సాధారణంగా ఓ నిమ్మకాయ (Lemon) ధర ఎంత ఉంటుంది? రెండు, మూడు రూపాయల వరకు ఉంటుంది. అయితే ఇంగ్లండ్ (England)లోని ఓ నిమ్మకాయ ఏకంగా రూ.1.5 లక్షలకు అమ్ముడుపోయింది. అలాగని అదేం గొప్ప ఔషధ గుణాలున్న నిమ్మకాయ కాదు. కుళ్లిపోయి ఉపయోగించడానికి వీలు కాని పాత నిమ్మకాయ (Ancient Lemon). ఆ నిమ్మకాయ ఎంత పాతదంటే.. ఏకంగా 285 సంవత్సరాల క్రితంది. ఆ నిమ్మకాయ చరిత్ర తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే (Lemon Price)...
పురాతన కాలం నాటి కొన్ని వస్తువులు వేలం వేయడం గురించి విన్నాం. కానీ 285 సంవత్సరాల నాటి నిమ్మకాయను వేలం వేయడం వింతగా ఉంది. పైగా దానికి రూ.1.5 లక్షలు ధర పలకడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చరిత్రకు సంబంధించిన కొన్ని కళాఖండాలు, వస్తువులు, ఆభరణాలు, పెయింటింగ్స్ వంటివి వేలంలో రికార్డు స్ధాయిలో ధర పలకడం.. కొనుగోలు చేయడం విన్నాము.
19వ శతాబ్దం నాటి నిమ్మకాయ ఒకటి వేలానికి రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంగ్లాండ్‌లోని ఒక కుటుంబానికి ఒక విచిత్రమైన వస్తువు కంటపడింది. అది అప్పట్లో మంత్రివర్గంలో ఉన్న వారి మేనమామదట. దానిపై ఒక ప్రత్యేక సందేశం కూడా ఉందట. దానిని తీసుకుని ఆ కుటుంబం UK లోని ష్రాప్‌షైర్‌లో బ్రెట్టెల్స్ వేలం పాటదారులను కలిసిందట. 2 అంగుళాల వెడల్పుతో గోధుమ రంగులో ఉన్న ఆ ఎండిన నిమ్మకాయపై చెక్కిన సందేశం ప్రకారం 1739 నాటిదని తెలుస్తోంది. దానిపై ‘మిస్టర్ పి లూ ఫ్రాంచినీ నవంబర్ 3, 1739 మిస్ ఇ బాక్స్ టర్‌కి అందించారు’ అని రాసి ఉంది.
ఈ నిమ్మకాయ లోపల ఏముందో తెలుసుకోవాలని కూడా చాలామంది ఆసక్తి చూపించారు. కాగా ఈ నిమ్మకాయ £40–£60 (సుమారు రూ. 4,000–రూ. 6,000) వేలం పలుకుతుందని ఊహించారు. కానీ, అందరినీ షాక్‌కి గురిచేస్తూ, నిమ్మకాయ £1,416 (సుమారు రూ. 1.48 లక్షలు) భారీ ధర పలికింది.
బ్రెట్టెల్స్ ఆక్షన్ హౌస్ యజమాని డేవిడ్ బ్రెట్టెల్ నిమ్మకాయను వేలానికి పెట్టాడు. మహా అయితే ఓ పది వేల వరకు రావొచ్చని ఊహించాడు. అయితే ఆ నిమ్మకాయ ఊహించని ధరకు అమ్ముడు పోయిందనే విషయాన్ని బ్రెట్టెల్స్ ఆక్షన్ హౌస్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆ నిమ్మకాయ ఏకంగా రూ.1.5 లక్షలకు అమ్ముడుపోయి వార్తల్లో నిలిచింది.