ఖయ్యాంలు జ్ఞాపకార్థం ‘వర్ధమాన సంగీతకారులను ప్రోత్సహించడానికి ఒక ట్రస్ట్’ ఏర్పాటు చేసి, నిర్వహించేవారు ఖయ్యాం. 2011లో ఆయనకు ‘పద్మభూషణ్’​ పురస్కారం లభించింది.

(ఖయ్యాం (92) సోమవారం కన్నుమూశారు)