సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం : గుత్తా సుఖేందర్ రెడ్డి

సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం : గుత్తా సుఖేందర్ రెడ్డి
  •  శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు : దేశ భవిష్యత్​ను తీర్చిదిద్దడం, విద్యావ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం నల్గొండలోని లక్ష్మి గార్డెన్​లో  టీఎస్ యూటీఎఫ్ 6వ రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక మహాసభ నిర్వహించారు. ఈ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి ఉపాధ్యాయులంతా కంకణబద్ధులై పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డీఎస్సీ ద్వారా 10 వేల మంది, మోడల్ స్కూళ్లలో మరో 10 వేల మంది ఉపాధ్యాయులను నియమించినట్లు తెలిపారు.

గత పదేండ్లుగా పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు, బదిలీలను చేపట్టిందన్నారు. పేదరిక నిర్మూలన ఒక విద్యాభివృద్ధి ద్వారానే సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో 26 వేల పాఠశాలలు ఉన్నాయని, లక్షా 25 వేలకుపైగా ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతుందో ఉపాధ్యాయ లోకమంతా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. సభలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జంగయ్య, రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, యూనియన్ నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.