హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బడ్జెట్‌లో గ్రేటర్ సిటీకి ఈసారీ నిరాశే మిగిలింది. ఆయా ప్రభుత్వ సంస్థలు ఆశించిన స్థాయిలో మంత్రి హరీశ్‌రావు కేటాయింపులు చేయలేదు. కనీసం అడిగిన మొత్తంలో 10 శాతం కూడా ఇవ్వలేదు. హైదరాబాద్ మహా నగరానికి 10 వేల కోట్లు కేటాయిస్తామన్న ప్రభుత్వం మరోసారి హామీని నిలబెట్టుకోలేదు. ఎస్ఆర్డీపీ పేరుతో ఫ్లైఓవర్లు, ఎస్ఎన్డీపీ పేరుతో నాలాలు నిర్మిస్తున్నామని గొప్పలు చెబుతున్నా.. ఆ తరహాలో నిధులు విదల్చలేదు. వేల కోట్లు అవసరం ఉన్న జీహెచ్ఎంసీకి కనీసం వందల్లో కూడా కేటాయించలేదు. రూ.3వేల కోట్లు కావాలని అడిగితే కేవలం రూ.31 కోట్ల10 లక్షలు కేటాయించి చేతులు దులుపుకుంది. ఇందులో ఉద్యోగుల జీత భత్యాల కోసం రూ.11 కోట్లు, బిల్డింగ్‌ల ప్రాపర్టీ ట్యాక్స్, అద్దెలకు రూ.10 కోట్లు, నిర్వహణ వ్యయం, ప్రొఫెషనల్ ట్యాక్స్ కు రూ.10 కోట్లు, మోటారు వెహికల్ ట్యాక్స్ కు రూ.10 లక్షలు కేటాయించడం గమనార్హం.
అలాగే వాటర్‌బోర్డు రూ.5వేల కోట్లు ఇవ్వాలని ప్రతిపాదనలు పంపగా రూ.1,960.17కోట్లు కేటాయించింది. హెచ్ఎండీఏకు ఎంత ఇస్తున్నారనేది క్లారిటీగా చెప్పలేదు. ఓఆర్ఆర్ను ఆనుకొని రాయదుర్గం నుంచి అప్పా జంక్షన్ వరకు నిర్మిస్తున్న సైకిల్ ట్రాక్ కోసం మాత్రం నిధులు ఇస్తున్నట్లు మంత్రి హరీశ్ తెలిపారు. ఇక మెట్రో రైల్‌కు గతేడాది రూ.2,377.35 కోట్లు ఇవ్వగా, ఈసారి 3 భాగాలుగా రూ.2,500 కోట్లను కేటాయించింది. ఇందులో ఓల్డ్ సిటీ మెట్రో కోసం రూ.500 కోట్లు, శంషాబాద్ఎయిర్పోర్టు మెట్రో కోసం రూ.500 కోట్లు, ప్రస్తుతం ఉన్న బ్లూ, గ్రీన్, రెడ్లైన్ల నిర్వహణకు రూ.1,500 కోట్లు కేటాయించింది. మూసీ రివర్ డెవలప్మెంట్ కోసం రూ.300 కోట్లు ఇస్తున్నట్లు చెప్పింది. మూసీ ఈస్ట్, వెస్ట్కారిడార్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు ఇప్పటికే పక్కన పెట్టగా దీనికి రూ.5,916 వేల కోట్లు కావాల్సి ఉంది. ఐదేళ్ల కిందట ప్రతిపాదనలు రెడీ చేసినా ఇప్పటివరకు పట్టించుకోలేదు.
ఎయిర్‌పోర్టుకు మెట్రో కష్టమే?
కేంద్రప్రభుత్వం ఫండ్స్ఇచ్చినా.. ఇవ్వకున్నా ఎయిర్‌పోర్టు మెట్రో రైల్ ప్రాజెక్టు పూర్తిచేసి తీరుతామని శంకుస్థాపన సందర్భంగా సీఎం కేసీఆర్ప్రకటించగా, ఆ మేరకు బడ్జెట్ కేటాయించలేదు. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 31కి.మీల మేర చేపట్టాల్సిన ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.6,250 కోట్లు. దీని కోసం గతేడాది రూ.500కోట్లు ఇచ్చిన ప్రభుత్వం.. ఈసారి మరో రూ.500 కోట్లు కేటాయించింది. చాలీచాలని ఫండ్స్‌తో మెట్రో పనులు ముందుకు సాగుతాయా? లేదా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఎంజీబీఎస్ నుంచి దారుల్ షిఫా, పురానాహవేలీ, మీరాలంమండి, ఎతేబార్ చౌక్, బీబీబజార్ చౌరస్తా, హరిబౌలి, శాలిబండ, సయ్యద్ అలీ ఛబుత్రా, అలియాబాద్, షంషీర్ గంజ్ మీదుగా ద్వారా ఫలక్‌నుమా వరకు 6 కి.మీల మేర మెట్రో నిర్మాణ పనులు ఎప్పుడో జరగాల్సి ఉండగా అంచనా వ్యయం పెరిగిందని ప్రాజెక్ట్ అధికారులు వెనక్కి తగ్గారు. మొన్న అసెంబ్లీలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సైతం పాతబస్తీ మెట్రో గురించి ప్రభుత్వాన్ని నిలదీశారు. పాతబస్తీకి మెట్రో కోసం గతేడాది రూ.500 కోట్లు ఇవ్వగా, తాజా బడ్జెట్‌లో మరో రూ.500కోట్లు కేటాయించారు. ఈసారైనా పనులు మొదలుపెడతారో లేదో చూడాలి.
వీటితో ఏ మాత్రం చేస్తరో?
సిటీ అభివృద్ధిలో కీలకమైన జీహెచ్ఎంసీకి
ప్రభుత్వం మరోసారి మొండి చేయి చూపించింది. రూ.3వేల కోట్లు కావాలని అడగగా రూ.31.10 కోట్లు కేటాయించింది. ఇప్పటికే రూ.5,275 కోట్ల అప్పులు చేసిన జీహెచ్ఎంసీ డైలీ రూ.కోటికి పైగా వడ్డీ చెల్లిస్తోంది. బల్దియాకు ఇచ్చిన మొత్తంలో సగం అప్పుల వడ్డీ కట్టేందుకే సరిపోతుంది. ఇక వాటర్ బోర్డుకు రుణాల చెల్లింపునకు రూ.635.7 కోట్లు, సుంకిశాల ప్రాజెక్టుకు రూ.725కోట్లు, ఫ్రీ వాటర్ స్కీంకు రూ.300కోట్లు, డెవలప్మెంట్ పనుల కోసం రూ.300 కోట్లు కేటాయించింది. కేశవపూర్, సుంకిశాల ప్రాజెక్టులు, కొత్త ఎస్టీపీలు, కరెంట్ బిల్లులు తదితర వాటికి రూ.5వేల కోట్లు కావాలంటూ వాటర్‌బోర్డు అడగగా కేవలం రూ.1,960.17 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ ఫండ్స్ తో ప్రాజెక్టులు పూర్తి కావడం కష్టమే అనిపిస్తోంది. ఫండ్స్ లేక ఇప్పటికే వాటర్‌బోర్డు కరెంట్ బిల్లులు కూడా చెల్లించడంలేదు. కరోనా టైం నుంచి రూ.4 వేల కోట్ల విద్యుత్ బిల్లులు బకాయి పడింది. సిటీలో ఎస్టీపీలు నిర్మిస్తామని మంత్రి కేటీఆర్ ఎన్నోసార్లు చెప్పినప్పటికీ బడ్జెట్‌లో ఆ ప్రస్తావన లేదు.
మరిన్ని నిధులు ఇస్తే బాగుండేది
రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 50 శాతం హైదరాబాద్ నుంచే ఉంటుంది. బడ్జెట్ కేటాయింపుల్లో ఇంకొంచెం ప్రాధాన్యం ఇస్తే బాగుండేది. సిటీ అభివృద్ధికి మరిన్ని నిధులు ఇవ్వాల్సింది. వరదల నివారణ, రోడ్ల నిర్మాణం, ప్రజా రవాణపై మరింత దృష్టి పెట్టాలి.
- ప్రొఫెసర్ కేఎం లక్షణరావు, జేఎన్టీయూ
జీహెచ్ఎంసీకి మిగిలింది అప్పులే
హైదరాబాద్ సిటీతోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకొని నిధులు కేటాయించాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మిత్రపక్షం ఎంఐఎం ఎమ్మెల్యేలు జీహెచ్ఎంసీకి నిధులు అడగకపోవడం సిగ్గుచేటు. రూ.10 వేల కోట్లు ఇస్తానన్న మంత్రి కేటీఆర్ మాటలు ఏమైనయ్. రూ.31 కోట్లు కేటాయించడం అన్యాయం. ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ లకే ఇవి సరిపోవు. బడ్జెట్‌లో మార్పులు చేయాలి.
- కొప్పుల నర్సింహారెడ్డి, మన్సూరాబాద్ కార్పొరేటర్