
పాపన్నపేట, వెలుగు : లేగదూడపై చిరుత దాడి చేసి చంపిన ఘటన మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలం అన్నారం శివారులో జరిగింది. టేక్మాల్ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ నాయక్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మూన్యా నాయక్ తన పశువులను గ్రామ శివారులో గల కొట్టంలో కట్టేశాడు. తెల్లవారుజామున నాయక్ లేచి చూసేసరికి లేగ దూడ చనిపోయి ఉంది.
అనుమానం వచ్చి అటవీ శాఖ అధికారులకు నాయక్ సమాచారం అందించాడు. ఆఫీసర్లు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పాద ముద్రల ఆధారంగా, చిరుతపులి దాడి చేసి దూడను చంపినట్లు ఆఫీసర్లు తెలిపారు. గ్రామస్తులు ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.