
- నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో కనిపించిన డెడ్ బాడీ
మద్దూరు, వెలుగు : అనుమానస్పద స్థితిలో మరో చిరుత పులి చనిపోయింది. ఈ ఘటన నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని మోమినాపూర్ గ్రామ శివారులో ఆదివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారులోని డంపింగ్ యార్డ్ వద్ద ఆదివారం ఉదయం చిరుత పులి కళేబరం కనిపించడంతో గ్రామస్తులు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ లక్ష్మణ్ నాయక్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి చిరుత కళేబరాన్ని పరిశీలించగా గొంతు, మెడపైన ఏదో జంతువు దాడి చేసినట్లు ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
అనంతరం చిరుత కళేబరాన్ని నారాయణపేటకు తరలించారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఆధారంగా వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. కాగా గతేడాది జూన్‌లో మండలంలోని నందిపాడ్, జాదరావ్ పల్లి శివార్లలో ఓ చిరుత చనిపోగా, ఆగస్టులో ఒకటి అనుమానస్పదస్థితిలో, మరొకటి ముళ్లపంది దాడిలో చనిపోయింది. ఇప్పుడు మోమిన్‌పూర్ శివారులో మరో చిరుత అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించింది. ఏడు నెలల వ్యవధిలోనే నాలుగు చిరుతలు మృత్యువాతపడ్డాయి.