రాష్ట్రాభివృద్ధి  టీఆర్ఎస్ తోనే సాధ్యం : గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్లగొండ జిల్లా : తెలంగాణ అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యమని శాసనమండలి చైర్మన్  గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందన్నారు. మునుగోడుకు రోజుకు ఇద్దరు కేంద్ర మంత్రులు వచ్చి రాష్ట్రాన్ని దోచుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మునుగోడులో విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందంటూ మండిపడ్డారు. మునుగోడు ప్రజలు చాలా తెలివైన వాళ్లని, టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి.. మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటారని చెప్పారు. శాసనమండలి చైర్మన్ గా కాకుండా టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా మాత్రమే తాను ఆవేదనతో మాట్లాడుతున్నానని చెప్పారు.  కేంద్రప్రభుత్వ నిర్వాకం వల్ల రూపాయి విలువ  పడిపోయే స్థాయికి వచ్చిందన్నారు. దేశంలో మతాలు, కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడమే బీజేపీ లక్ష్యమని ఆరోపించారు.

మరోవైపు మునుగోడులో పార్టీల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీలు ఎలాగైనా గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలో మంత్రులు తిష్టవేసి, ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇటు బీజేపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు.