నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లాలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు సంక్రాంతి తర్వాత మోక్షం లభించనుంది. నియోజకవర్గాల్లో చేపట్టిన అభివృద్ధి పనులన్నింటినీ ఐదారు నెలల్లో పూర్తి చేసి ఎన్నికల నాటికి ప్రజల విశ్వాసం పొందాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై కూడా ఫోకస్ చేసింది. గ్రామాల్లో, పట్టణాల్లో రోడ్లు, డ్రైనేజీల పనులపైనే ఎమ్మెల్యేలు దృష్టి పెట్టారని, ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. దీంతో త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టులను ఎన్నికల్లోపు కంప్లీట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మేజర్ సమస్యలు ఉన్న ప్రాజెక్టుల జోలికి పోకుండా కొద్దిపాటి నిధులిస్తే కంప్లీటయ్యే ప్రాజెక్టుల మీద దృష్టి పెడుతున్నారు.
నియోజకవర్గాల వారీగా గుత్తా రివ్యూ
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇటీవల జిల్లా ఇరిగేషన్ ఆఫీసర్లతో నియోజకవర్గాల వారీగా రివ్యూ నిర్వహించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులతో పాటు, కొద్దోగొప్పో నిధులిస్తే పూర్తయ్యే ప్రాజెక్టులపైన చర్చించారు. ముఖ్యంగా నకిరేకల్, దేవరకొండ, నాగార్జునసాగర్, నల్గొండ, మునుగోడు నియోజకవర్గాల్లో సాగు, తాగు నీరు అందించే ప్రాజెక్టుల గురించి రివ్యూ జరిగింది. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న రిజర్వాయర్లు, నకిరేకల్, నల్గొండ, మునుగోడు నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు పైగా సాగునీరు అందించే ఉద్దేశంతో చేపట్టిన బ్రహ్మణ వెల్లంల ప్రాజెక్ట్, శ్రీశైల సొరంగ మార్గానికి అనుసంధానంగా నిర్మిస్తున్న పెండ్లిపాకల, నక్కల గండి ప్రాజెక్టులు, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రకటించిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం గురించి సమీక్షించారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్ పూర్తయ్యేందుకు మరో రెండు, మూడేళ్ల టైం పడుతుంది. కాబట్టి దీనికి బదులుగా సహజంగానే నిండే రిజర్వాయర్లు, డిండి నుంచి నీటిని మళ్లించే ప్రాజెక్టుల పనులు త్వరగా కంప్లీట్ చేయాలని నిర్ణయించారు. మూసీ ప్రాజెక్ట్ కింద పెండింగ్‌లో ఉన్న పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వల పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. రైతులకు నష్టపరిహారం ఇవ్వకపోవడంతో పలు చోట్ల పనులు ఆగిపోయాయి. నాగార్జునసాగర్ ఆయకట్టు కింద ప్రకటించిన నెల్లికల్లుతో సహా 11 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలను మొదలుపెడితే ఎన్నికల్లో లబ్ధి పొందొచ్చని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
పూర్తైతే లక్షలాది ఎకరాలకు నీరు
బ్రహ్మణవెల్లంల ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించింది. కానీ నిధులు రిలీజ్ చేయలేదు. ఉదయసముద్రానికి అనుసంధానంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను రెండు, మూడు నెలల్లో కంప్లీట్ చేస్తే మూడు నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు ప్రయోజనం కలుగుతుంది. నక్కలగండి, పెండ్లిపాకల రిజర్వాయర్లకు డిండి ప్రాజెక్టు నుంచి నీటిని మళ్లిస్తే అక్కడ కూడా గ్రౌండ్ వాటర్ పెరిగి చుట్టుపక్కల గ్రామాలకు సాగు, తాగు నీరు అందే అవకాశం ఉంది. దీని కోసం ప్రత్యేకంగా రోడ్డు నిర్మాణం, భూనిర్వాసితులకు కొంత నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కింద నిర్మిస్తున్న 11 రిజర్వాయర్లలో వాగులు, వరద నీటి ద్వారా దేవరకొండలో గొట్టిముక్కల, సింగరాజుపల్లి రిజర్వాయర్లు నింపే అవకాశం ఉంది. వీటికి కూడా కొన్ని నిధులు కేటాయిస్తే సరిపోతుంది. ఇక సాగర్ ఎన్నికల్లో సీఎం ప్రకటించిన లిఫ్ట్ స్కీం పనుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. నాగార్జున సాగర్ రిజర్వాయర్‌లో నీటిమట్టాలు గరిష్టస్థాయిలో ఉండడం వల్ల నెల్లికల్ లిఫ్ట్ పనులు మధ్యలోనే ఆపేశారు. మిర్యాలగూడ, దేవరకొండ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో మంజూరు చేసిన లిఫ్ట్ స్కీంలు ఇంకా సర్వే దశలోనే ఉన్నాయి. లిఫ్ట్‌లు నిర్మించడానికి ఎంత ఖర్చు అవుతుందో అంతకు రెట్టింపు పవర్ సప్లై కోసం ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అయితే వీటిల్లో కొన్ని పాత స్కీంలకు కొంత వరకు రిపేర్లు చేస్తే సరిపోతుంది. ఈ ప్రాజెక్టులకు నిధులు రిలీజ్ చేస్తే తప్పా పనులు జరిగే అవకాశం లేదు.
అసెంబ్లీలో చర్చించాకే ఆమోదం
సీఎం ఆదేశాల మేరకు ఇరిగేషన్ అధికారులతో రివ్యూ చేసిన మండలి చైర్మన్ గుత్తా ప్రాజెక్టుల వారీగా రిపోర్టు తయారు చేయాలని ఆఫీసర్లకు సూచించారు. సంక్రాంతి తర్వాత అసెంబ్లీలో చర్చించి, సీఎం ఆమోదం పొందాక పనులు మొదలుపెట్టాలని చూస్తున్నారు. వీలైనంత త్వరగా పనులు స్టార్ట్ చేసి ఐదారు నెలల్లో కంప్లీట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.