ఆహారం కోసం గ్రామాల్లోకి చిరుతలు

  • జనావాసాల్లో కదలికలు, పశువులపై దాడులతో భయం..
  • బోన్లు ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజల డిమాండ్​
  • ఉమ్మడి జిల్లాలో బాగా వృద్ధి చెందాయంటున్న ఆఫీసర్లు
  • పొలాల వద్ద రైతులు అలర్ట్​గా ఉండాలని సూచన

నిజామాబాద్,  వెలుగు: ఉమ్మడి జిల్లాలో చిరుతల సంచారం టెన్షన్​పెడుతోంది. నెల రోజులుగా ఫారెస్ట్​సమీప గ్రామాల్లో తరచూ స్థానికులకు కనబడుతూ, పశువులపై దాడులు చేస్తూ అలజడి సృష్టిస్తున్నాయి. దీంతో ఆయా గ్రామాల్లోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. బోన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్​చేస్తున్నారు.  రెండేళ్లుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చిరుతల సంతతి బాగా వృద్ధి చెందిందని ఫారెస్ట్​ఆఫీసర్లు  చెప్తున్నారు. నాలుగేళ్ల కింద చేసిన జంతుగణనలో వచ్చిన లెక్కకు డబుల్​అయ్యాయని వారంటున్నారు. స్థానికులు అలర్ట్​గా ఉండాలని సూచిస్తున్నారు. 

ఫారెస్ట్ ​సమీప ప్రాంతాల్లో.. 

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సుద్దులంగ్రామ శివారులో చిరుత మంగళవారం మేకల మందపై దాడి చేసింది. ఒక మేకను అక్కడే చంపే సి, మరో మేకను ఎత్తుకెళ్లింది. దీంతో రైతులు రెండు రోజులుగా వ్యవసాయ పనులకు భయం భయంగా వెళ్తున్నారు. సాయంత్రం 5 గంటలకే ఇండ్లకు చేరుకుంటున్నారు. జిల్లాలో  చిరుతల సంఖ్య బాగా వృద్ధి  చెందడంతో ఫారెస్ట్​వదిలి పిల్లలతో కలిసి గ్రామాల్లోకి వస్తున్నాయి. గ్రామ శివార్లలోని చెరుకు, మొక్కజొన్న చేలను ఆవాసాలుగా చేసుకుని మేకలు, పశువులపై దాడులు చేస్తున్నాయని ఫారెస్ట్​ఆఫీసర్లు చెప్తున్నారు.  

ఉమ్మడి జిల్లాలో 150 చిరుతలు?

నిజామాబాద్ డివిజన్ లో 52,133 , ఆర్మూర్ లో 33,778 , కామారెడ్డి 40,500 , బాన్సువాడ  డివిజన్​లో 40 వేల హెక్టార్లలో ఫారెస్ట్ విస్తరించి ఉంది.   ఉమ్మడి జిల్లాలో నాలుగేళ్ల  కింద చిరుతలు 50 వరకు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 150 కి పెరిగినట్లు భావిస్తున్నామని  ఫారెస్ట్ ఆఫీసర్లు చెప్తున్నారు. 

ఆహారం దొరకకనే..

కొంత కాలంగా ఉమ్మడి జిల్లాలోని నస్రుల్లాబాద్, లింగంపేట, మాకూర్, తాడ్వాయి, ఎడ్​పల్లి మండలాల్లో చిరుతలు ఎక్కువగా సంచరిస్తున్నాయి, వ్యవసాయ పనులకు వెళ్లిన వారికి పొలాల్లో కనిపిస్తున్నాయి. వాటిని చూసిన  రైతులు ఆందోళన చెందుతున్నారు.  అడవి నక్కలు, జింకలు,  కొండ గొర్రెలు తదితర జంతువులు గతంలో అడవిలో వందల సంఖ్యలో ఉండేవి. కానీ చిరుతల సంఖ్య పెరిగి వాటి సంఖ్య తగ్గడంతో ఆహార కొరత ఏర్పడి చిరుతలు జనావాసాల్లోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఫారెస్ట్​ఆఫీసర్లు కొండ గొర్రెలు, జింకలు తెచ్చి ఫారెస్ట్ లో వదిలేస్తే సమస్య పరిష్కారమయ్యే అవకాశముందని స్థానికులు చెప్తున్నారు. 

బోన్లు ఏర్పాటు చేయాలి 

చిరుతల సంచారంతో   దాడి భయం పెరిగింది. ఫారెస్ట్ , గోదావరి నది తీర  గ్రామాల్లోకి  చిరుతలు వచ్చి దాడులు  చేస్తున్నాయి. ఫారెస్ట్ ఆఫీసర్లు బోన్లు ఏర్పాటు చేసి చిరుతను పట్టుకోవాలి. ఫారెస్ట్ ఆఫీసర్లకు  సమాచారం ఇచ్చాం. చిరుత నుంచి పాడాలి. 
- నాగుర్ల మురళి,  షాపూర్ వాసి

సమాచారం ఇవ్వండి  

చిరుతల కదలికలు కనిపిస్తే స్థానికులు  వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం ఇవ్వాలి. బోన్లు పెట్టి పట్టుకుంటాం. ఫారెస్ట్​ సమీప ప్రాంతాల్లో పొలాల వద్ద రైతులు అలర్ట్​గా ఉండాలి.  
- సుధాకర్​, ఫారెస్ట్ రేంజ్​ ఆఫీసర్​

చిరుత జాడ కోసం లేటెస్ట్​ కెమెరాలు

నందిపేట, వెలుగు: మండలంలోని శాపూర్​గ్రామ శివారులో మూడు పిల్లలతో కలిసి చిరుత సంచరిస్తుండడంతో ఫారెస్ట్​ఆఫీసర్లు అలర్ట్​అయ్యారు. శుక్రవారం రేంజ్​ఆఫీసర్​ శ్రీనివాస్, డిఫ్యూటీ ఆఫీసర్​సుధాకర్​ గ్రామానికి చేరుకున్నారు. పాదముద్రలను పరిశీలించి చిరుతగా నిర్ధారించార. ఈ సందర్భంగా రేంజ్​ఆఫీసర్​శ్రీనివాస్​మాట్లాడుతూ వ్యవసాయ పనులకు వెళ్లేవారు  ఒంటరిగా వెళ్లొద్దని, గుంపులుగా వెళ్లాలని సూచించారు. చిరుత కదలికలు తెలుసుకునేందుకు  లేటెస్ట్​ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.