పదేండ్లలో ఈసారే తక్కువ బొగ్గు తవ్విన్రు

తవ్వితీసిన బొగ్గు అమ్ముడుపోతలేదు
డంప్ యార్డ్ ల్లో 37.81లక్షల టన్నుల నిల్వలు
బొగ్గు ఎక్కువ కొనేటోళ్లకు బంపర్
ఆఫర్స్ పై యాజమాన్యం ఆలోచన

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణిలో ఈ ఆర్థిక సంవత్సరంలో గత దశాబ్దంలోనే అతి తక్కువ ప్రొడక్షన్​ వచ్చింది. ఓ వైపు కరోనా వైరస్​, మరోవైపు భారీ వర్షాలు కంపెనీని వెంటాడాయి. దీంతో ఈ ఫైనాన్షియల్​ ఇయర్​లో ఏప్రిల్​ నుంచి ఆగస్టు వరకు నిర్దేశించిన లక్ష్యంలో  కేవలం 56 శాతం మాత్రమే బొగ్గు ఉత్పత్తి జరిగింది. అనేక ఇండస్ట్రీలు మూతపడడం, బొగ్గు కొనేవాళ్లు ముందుకురావడంతో కంపెనీలోని డంప్​యార్డ్​ల్లో సుమారు 37.81లక్షల టన్నుల బొగ్గు నిల్వలు మూలుగుతున్నాయి. దీంతో యాజమాన్యం అనివార్య పరిస్థితుల్లో బొగ్గు ఉత్పత్తిని తగ్గించి, ఉన్న బొగ్గును అమ్మడంపై ఫోకస్​ పెడుతోంది. వినియోగదారులను ఆకట్టుకునే క్రమంలో ఎక్కువ బొగ్గు కొనేవారికి ప్రత్యేక ఆఫర్లు పెట్టే దిశగా కంపెనీ డైరెక్టర్లతో సీఎండీ సమీక్షించడం ఆసక్తి రేపుతోంది.

56 శాతం మాత్రమే..

సింగరేణిని కరోనా నీడలా వెంటాడుతోంది. కరోనా ఎఫెక్ట్​తో  దేశవ్యాప్తంగా అనేక ఇండస్ట్రీలు మూతపడగా, చాలా ఇండస్ట్రీలు ప్రొడక్షన్​ తగ్గించుకున్నాయి. జులై, ఆగస్టు నెలల్లో విడువని వానలు తోడయ్యాయి. ఈ ఎఫెక్ట్​ సింగరేణి బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలపై భారీగా పడింది. ఈ ఫైనాన్షియల్​ ఇయర్​లో  ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 2,63,30,600 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని లక్ష్యం పెట్టుకోగా, కేవలం 1,47,93,978 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేశారు. అంటే లక్ష్యంలో 56 శాతంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.  ఆగస్టు నెలలో  సింగరేణి వ్యాప్తంగా కేవలం 49 శాతం మాత్రమే కోల్​ ప్రొడక్షన్​ జరిగింది.  కంపెనీ వ్యాప్తంగా11 ఏరియాల్లో కేవలం ఆర్జీ–3 ఏరియా మాత్రమే 100 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించింది. కోల్​ప్రొడక్షన్​కు కార్మికుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా కేవలం డిస్పాచ్​ లేకపోవడం వల్లే యాజమాన్యం ప్రొడక్షన్​ తగ్గించుకుంటోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి లక్ష్యాల సాధన కష్టమేనని ఆఫీసర్లు స్పష్టంచేస్తున్నారు.

మూలుగుతున్న నిల్వలు

కంపెనీలోని డంప్​యార్డ్​ల్లో బొగ్గు నిల్వలు భారీగా పేరుకుపోతున్నాయి. కంపెనీలో దాదాపు 37.81లక్షల టన్నుల బొగ్గు ట్రాన్స్​పోర్ట్​కు రెడీగా ఉంది. కానీ కొనేవారే లేరు. గతంలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాలతో పాటు తెలంగాణలోని పలు థర్మల్​విద్యుత్​ ప్రాజెక్ట్​లకు ఎక్కువ శాతం సింగరేణి నుంచే బొగ్గు సరఫరా అయ్యేది. ఇవే  కాకుండా అనేక చిన్న పరిశ్రమలు సింగరేణి బొగ్గును  కొనేవి. కానీ థర్మల్ ప్రాజెక్ట్​లలో విద్యుత్​ ఉత్పత్తిని ఆయా సంస్థలు తగ్గిస్తున్నాయి. విండ్​, సోలార్​ పవర్​తో పాటు జల విద్యుత్​ తక్కువ ధరకే లభిస్తుండటంతో  థర్మల్ ప్లాంట్లను దశల వారీగా షట్​డౌన్​ చేస్తున్నాయి. దీనివల్ల బొగ్గుకు డిమాండ్​ తగ్గింది. మరోవైపు కోలిండియాలో ఉత్పత్తి అవుతున్న బొగ్గు సింగరేణి కన్నా తక్కువ ధరకే దొరుకుతోంది. ఆ ధరకే అమ్ముదామంటే ​సింగరేణిలో ప్రొడక్షన్​ కాస్ట్ ఎక్కువగా ఉంది. దీంతో కొనేవారు లేక బొగ్గు నిల్వలు డంప్​యార్డుల్లో మూలుగుతున్నాయి. కాగా బొగ్గు ఎక్కువగా కొనేవారికి ప్రత్యేక ఆఫర్లు ఇచ్చేందుకు యాజమాన్యం చర్యలు మొదలుపెట్టినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.

For More News..

ఐఏఎస్ , ఐపీఎస్‌ల కోసం మిషన్ కర్మయోగి

25 కిలోమీటర్లు శవాన్ని మోసుకెళ్లిన ఐటీబీపీ జవాన్లు

తండ్రి శవాన్ని సైకిల్‌పై తీసుకెళ్లి అంత్యక్రియలు చేసిన కొడుకు