రోజుకొక్కసారైనా నవ్వాల్సిందే! 

  • ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యం కోసం జపాన్​లో కొత్త చట్టం
  • యమగట ప్రిఫెక్చర్​ ప్రభుత్వ నిర్ణయం

టోక్యో: ‘‘నవ్వడం యోగం.. నవ్వలేకపోవడం రోగం’’ అనేది పాత సామెత. దీన్ని తూ.చ. తప్పకుండా పాటించేందుకు జపాన్​ దేశంలో ఏకంగా కొత్త చట్టమే వచ్చింది. రోజులో ప్రతిఒక్కరూ ఒక్కసారైనా నవ్వాలని యమగట ప్రిఫెక్చర్​ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నది. ఈ చట్టం గత వారం అమల్లోకి వచ్చింది. అలాగే, ప్రతి కంపెనీ నవ్వుతో కూడిన వాతావరణాన్ని ప్రోత్సహించాలని ఆదేశించింది. ప్రతినెలా 8వ తేదీని ప్రత్యేకంగా ‘హాస్యంతో ఆరోగ్యం’ కోసం కేటాయించాలని తెలిపింది.

వర్సిటీ స్టడీ ఆధారంగా చట్టం

యమగటా విశ్వవిద్యాలయంలోని మెడిసిన్ ఫ్యాకల్టీ చేసిన స్టడీ ఆధారంగా ఈ కొత్త చట్టాన్ని రూపొందించారు. మెరుగైన ఆరోగ్యం, జీవనకాలం పెంపుపై పరిశోధకులు అధ్యయనం చేశారు. నవ్వుతో మంచి ఆరోగ్యంతో పాటు దీర్ఘాష్షు సాధ్యమని తేలింది. అలాగే, తక్కువగా నవ్వేవారిలో గుండె సంబంధ వ్యాధులతోపాటు మరిన్ని రోగాలు పెరుగుతున్నట్టు గుర్తించారు. దీని ఆధారంగానే కొత్త చట్టం రూపుదిద్దుకుంది. 

వ్యతిరేకిస్తున్న కొన్ని రాజకీయ పార్టీలు

యమగట ప్రిఫెక్చర్​ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టాన్ని కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. వ్యక్తిగత, ఇతర కారణాల వల్ల కొందరు నవ్వలేకపోవచ్చునని, ఇది వారిపై నెగెటివ్​ ఎఫెక్ట్​ చూపుతుందని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. నవ్వడం లేదా నవ్వకుండా ఉండడం అనేది రాజ్యాంగం ద్వారా కల్పించబడిన భావప్రకటనా స్వేచ్ఛ లో భాగమని జపాన్​ కమ్యూనిస్టు పార్టీ పేర్కొంది.

  • also read : అక్రమాలకు రాచబాట .. ఎమహారాష్ట్రకు బియ్యం, మద్యం, ఎరువులు అక్రమ రవాణా
  • ఇలాంటి చట్టాలు తెచ్చి ప్రజల హక్కులను కాలరాయొద్దని ప్రభుత్వాన్ని  కోరింది. ఈ విమర్శలపై అధికార లిబరల్​ డెమొక్రటిక్​ పార్టీ స్పందించింది. కొత్త చట్టంలోని నిబంధనను ప్రజలపై తామేమీ బలవంతంగా రుద్దడం లేదని,  వారి ఇష్టానికే వదిలేసినట్టు తెలిపింది. అందుకే జరిమానా లాంటి అంశాలను చట్టంలో చేర్చలేదని స్పష్టం చేసింది.