TGPSC: గ్రూప్ 2 ఎగ్జామ్ సగం మంది రాయలే

TGPSC:  గ్రూప్ 2 ఎగ్జామ్ సగం మంది రాయలే
  • పేపర్ 1కు 46.75%, పేపర్ 2కు 46.30% హాజరు
  • పేపర్ 2 రాయకుండానే 2,419 మంది అభ్యర్థులు ఇంటిదారి
  • వికారాబాద్ జిల్లాలో ఫోన్​తో పట్టుబడిన అభ్యర్థి.. కేసు నమోదు
  • నేడు పేపర్ 3, పేపర్ 4 ఎగ్జామ్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఆదివారం ఎగ్జామ్ మొదలైంది. ఈ పరీక్షకు సగం మంది కూడా అటెండ్ కాలేదు. మొత్తం 5,51,855 మంది గ్రూప్ 2కు దరఖాస్తు చేసుకుంటే.. దాంట్లో 46 శాతం మందే హాజరయ్యారు. మొత్తం దరఖాస్తు చేసుకున్న వారిలో 74.96 శాతం మంది మాత్రమే హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. అందులో మొదటి రోజు పేపర్ 1కు 2,57,981 (46.75%) మంది అటెండ్ అయ్యారు. మధ్యాహ్నం పేపర్ 2కు 2,55,490 (46.30%) మంది హాజరయ్యారు. ఓవరాల్ గా పరీక్ష రాసేందుకు సగం మంది కూడా రాలేదు. ఇదిలా ఉండగా పేపర్ 1 రాసిన వారిలో 2,491 మంది పేపర్ 2 రాయకుండానే ఇంటిదారి పట్టారు. కాగా, టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం హైదరాబాద్ సిటీలోని పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. తొలిరోజు పేపర్1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ కాగా.. పేపర్ 2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీకి ఎగ్జామ్ నిర్వహించారు. సోమవారం మరో రెండు పేపర్లకు పరీక్ష నిర్వహించనున్నారు.

పేపర్ 1తో పోలిస్తే.. పేపర్ 2 కొంత ఈజీ

పలు ఎగ్జామ్ సెంటర్లలో సరైన సౌలత్​లు లేక అభ్యర్థులు, వాళ్లతో వచ్చిన పేరెంట్స్, బంధువులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. నిమిషం నిబంధన అమల్లో ఉండటంతో ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అధికారులు ఎగ్జామ్ సెంటర్​లోకి అనుమతించలేదు. జనరల్ స్టడీస్ పేపర్ కాస్త టఫ్​గా వచ్చినట్లు అభ్యర్థులు చెప్తున్నారు. పేపర్ 1తో పోలిస్తే.. పేపర్ 2 కొంత ఈజీగా ఉందన్నారు. పేపర్ 1లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై, సినీ రంగం, అంతర్జాతీయ అంశాలు, భౌతిక, రసాయన శాస్త్రాలు, రీజనింగ్, ఇంగ్లిష్ గ్రామర్ నుంచి ప్రశ్నలు వచ్చినట్లు తెలిపారు. ఇంగ్లిష్​లో లోతైన భాషా పరిజ్ఞానం ఉంటే తప్పా చేయలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయన్నారు. 

పేపర్ 2లో నిజాం నవాబు కాలం, జోగిని వ్యవస్థ, సికింద్రాబాద్ ఉజ్జయిని ఆలయం, జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర కమిషన్లు, మహిళా రిజర్వేషన్​కు సంబంధించిన అంశంతో పాటు రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ అధికారాలపై ప్రశ్నలు వచ్చినట్లు చెప్పారు. అలాగే, తెలంగాణ జిల్లాలు, మున్సిపాలిటీ, గ్రామ అధికారాలపై ప్రశ్నలు వచ్చాయన్నారు. కాగా, పేపర్ 2లో హిస్టరీ నుంచి టఫ్ క్వొశ్చన్లు వచ్చాయని, పాలిటీ నుంచి మాడరేట్​గా, సోషియాలజీ నుంచి ఈజీ ప్రశ్నలు వచ్చినట్లు తెలిపారు.

ఎగ్జామ్ హాల్​లోకి  ఫోన్​తో వచ్చిన అభ్యర్థి

తొలిరోజు వికారాబాద్ జిల్లాలోని ఒక పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థి మొబైల్ ఫోన్​ను తీసుకురావడం కలకలం రేపింది. సదరు అభ్యర్థి తీరుపై చీఫ్ సూపరింటెండెంట్​కు అనుమానం వచ్చి తనిఖీ చేయగా ఫోన్ బయటపడినట్లు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. దీంతో సదరు అభ్యర్థిని పోలీసులకు అప్పగించారు. కాగా, అభ్యర్థిపై మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదైనట్లు తెలిపారు. అతనిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.