
ఏపీ అన్నమయ్య జిల్లాలో ఘోరం జరిగింది. వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న చిరుత ప్రాణాలు కోల్పోయింది. గ్రామస్తులు సమాచారం ఇచ్చినా చిరుతను కాపాడటంలో నిర్లక్ష్యం వహించడంతో పది గంటల పాటు నరకయాతన అనుభవించిన చిరుత చివరకు ప్రాణాలు కోల్పోయింది.
అసలేం జరిగిందంటే. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండటం పొన్నూటి పాలెంట అడవి సమీపంలో ఏప్రిల్ 16న తెల్లవారుజామున వేటగాళ్లు ఏర్పాటు చేసిన ఉచ్చులో చిరుత చిక్కుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన అటవిశాఖ అధికారులు చిరుతను కాపాడేందుకు ప్రయత్నం చేశారు. అయితే గన్ ద్వారా మత్తుమందు ఇవ్వడానికి అన్నీ ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ షూటర్ సకాలంలో రాలేదు. గంటల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. ఆ గన్ కూడా కాలం చెల్లిందని తెలిసింది.
దీంతో అధికారుల నిర్లక్ష్యంకారణంగా ఉచ్చులోనే 10 గంటల పాటు నరకయాతన అనుభవించిన చిరుత ప్రాణాలు కోల్పోయింది. ఖననం చేసే సమయంలో చిరుత గర్భంతో ఉన్నట్లు తెలిసింది. రెండు చిరుత పిల్లలు కూడా చనిపోయినట్లు చెప్పారు అధికారులు.
అధికారుల నిర్లక్ష్యంతోనే చిరుత ప్రాణాలు కోల్పోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీ ఉండి కూడా ప్రాణాలతో చిరుతను కాపాడలేక పోయారని మండిపడుతున్నారు. వచ్చి ఏమి చేశారంటూ అధికారులపై గ్రామస్థుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచ్చు ఎందుకు పెట్టారు.. ఎవరు పెట్టారు.. అనే అంశంపై విచారణ చేపడుతామని అటవిశాఖ అధికారులు తెలిపారు.