నిజామాబాద్‌రూరల్, వెలుగు: ముఖ్యమంత్రి కేసీఆర్అవలంబిస్తున్న ప్రజాకంటక పాలన నుంచి, దోపిడిదారుల నుంచి తెలంగాణ విముక్తి పొందేందుకు పోరాటం చేయాలని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ రూరల్ ఇన్చార్జి భూపతిరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నిజామాబాద్ మండలం ఖానాపూర్‌లో పార్టీ మండల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. భూపతిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన కాంగ్రెస్ పాలనలోనే ప్రజాసంక్షేమం వెల్లివిరుస్తుందన్నారు. రైతు ప్రభుత్వం అన్ని గొప్పలు చెప్పుకొనే బీఆర్ఎస్పాలకులు అన్నదాతకు చేసిందేమీ లేదన్నారు.
తాము అధికారంలోకి రాగానే రూ.2 లక్షల పంటరుణాన్ని ఒకేసారి మాఫీ చేయడంతో పాటు, వరికి రూ.2,500 మద్దతు ధర అందిస్తామన్నారు. ఇందూరు రైతుల వరప్రదాయినిగా పేరొందిన ఎన్సీఎస్ఎఫ్ ఫ్యాక్టరీని పున:ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే దశాబ్ది ఉత్సవాల పేరిట ఆర్భాటం చేస్తున్నారని వాపోయారు. ఇవి దశాబ్ది ఉత్సవాలు కావు.. దగాకోరు ఉత్సవాలని ఎద్దేవా చేశారు. పీసీసీ కార్యదర్శి నగేశ్‌రెడ్డి, కిసాన్ ఖేత్ జిల్లాధ్యక్షుడు ముప్పగంగారెడ్డి, లీడర్లు రాజేంద్రప్రసాద్, కుమార్‌రెడ్డి, నరేశ్ తదితరులుపాల్గొన్నారు.