బాబోయ్​ చిరుత .. ఇందూర్​ జిల్లావ్యాప్తంగా 86 చిరుతలు

బాబోయ్​ చిరుత .. ఇందూర్​ జిల్లావ్యాప్తంగా 86 చిరుతలు
  • తిండి, నీళ్ల కోసం జనావాసాల్లోకి చిరుతలు
  • నిజామాబాద్​ డంపింగ్​ యార్డులో జాడ గుర్తింపు
  • ఎడపల్లి, నవీపేట, నందిపేట, మోపాల్ మండలాల్లో చక్కర్లు
  • ఆవులు, మేకలపై దాడి.. తృటిలో తప్పించుకున్న జనం

నిజామాబాద్, వెలుగు : జిల్లాలో జనావాసాల్లో చిరుతల సంచారం రోజురోజుకూ పెరుగుతుండడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. అడవుల్లో ఆహారం, నీళ్లు దొరకక పల్లెల్లోకి వచ్చి ఆవులు, మేకలపై దాడి చేస్తున్నాయి. జిల్లాలో రెండేండ్ల కింద 38 చిరుతలు ఉండగా, ప్రస్తుతం చిరుతల సంతతి 86కు పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. రాత్రి అయ్యిందంటే చాలు ఎక్కడ నుంచి చిరుత వచ్చి దాడి చేస్తుందోనని అటవీ ప్రాంతాల దగ్గరలో ఉన్న గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. 

నగర శివారులో కదలికలు..

గత శనివారం నగరంలోని డంపింగ్​ యార్డులో చిరుత తిరిగిన ఆనవాళ్లు దొరకడంతో బయటకు రావాలంటేనే  జనం జంకుతున్నారు.  మల్లారం ఫారెస్ట్​ ఏరియాను ఆనుకొని 52 ఎకరాల విస్తీర్ణంలో గుట్టల మధ్య ఉన్న డంపింగ్​ యార్డులో సంచరించిన చిరుత అక్కడున్న ఆవుపై దాడి చేయడంతో పాటు  అరుస్తున్న కుక్కను నోటకరుచుకొని గుట్టల్లోకి వెళ్లిపోయింది. చిరుత పాదముద్రలను గమనించిన శానిటేషన్ సూపర్​వైజర్​ ప్రభుదాస్​ విషయాన్ని కమిషనర్​ దిలీప్​కుమార్​కు తెలుపగా, పారెస్ట్​ ఆఫీసర్లు చిరుత సంచారాన్ని 
కన్ఫర్మ్​ చేశారు. ​  

 నవీపేట మండలంలో లేగ దూడల దాడి..  

ఫిబ్రవరి 20  రాత్రి బోధన్ సెగ్మెంట్ పరిధిలోని నవీపేట మండలం అబ్బాపూర్​ (ఎం) విలేజ్ రైతు బెల్లిడిగె అబ్బయ్య కొట్టంలో కట్టేసిన రెండు లేగదూడలపై చిరుత దాడి చేసి తినేసింది.  ఫారెస్ట్​ ఆఫీసర్లు  బోన్​ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు.  ఈ ఘటన జరిగినప్పటి నుంచి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.

నందిపేటలోని రెండు గ్రామాల్లో..

ఆర్మూర్​ సెగ్మెంట్​లోని నందిపేట మండలం కొండూర్​, మాయాపూర్​ గుట్టల్లో ఫిబ్రవరి 22న చిరుత సంచరిస్తుందన్న భయంతో రైతులు పొలాలకు వెళ్లలేదు.  మొపాల్​ మండలం మల్లారం​, మల్కాపూర్​ తండాలో చిరుత చక్కర్లు కొడుతుండడంతో గిరిజనులు వణికిపోతున్నారు. 
.
పోలీస్​ ట్రైనింగ్​ క్యాంప్​లోకి చిరుత...

జనవరి 29 రాత్రి ఎడపల్లి మండలం జాన్కంపేట గుట్టలోని పోలీస్​ ట్రైనింగ్​ క్యాంపులోకి చిరుత ప్రవేశించింది. నిద్రపోతున్న కుక్కను ఎత్తుకెళ్తుండగా  కానిస్టేబుల్​ సాయిలు చూసి ఉన్నతాధికారులకు తెలిపాడు.  

బైక్​పై వెళ్తున్న బ్యాంక్​ ఉద్యోగిపై దాడి..

 ఠాణాకలాన్​ బ్యాంక్ ఉద్యోగి శ్రావణ్​ జనవరి 28న రాత్రి 9 గంటలకు బైక్​పై నిజామాబాద్​కు ఇంటికి వెళ్తుండగా చిరుత దాడికి యత్నించింది. బైక్​ స్పీడ్​ పెంచడంతో బయటపడ్డాడు. ఆ తరువాత చిరుత ఠాణాకలాన్​ విద్యుత్​ సబ్​ స్టేషన్​లోకి వెళ్లింది. అలీసాగర్ జలాశయంలో నీరు తాగడానికి చిరుత వస్తున్నట్లు ఫారెస్ట్​ ఆఫీసర్లు చెబుతున్నారు. అటవీ ప్రాంతంలోని  జాన్కంపేట-మోస్రా రోడ్​పై రాత్రి 7 గంటల తరువాత ఎవరూ వెళ్లడం లేదు.  బాపూనగర్, కుర్నాపల్లి, పోచారం విలేజ్​లో పశువుల కాపరులు హడలిపోతున్నారు.  

మొత్తం ఏడు రేంజ్​లు..

జిల్లాలో రెండు లక్షల ఎకరాల్లో దట్టమైన ఫారెస్ట్​ ఉంది.  నిజామాబాద్​, ఆర్మూర్​లో ఫారెస్ట్​ డివిజన్లు ఉండగా మొత్తం ఏడు రేంజ్​లు ఉన్నాయి. ఇందల్వాయి రేంజ్​లో అత్యధికంగా 30 చిరుత పులులు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. నిజామాబాద్​ నార్త్​ రేంజ్​లో 15, నిజామాబాద్​ సౌత్​లో 9, సిరికొండలో 15, కమ్మర్​పల్లిలో 8, వర్ని 6, ఆర్మూర్​ 3  కలిపి మొత్తం 86 చిరుతలు జిల్లాలో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.