తాళికడుతుండగా పెండ్లివేదికపైకి చిరుత.. భయంతో వధూవరుల పరుగు

 తాళికడుతుండగా పెండ్లివేదికపైకి  చిరుత.. భయంతో వధూవరుల పరుగు
  • హడలిపోయి కారులోనే4 గంటలు కూర్చున్న వైనం
  • ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో ఘటన

లక్నో: ఉత్తర ప్రదేశ్​లో ఓ పెండ్లి వేడుకలోకి అనుకోని అతిథిగా చిరుతపులి ఎంటరైంది. దాన్నిచూసి పెళ్లికి వచ్చినవారంతా హడలిపోయారు. ప్రాణాలు దక్కించు కునేందుకు రోడ్డుపైకి పరుగులు పెట్టారు. ఇక పెండ్లికొడుకు, పెండ్లి కూతురు అయితే 4 గంటలకుపైగా ఓ కారులోనే కూర్చుండిపోయారు. ఈ ఘటన లక్నోలో బుధ వారం రాత్రి జరిగింది. 

లక్నోలోని ఎంఎం లాన్‌‌‌‌‌‌‌‌ బాంకెట్ హాల్ లో బుధవారం రాత్రి 11 గంటలకు అక్షయ్ శ్రీవాస్తవ, జ్యోతి కుమారీల పెండ్లి వేడుక జరుగుతున్నది. అందరూ ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా పెండ్లి పనులు చేస్తుండగా బాంకెట్ హాల్​లోకి సడెన్​గా చిరుతపులి ఎంటర్ అయింది. 

దాంతో వధూవరులు, గెస్టులు ఒక్కసారిగా  బెంబేలెత్తిపోయారు. సెకన్లలోనే అతిథులంతా పెద్ద కేకలు పెడుతూ రోడ్డుపైకి పరిగెత్తారు. ఈ క్రమంలో పలువురికి గాయాలు అయ్యాయి. వధూవరులు కూడా పారిపోయి ఓ కారులో కూర్చుండిపోయారు. 

చిరుత మాత్రం బాంకెట్ హాల్ రూమ్స్ అన్ని కలియతిరిగి ఓ రూములో దాక్కుంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఫారెస్ట్ ఆఫీసర్లు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి చిరుత ఉన్న గదిని గుర్తించారు. 

ఓ అటవీ శాఖ అధికారి చిరుత దగ్గరకు వెళ్లగా..అది అతనిపై పంజాతో దాడి చేసింది. అతికష్టమ్మీద తెల్లవారుజామున 3:30 గంటలకు అధికారులు చిరుతను బంధించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

మొత్తానికి ఈ ఘటనలో ఒక ఫారెస్ట్ ఆఫీసర్, గెస్టు, ఇద్దరు  కెమెరామెన్లు గాయపడినట్లు అధికారులు పేర్కొన్నారు.  బుధవారం రాత్రి ఊహించని పరిణామం చోటు చేసుకోవడంతో పెండ్లి వేడుకను మరుసటి రోజు ఉదయం నిర్వహించారు.