తండ్రి కూతుళ్లపై చిరుత దాడి

తండ్రి కూతుళ్లపై చిరుత దాడి

సియోని (మధ్యప్రదేశ్‌‌‌‌): పశువులను మేపడానికి అడవికి వెళ్లిన తండ్రీకూతుళ్లపై చిరుత పులి దాడి చేసింది. ఈ ఘటనలో కూతురు చనిపోగా, తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. మధ్యప్రదేశ్‌‌‌‌లోని సియోని జిల్లా పాండివాడ గ్రామానికి దగ్గర్లో ఉన్న కన్హివాడ అటవీ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం ఈ దారుణం జరిగింది. ఈ మేరకు ఆదివారం ఫారెస్ట్‌‌‌‌ రెంజర్‌‌‌‌‌‌‌‌ యోగేశ్ పటేల్‌‌‌‌ వివరాలు వెల్లడించారు. పశువులను మేపడానికి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన కూతురు రవీనా యాదవ్‌‌‌‌ (16)తో కలిసి అడవికి వెళ్లాడు. మెయిన్‌‌‌‌ రోడ్డు నుంచి దాదాపు 3 కిలోమీటర్ల వరకు అడవి లోపలికి వెళ్లారు. పశువులను మేపుతున్న సమయంలో ఒక్కసారిగా చిరుతపులి బాలికపై దాడి చేసింది. బాలిక మెడ పట్టుకొని కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఇది గమనించిన తండ్రి కూతురిని కాపాడుకునేందుకు కర్ర తీసుకొని చిరుతపై దాడికి దిగాడు. దీంతో అతడిపై కూడా చిరుత దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. వీరి అరుపులకు చుట్టుపక్కల వారు ఘటన స్థలానికి రాగా, బాలికను వదిలేసి అక్కడి నుంచి చిరుత అడవిలోకి పారిపోయింది. చిరుత దాడిలో ఆ బాలిక అప్పటికే మరణించింది. బాధిత కుటుంబానికి ఫారెస్ట్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేసింది. త్వరలో రూ.4 లక్షలు సాయం అందజేస్తామని అధికారులు చెప్పారు. చిరుతను పట్టుకునేందుకు అడవిలో బోనులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 15న సియోని జిల్లాలోని కియోలారి బ్లాక్‌‌‌‌లోని మోహ్‌‌‌‌గావ్‌‌‌‌ గ్రామానికి చెందిన 50 ఏండ్ల మహిళపై చిరుతపులి దాడి చేసి చంపేసింది.