మున్సిపల్, పీఆర్ బిల్లులకు మండలి ఆమోదం

మున్సిపల్, పీఆర్ బిల్లులకు మండలి ఆమోదం

హైదరాబాద్‌, వెలుగు: మున్సిపల్ సవరణ బిల్లు–2025, పంచాయతీరాజ్ సవరణ బిల్లు–-2025కు శాసన మండలి ఆమోదం తెలిపింది. రెండు బిల్లులను మంత్రులు శీధర్‌‌బాబు, సీతక్క బుధవారం మండలిలో ప్రవేశపెట్టారు. బిల్లుల్లో కొన్ని సమస్యలు, న్యాయపరమైన అంశాలకు సంబంధించి సభ్యులు కొన్ని సూచనలు చేశారు. ఈ మేరకు స్వల్పకాలిక చర్చ జరిగింది. మంత్రులు శ్రీధర్‌‌బాబు, సీతక్క సభ్యులకు సమాధానాలు ఇచ్చారు.

శ్రీధర్‌‌బాబు మాట్లాడుతూ.. రాజకీయాంశాలు ప్రధానంగా కాకుండా అభివృద్ధి, సంక్షేమం ప్రధాన ఎజెండాగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. సమీప గ్రామాల ప్రజాభిప్రాయం మేరకే న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా మున్సిపాలిటీలను ఏర్పాటు చేశామన్నారు. మున్సిపాలిటీలు ఏర్పాటైతే  జెడ్‌పీటీసీలు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లకు అవకాశం పోతుందని సభ్యుడు తీన్మార్ మల్లన్న అడిగిన ప్రశ్నకు శ్రీధర్‌ బాబు సమాధానం ఇచ్చారు.

రాజకీయాంశాలు ప్రధానం కాకుండా చట్టాలు చేస్తున్నామని తెలిపారు. మున్సిపాలిటీలు ఏర్పాటైనా అక్కడ వార్డు మెంబర్, మేయర్ ఉంటారని చెప్పారు. మల్లన్నసాగర్ ముంపు ప్రాంతాల ప్రజలు మున్సిపల్‌ ఓటర్లుగా ఉన్నారన్నారు.