- సిటీలోని ముంపు ప్రాంతాల్లో భయాందోళన
- ఇప్పటికే నిండిన చెరువులు, జలాశయాలు
- నీట మునిగే ఉన్న లోతట్టు కాలనీలు
- గతేడాది నుంచి మారని చెరువుల రూపురేఖలు
హైదరాబాద్, వెలుగు: సిటీలో ఎడతెరపి లేని వానలతో ముంపు ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. మూసీ, చెరువుల పరివాహక ప్రాంతాల్లోని కాలనీలు, బస్తీల వాసులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. వానాకాలం మొదట్లోనే భారీగా వానలు పడుతుండగా ఈసారి కూడా వరదల తీవ్రత పొంచి ఉంటుందనే ఆందోళనలో స్థానికులు ఉన్నారు. వారం రోజులుగా వానలతో చెరువులు, జలాశయాల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఇన్ లెట్, అవుట్ లెట్స్ సక్రమంగా లేక లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి. గతేడాది అక్టోబర్‌లో పడిన వానలకు 5 వేలకు పైగా కాలనీలపై వరద ప్రభావం పడింది. ఈసారి సీజన్ మొదట్లోనే వరద ముప్పును ఎదుర్కొంటున్నారు.
తొలగని వరద ముంపు
సిటీలో ప్రస్తుతం 50కి పైగా కాలనీల్లో వరద ముంపు ఉంది. గతేడాదిలో తీవ్ర నష్టం కలిగించిన అప్పా చెరువు, రామంతాపూర్ పెద్ద చెరువు, బండ్లగూడ చెరువు, ఫాక్స్ సాగర్, మంత్రాల చెరువు, సరూర్ నగర్ చెరువున్నీ నిండిపోయి ఉన్నాయి. నాగోల్‌లోని బండ్లగూడ చెరువు నిండి హనుమాన్ నగర్ నీట మునిగే ఉంది. ఎల్బీనగర్లోని అయ్యప్ప కాలనీలో వరద నీరు పారుతూనే ఉంది. మీర్ పేట్ గొలుసుకట్టు మంత్రాల చెరువులోకి భారీగా వరద నీరు చేరుతుండగా మిథిలానగర్ కాలనీని చుట్టేసింది. బడంగ్‌పేట కోమటి కుంట ఇప్పటికే నిండగా, దీనిపైనున్న పోచమ్మ కుంట నుంచి వరద వచ్చి చేరుతుండగా ముంపు పొంచి ఉంది. గతేడాది నుంచి నీటిలోనే ఉన్న ఉస్మాన్ నగర్ కాలనీలోకి వరద నీరు వస్తోంది. బురాంఖాన్ చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ కు చేరగా స్థానికులు ఇండ్లను వదిలివెళ్లిపోయారు. ఫాక్స్ సాగర్ లేక్ నిండుతోంది. రామాంతాపూర్ పెద్ద చెరువులోకి వారం రోజులుగా వరద నీరు వస్తుండగా ఫుల్ ట్యాంక్ లెవల్ కు నీటి మట్టం చేరగా మోటార్లతో నీటిని బయటకు తోడేస్తున్నారు. అధికారులు అవుట్ లెట్ సరి చేయలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జలాశయాల్లోకి భారీగా వరద
హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ (గండిపేట్) జలాశయాల్లోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో శుక్రవారం ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, వాటర్ బోర్డు ఎండీ దానకిషోర్ తో కలిసి రిజర్వాయర్లను పరిశీలించారు. జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో సంబంధిత అధికారులతో పరిస్థితిని అడిగారు. మూసీకి ఇరువైపులా పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు, మురికి వాడలు, బస్తీ వాసులను ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. హుస్సేన్ సాగర్ పుల్ ట్యాంక్ లెవల్ కు చేరి అలుగు పారుతోంది.
మారని రూపు రేఖలు
గతేడాదిలో 30కి పైగా చెరువులు కట్టలు తెగిపోగా, ధ్వంసమైన అవుట్ లెట్లతో పాటు అలుగులు వరద తీవ్రతకు కొట్టుకుపోయాయి. ఏడాది కావస్తున్నా ఆయా చెరువుల వద్ద వరద నియంత్రణ చర్యలేవి చేపట్టలేదు. అప్పా చెరువుకు మరమ్మతులు చేయగా ఇటీవల కూడా మరోసారి రిపేర్లు చేశారు.
సహాయక చర్యలపై దృష్టి పెట్టాం
వానలపై వస్తున్న ఫిర్యాదులపై దృష్టి పెట్టాం. కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశాం. ముంపు ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టేలా ఆదేశాలిచ్చాం. కూలిన చెట్లు, గుంతల పూడ్చివేత, రోడ్ల మరమ్మతులకు రిపేర్ టీంలు, మొబైల్ ఎమర్జెన్సీ బృందాలు, సెంట్రల్ ఎమర్జెన్సీ బృందాలతో పాటు డిజాస్టర్ మేనేజ్ మెంట్ విభాగం టీమ్ లను కూడా ఏర్పాటు చేశాం.
- గద్వాల విజయలక్ష్మి, మేయర్