దళిత రిజర్వేషన్ల పెంపునకు ఉమ్మడిగా పోరాడుదాం

మొదటి నుంచి ఈ దేశంలో మాలలు రాజ్యాంగబద్ధంగా జీవనం సాగిస్తున్నారు.   ప్రజాస్వామ్య రక్షణలో ముందుండేది ఇప్పుడు కూడా మాలలే అనే అంశాన్ని మర్చిపోరాదు. ఎమ్మార్పీఎస్​ఉద్యమానికి శివసాగర్, గద్దర్, గోరటిలాంటి వారు అండగా నిలిచారు. మాలలోని మేధావులు, సామాజిక వాదులు ఎంతోమంది అనేక సామాజిక ఉద్యమాలకు మద్దతుగా నిలబడ్డారు.  ఇప్పటికీ కూడా మేం వర్గీకరణను వ్యతిరేకించేది న్యాయబద్దంగా గతంలో జరగలేదని మాత్రమే.  మా బాధ అంతా మాకోసం కాదు, 57 ఉపకులాల గురించి అని గుర్తించాలి. 

ఇంకా  మన ఉపకులాలలో బడి మొహం చూడనివారు ఉన్నారు.  మేం ఎప్పుడు కూడా బలహీన వర్గాల శ్రేయస్సు కోరేవారిగా.. మాల, మాదిగ ఉపకులాలకు ఇప్పటివరకు రిజర్వేషన్ ఫలాలు అందనివారికి లబ్ధి పొందేవిధంగా ఉండాలని, సుప్రీంకోర్టు చెప్పినట్టు ఎంపాటికల్​ డేటా,  సైంటిఫిక్ డేటా, సిస్టమాటిక్ డేటా ఆధారంగా విభజన జరగాలని కోరుతున్నాం. 

వర్గీకరణకు ప్రామాణిక లెక్కలు తీయాలి

గురుకుల పాఠశాల అడ్మిషన్లలో  90% మంది  మాదిగ విద్యార్థులకే అవకాశం కల్పించి, వారికి అన్ని రంగాలలో ఉన్నత విద్యావకాశాలను కల్పించిన సంగతి మన కళ్లముందే జరిగింది.   నాణానికి ఒకవైపు చూసి ఎప్పుడూ మాట్లాడకూడదు. ఎప్పుడో 1930లలో జరిగిన కులగణన  లెక్కల ఆధారంగా మాట్లాడితే ఎలా కుదురుతుంది? సామాజిక ఉద్యమాన్ని భుజాన వేసుకున్న గద్దర్, గోరటి, గూడ అంజయ్య, జయరాజు, బండి యాదగిరిలాంటి వాళ్ళు కులం కోసం పనిచేయలేదు కదా సామాజిక తెలంగాణ ధ్యేయంగా పనిచేశారు. 

దళితులకు 25శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం

కొందరు రాజ్యాంగబద్ధం, ధర్మబద్ధం, న్యాయబద్ధం అనే పదాలు వాడినంత మాత్రాన తప్పు ఒప్పు అయిపోదు.  4% లేని ఓసీలకి ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్లు కల్పించి పార్లమెంట్​లో చట్టం చేసి అమలులోకి తీసుకు వచ్చారు.  ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కూడా పార్లమెంట్​లో  చర్చించి బిల్లుచేస్తే అయిపోవు కదా. ఈ మాల, మాదిగ పంచాయితీ ముగిసిపోవు కదా. ఇంకో విషయం భాగ్యరెడ్డి వర్మ  చేసిన సామాజిక సేవ మర్చిపోయారా?  నిజాం నవాబుతో కలిసి దళితుల అభ్యున్నతికి పాటుపడింది చరిత్రలో చెరిపివేసినా  చెరగని ముద్రలు.  హైదరాబాద్ (భాగ్యనగరం) ఉన్నన్ని రోజులు బాగ్యరెడ్డివర్మ  పేరు చరిత్రలో  చిరస్థాయిగా  నిలిచి ఉంటుంది. ఉమ్మడిగా పోరాడి 25% రిజర్వేషన్లు  పొందిన తర్వాత మనం వర్గీకరణ అంశంపై సానుకూలంగా ఇరువైపులవారు కూర్చుండి మాట్లాడుకొని పరిష్కారం చేసుకుందాం. 

ఇప్పటికి ఎప్పటికి మాలలు..అణగారిన వర్గాలవైవు, దాడిత, పీడిత కులాల పక్షాన ఉన్నారు. భారతదేశ అత్యున్నత పార్లమెంట్ ద్వారా చర్చ జరిగి తెలంగాణ ప్రాంతంలోని మాల, మాదిగల ఆర్థిక, సామాజిక  స్థితిగతులపై సమగ్ర చర్చ జరిపి అప్పుడు వర్గీకరణ చేస్తే మేం దానిని స్వాగతిస్తాం.

అన్ని దళిత కులాలకు న్యాయం జరగాలంటే..మాలలు ఎక్కువ లబ్ధి పొందుతున్నారు దానివల్ల57 కులాలు నష్టపోతున్నాయనిపిస్తే.. ఏ, బీ గ్రూపులుగా  విభజించి 57 కులాలను  ఏ గ్రూపులో,   మాల, మాదిగ కులాలను బీ గ్రూపులో చేర్చి  ఏ గ్రూప్ వారికి 6%,   బీ గ్రూప్ వారికి 9% తీసుకుందాం.  దీని ద్వారా మాల, మాదిగ ఉపకులాలు అతి తొందరగా రిజర్వేషన్లను ఉపయోగించుకొని అభివృద్ధి పథంలోకి వస్తారు.   

సుప్రీంకోర్టు తీర్పు వచ్చినంక ముఖ్యమంత్రి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఉత్తమకుమార్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసినా..  ఏ మాల కులాలు కూడా వ్యతిరేకించలేదు.  అడ్డుకోలేదు.  ఈ దేశంలో ప్రతి సందర్భంలో సామాజిక చైతన్యం నింపడంలో  బాబా సాహెబ్ అంబేద్కర్​ వారసత్వం కలిగిన మాలలు సామాజిక బాధ్యతతో నిలబడ్డారు.  మాల సామాజిక వర్గం ఎప్పుడూ కూడా సబ్బండ  వర్గాలతో నీతి, నిజాయితీతో  సత్సంబంధాలను కలిగే ఉంటుందని గమనించాలి. 

- మాదాసు రాహుల్​రావు, హైకోర్టు అడ్వకేట్-