పెన్ గంగా నదికి అవతల మహారాష్ట్ర సరిహద్దు చినార్లి గ్రామ పరిసరాల్లో పులి సంచారం ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల వాసులను కలవరానికి గురిచేస్తోంది. రాత్రి రోడ్డు వెంట పులి నడుస్తూ ఓ లారీ డ్రైవర్ కంట పడింది. సదరు డ్రైవర్ పులి కదలిక దృశ్యాలను చిత్రీకరించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పులి సంచరిస్తున్న ప్రదేశం భీంపూర్ మండలంలోని వడూర్, అర్లి-టి, అంతర్గాం గ్రామాలకు సమీపంలో ఉండటంతో ఇటీవల అటవీ అధికారులు తాంసి-కె, గొల్లఘాట్ పరిసరాలను సందర్శించారు. గ్రామస్థులను అప్రమత్తం చేయడంతో మనవైపు పులి రావచ్చనే సంకేతాలకు బలం చేకూరుతోంది.
Also Read :- నేటి రాజకీయాలు ఎబ్బెట్టుగా ఉన్నాయి
గతంలోనూ పెనగంగా నది అవతల ఉన్న తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి పులులు తాంసి-కె పరిసరాల్లో సంచరించడం తెలిసిన సంగతే. నదిలో ప్రవాహ ఉద్ధృతి తగ్గడం, ఆవాసం కోసం పులులు మండలంలో ఆయా గ్రామాల అటవీ ప్రాంతంలో అడుగుపెట్టడం పరిపాటిగా మారింది. పంటలు చేతికి వచ్చే సమయంలో పులుల సంచారం వారిని మరింత కలవరపెడుతోంది. అటవీ అధికారులు బేస్ క్యాంపులు ఏర్పాటు చేయాలని భీంపూర్ మండలవాసులు కోరుతున్నారు.