2014 నుంచి తెలంగాణ ప్రభుత్వంలో వివిధ పదవులు చేపట్టి గౌరవాలు పొందినవారు.. ఇప్పటికీ ఏదో హోదాలో ప్రభుత్వంలో కొనసాగుతున్న తెలంగాణ రచయితలు, కళాకారులు, ఉద్యమకారులు కొంత ఆలోచించాలని ప్రజల మనవి. తెలంగాణ సాధనా క్రమంలో వీరి పాత్ర ఎంతో గొప్పది. పత్రికల్లో వీరి వ్యాసాలు, టీవీల్లో చర్చలు, కవితలు, కథలు, పాటలు, ప్రసంగాలతోపాటు వీరు ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొన్నారు. దీంతో ప్రజలకు తెలంగాణ ఆవశ్యకతపై ఒక స్పష్టమైన అవగాహన, ఉత్సాహం వచ్చాయి. వీరంతా ఉద్యమ నాయకత్వానికి తోడుంటే ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం తప్పకుండా సాధ్యపడుతుందని జనం నమ్మారు.
ఎవరో ఒకరు తెలంగాణను సాధిస్తే చాలు, తర్వాత కోరుకున్నట్లు మలుచుకుందాం అన్న జయశంకర్ సార్ తెలంగాణను చూడలేకపోయారు. ఆయన ఆశల్ని నిజం చేయవలసిన బాధ్యత వీరెత్తుకుంటారని జనం ఆశ పడ్డారు. సొంత రాష్ట్రం ఏర్పడ్డాక వివిధ పదవులను చేపట్టడంలో తప్పేమీ లేదు. అది వారి హక్కు కూడా. అయితే, ఆ పదవులు కొందరికి అలంకారంగా మరికొందరి కాళ్లకు బంధంగా మారాయి. కేసీఆర్ ప్రకటించిన రకరకాల పథకాలలో ఉన్న లొసుగులను వారు చూసిచూడనట్లు నటించడం లేదా ప్రశంసించడం గర్హనీయం.
భూస్వాములకు రైతు బంధు
రైతు బంధు రూపంలో వందల ఎకరాలుండి అరక పట్టని భూస్వామి ఖాతాలో పత్రి ఏటా లక్షల రూపాయలు పడుతున్నాయి. సాగులో 35 శాతం భాగస్వాములైన కౌలు రైతులకు ఒక్క పైసా సాయం దక్కక పోవడం చాలా అన్యాయం. కౌలు రైతు పంటతో కడుపు నింపుకుంటున్న నేతలు వారు అసలు రైతులే కాదనడం అత్యంత బాధాకరం. కాలహరణ వల్ల పంట రుణ మాఫీ అటు వ్యవసాయదారులను, ఇటు బ్యాంకర్లను పెద్ద గందరగోళంలో పడేసింది. ప్రభుత్వం చెల్లిస్తుందని ఆశతో ఎదురుచూసినవారు బ్యాంకు లెక్కల్లో డిఫాల్టర్లు అయిపోయారు. 2018లో లక్ష రూపాయల వరకు తీసుకున్న రుణం మాఫీ అని చెప్పినా చివరాఖరికి రూ.99,999- వరకే మాఫీ సొమ్ము విడుదల చేశారు. ఈ లక్షలోపు తిరకాసు మోసమే. బ్యాంకుల్లో ఎవరూ లక్షకు రూపాయి తగ్గించి రుణం ఇవ్వరు, తీసుకోరు. ఈ లక్ష తీరాలంటే వడ్డీ మరో లక్ష అవుతుందేమో.
ఎమ్మెల్యేలకు దళిత బంధు కమీషన్
దళిత బంధు హుజురాబాద్ ఉప ఎన్నికలో పుట్టిన కొత్త పథకం. దళితులైతే చాలు పథకానికి అర్హులే అని, రిటైర్ అయి పింఛన్ పొందుతున్న ఉపాధ్యాయ దంపతులకు కూడా హుజురాబాద్ లో ఓటర్లైనందుకు ఇద్దరికీ చెరో పది లక్షలు మంజూరు చేశారు. హుజురాబాద్ ఎన్నిక ఫలితాల తర్వాత ఈ పథకం వేగం తగ్గిపోయింది. దళిత బంధు లబ్దిదారుల నుంచి కమీషన్ తీసుకున్న ఎమ్మెల్యేల చిట్టా తన దగ్గర ఉందని స్వయానా ముఖ్యమంత్రి పాత్రికేయుల ముందు అనడం ఈ పథకానికి పతాక స్థాయి వ్యాఖ్య. రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి మరీ ఘోరం. ఉన్న ఉద్యోగులకే సమయానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో కొత్త ఉద్యోగాల కల్పన అసాధ్యం. అందుకే ఏదో రూపంలో ఉద్యోగ భర్తీలు వాయిదా పడుతున్నాయి. పరీక్షల కోసం చదివి.. చదివి ఉద్యోగార్థులు విసిగి వేసారి పోయారు. ఏవో చిన్న, చితక తాత్కాలిక పనులు చేస్తున్నవారు నోటిఫికేషన్ వస్తుందనగానే పని మాని, ఆదాయం కోల్పోయి మళ్ళీ పుస్తకాల వెంట పడుతున్నారు. రాసిన పరీక్షలేమో రద్దు, వచ్చిన ఫలితాలు ముందుకు సాగనిస్థితి వారిని, వారి కుటుంబాలను గుండెకోతకు గురిచేస్తున్నాయి. వయసు మీరి, పెండ్లి వాయిదా వేసి, ఏదో దొరికిన పనిలో స్థిరపడలేక సుమారు పదేండ్లుగా ఎదురుచూపులతో ఊపిరి పీలుస్తున్న ఒక తరాన్ని మొత్తం ప్రభుత్వం పచ్చి మోసం చేసింది. కనీసం ఎన్నిక హామీ ప్రకారం నిరుద్యోగ భృతి అయినా ఇవ్వడం లేదు. ఇంతకన్నా దుర్మార్గం ఏదీ ఉండదు. భూస్వాములకు రైతు బంధు, మాజీ ఉద్యోగులకు దళిత బంధు ఇచ్చే ప్రభుత్వానికి నిరుద్యోగులపై కనికరం లేకపోవడం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యమే అనుకోవాలి.
మేధావులు మౌనం వీడాలి
2014కు ముందు మేధావులు ప్రజల బాగు కోసం బతుకును, సమయాన్ని, సొమ్మును త్యాగం చేశారు. తెలంగాణ వచ్చాక వీరి నడక అలాగే ఉంటుందని జనం నమ్మారు. ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి సొంత పనులు చక్కబెట్టుకుంటుందని తెలిసిన వెంటనే వీరు పాలకులను నిలదీస్తారని ప్రజలు ఆశపడ్డారు. అయితే, ప్రజలు ఆశించిన విధంగా జరగలేదు. ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తున్నది అని వీరు చెప్పే మాటలు తర్కబద్దంగా, నమ్మశక్యంగా లేవు. ప్రభుత్వ పథకాల రచన, వాటి అమలులో తప్పులు, స్వార్థపరత్వం, ఉద్యోగ నియామకాల ప్రక్రియలో జాప్యం లాంటి ఎన్నో అంశాలను వీరు ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చిన దాఖలాలు లేవు. ప్రభుత్వం తమ ఆకాంక్షలకు తగినట్లు సాగితేనే మీ వెంట ఉంటాం లేదంటే.. ప్రజల వైపు నుంచి ప్రశ్నిస్తాం అనవచ్చు కదా! మేధావులూ మౌనం వీడండి.
కాళేశ్వరం ఊసెత్తని బీఆర్ఎస్ నేతలు
మేడిగడ్డ రిజర్వాయర్ పనులు నాణ్యత లేక, ప్లాను ప్రకారం నిర్మించిక పునాది జారిపోయిందని తేలింది. సివిల్, ఇరిగేషన్ పనుల్లో నిరంతర పర్యవేక్షణ అత్యావశ్యకం. ఇసుక తేలడంతో అందరి అసలు నిజాయితీ బయటపడింది. ఎన్నికల ప్రచారంలో కాళేశ్వరం మాట ఎత్తవద్దని పార్టీ పెద్దలు సూచించారని పత్రికల్లో వచ్చింది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో, పంపిణీలో నత్తనడక. గొర్రెల పంపిణీ పథకంలో గొల్లల ఎడతెగని నిరీక్షణ, డాక్టర్లు లేక తెరవని బస్తీ దవాఖానాలు, నామమాత్రంగా నాలుగు స్కూళ్లకే పరిమితమైన బడి పిల్లలకు అల్పాహార పథకం ఇలా సక్రమంగా నడవని పథకాలు ఎన్నో ఉన్నాయి. అయితే, తెలంగాణ సాధనలో ఉద్యమించి, సాధించి ప్రభుత్వంలో భాగస్వాములైన మేధోవర్గానికి కూడా కొన్ని ఆశలు, ఆకాంక్షలు ఉండే ఉంటాయి. ఈ పాలనలో అవి ఏ మేరకు సాకారమయ్యాయి. ప్రభుత్వ నిర్ణయాలు వారి ఆకాంక్షలను నెరవేర్చే దిశగానే ఉన్నాయా అనే ఆలోచన అవసరం. యాభై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ ఏం చేసింది? ఈ పథకాలు దేశంలో మరెక్కడా లేవు అనే డొంక తిరుగుడు రాజకీయ సమాధానాలు వీరు చెబితే జనం సంతృప్తి పడే స్థితిలో లేరు.
ధరణి తప్పులు ఒప్పుకున్న సర్కారు
ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూమి ధరణిలో తమ పేరిట కాకుండా, పాత యజమాని పేరు ఉండి ఆయనకే బ్యాంక్ లోన్ , రైతు బంధు లభిస్తోందని చెప్పేవారు ప్రతి ఊర్లో ఉన్నారు. ధరణిలో తప్పులున్నాయని ప్రభుత్వమే ఒప్పుకుంది. తాపీగా బిస్కెట్లు తింటూ టీవీలో రైతుల ప్రశ్నలకు అరకొర సమాధానాలు చెప్పి తప్పించుకున్న మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ వ్యవహారం ఎన్నో విమర్శల పాలైంది. ఆ దెబ్బకు తిరిగి ధరణి మీట్ ఏర్పాటు చేయలేదు. ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే 24 గంటల కరెంటు విద్యుత్ శాఖ ఉద్యోగుల జీతాలకు ఎసరు తెస్తోంది. వసూలైన బిల్లు సొమ్ము కొనుగోలు చేసిన కరెంటు చెల్లింపునకే సరిపోవడం లేదు. ఆ శాఖకు అప్పులు పెరిగిపోతున్నాయి. సాధ్యమైతే ఇవ్వాలి కానీ గొప్పలకు పోయి అడ్డగోలుగా కొని ఆ విభాగాన్ని దివాలా తీయించడం తగదు. ఆర్థిక పరిస్థితి వివరించి కొన్ని గంటలు తక్కువిస్తామన్నా ప్రజలేమీ ఆగ్రహంతో తిరగబడరు.
ALSO READ : అయ్యా ! ముఖ్యమంత్రి గారూ.. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకోవాలో చెప్పగలరా ?
- బి నర్సన్ సోషల్ ఎనలిస్ట్