- ఆన్లైన్ ద్వారా కంప్లైంట్లు తీస్కుంటాం
- ప్రత్యేకంగా వాట్సాప్ నంబర్అందుబాటులోకి తెస్తాం
- నల్గొండ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన చందనా దీప్తి
నల్గొండ/నల్గొండ అర్బన్, వెలుగు: టెక్నాలజీని వాడుకుని నల్గొండ జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఎస్పీ చందనా దీప్తి చెప్పారు. సోమవారం ఆమె నల్గొండ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేసిన అపూర్వరావును ప్రభుత్వం సీఐడీ విమెన్ ప్రొటెక్షన్ సెల్‌కి ట్రాన్స్ ఫర్ చేసి, ఆమె స్థానంలో 2012 బ్యాచ్‌కు చెందిన చందనాదీప్తిని ప్రభుత్వం నియమించింది. సోమవారం బాధ్యతలు స్వీకరించిన ఆమెకు అడిషనల్ ఎస్పీ హనుమంతరావు, ఎస్ బీ డీఎస్పీ సోమ్ నారాయణ్ సింగ్, డీఎస్పీలు శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి, గిరిబాబు, సైదా, సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు, డీపీఓ సిబ్బంది స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు త్వరలోనే ఆన్లైన్సేవలు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. అందుకు ప్రత్యేకంగా వాట్సాప్నంబర్ను అందుబాటులోకి తెస్తామన్నారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రయారిటీ ఇస్తామని స్పష్టం చేశారు. పదేండ్ల కింద తాను జిల్లా ఏఎస్పీగా పనిచేసినట్లు గుర్తుచేశారు. రౌడీయిజం, గుండాయిజం చేస్తే సీరియస్యాక్షన్ఉంటుందని హెచ్చరించారు.
వ్యభిచారం, గంజాయి, నార్కోటిక్ డ్రగ్స్ స్మగ్లింగ్‌పై నిఘా పెంచుతామని చెప్పారు. జిల్లాలో భూతగదాలకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయని, గొడవలకు కారణం తెలుసుకుని పరిష్కరిస్తామని తెలిపారు. భూతగదాల్లో పోలీసుల జోక్యం మితిమీరితో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అనంతరం సిబ్బందితో కలిసి ఎస్పీ చందనా దీప్తి న్యూఇయర్ కేక్ కట్‌చేశారు.