భారతదేశంలో గిరిజన ఉద్యమాలు పలు కారణాలతో ఉద్భవించాయి. బ్రిటీష్ పరిపాలనా కాలంలో బ్రిటిష్ నియంతృత్వ వైఖరికి, దోపిడీకి, అణచివేతకు, గిరిజన వ్యతిరేక విధానాలను నిరసనగా గిరిజనోద్యమాలు ఉద్భవించి కొనసాగాయి. గిరిజన సమూహాలు తమ సంస్కృతిని కాపాడుకునేందుకు, తమ గిరిజన సామాజిక, రాజకీయ వ్యవస్థాపనను పున: స్థాపించుకోవడానికి వివిధ ప్రాంతాల్లో అనేక గిరిజనోద్యమాలు తలెత్తాయి. స్వాతంత్ర్యానంతర కాలంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ ఆర్థిక విధానాల వల్ల తమ ఉనికిని, గుర్తింపును కోల్పోతామేమోననే భయాందోళనలు గిరిజన సమూహాల్లో ఏర్పడ్డాయి. ఆ భయాందోళనల పర్యవసానంగా ఎన్నో ఉద్యమాలు తలెత్తాయి. కొన్ని తెగల్లో సామాజిక, మతపరమైన కారణాల వల్ల కూడా ఉద్యమాలు బయల్దేరాయి. కొన్ని ముఖ్యమైన గిరిజన, ఆదివాసీ ఉద్యమాల గురించి తెలుసుకుందాం.
సర్దార్ల తిరుగుబాటు
రెండో షా ఆలమ్ బెంగాల్, బిహార్, ఒరిస్సా దివానీలకు 1765లో తూర్పు ఇండియా కంపెనీకి గ్రాంటుగా ఇచ్చాడు. ఇది ఆ ప్రాంతాల్లోని రాజులు, కుల పెద్దల అధికారానికి గొడ్డలిపెట్టు కావడంతో బిహార్ దివానీలో భాగమైన చోటానాగ్పూర్ ప్రాంతంలో వారంతా తమ అనుచరులతో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఆదివాసి రాజులు, కుల పెద్దలను సర్దార్లని పిలిచేవారు. వీరి నాయకత్వంలో తిరుగుబాటు జరిగింది. కాబట్టి దీనికి సర్దార్తిరుగుబాటు అని పేరు వచ్చింది.
రంప తిరుగుబాటు
ఆంధ్రప్రదేశ్‌లో ఆదివాసీల సమస్య వందల సంవత్సరాలుగా కొనసాగుతున్నది. ఆదివాసీలు బ్రిటీష్ పాలకులకు, వారి అండతో దోపిడీ సాగించిన భూస్వాములు, వడ్డీ వ్యాపారస్తులు, ముస్తాదారులకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించారు. మొదటిసారి 1802–1803వ సంవత్సరంలో ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా చోడవరం తాలుకాలో ఉన్న రంప ప్రాంతంలో రామభూపతి నాయకత్వంలో కోయ తిరుగుబాటు జరిగింది.
తెభాగా గిరిజన రైతాంగ పోరాటం
తెభాగా పోరాటం భూస్వాములకు రైతులు చెల్లించే పంట వాటాను సగం నుంచి మూడో వంతుకు తగ్గించాలన్న డిమాండ్‌తో1946, సెప్టెంబర్‌లో ప్రారంభమైంది. ఉత్తర బెంగాల్లోని దీనాపూర్ – రంగాపూర్లోప్రారంభమై ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వ్యాపించి 24 పరగణాల వరకు విస్తరించింది. ఈ పోరాటంలో ప్రధానంగా ఆదివాసీలు, సంతాల్ రైతులు పాల్గొన్నారు. ఈ పోరాటానికి కిసాన్ సభ నాయకత్వం వహించింది.
భిల్లు ఆదివాసీ తిరుగుబాటు
భిల్లు జాతికి చెందిన ఆదివాసీలు గుజరాత్‌లోని సూరత్, పడమటి ఖాందేశ్లో తపతి నదీలోయ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. 1800 నుంచి మరాఠా పాలనలో భిల్లులు హింసాకాండకు గురయ్యారు. 1809లో భిల్లులు సమూహాలుగా ఏర్పడి మరాఠా పాలకులకు వ్యతిరేకంగా ఆ తర్వాత బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేశారు.
సంతాల్ తిరుగుబాటు
సంతాల్ తిరుగుబాటు బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా 1885లో జరిగింది. సంతాల్‌లు నివసించే ప్రాంతాన్ని సంతాల్ పరిగణాలుగా పేర్కొనేవారు. ఈ ప్రాంతం బెంగాల్, బిహార్, ఒరిస్సా రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. 1793లో బ్రిటీష్ వారు ప్రవేశపెట్టిన శాశ్వత జమిందారీ పద్ధతి, సంతాల్‌లు తరతరాలుగా అడవిని చదును చేసి సాగు చేసుకుంటున్న భూములను జమీందార్ల పరం చేసింది. సంతాల్ గ్రామాల్లోకి బెంగాలీ వర్తకులు ప్రవేశించి అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి, బాకీ కింద సంతాల్‌ల భూములను స్వాధీనం చేసుకున్నారు. వీటికి వ్యతిరేకంగా 1811, 1820, 1892 సంవత్సరాల్లో అనేక చోట్ల సంతాల్‌లు తిరుగుబాట్లు చేశారు.
ఆదిలాబాద్ గోండుల తిరుగుబాటు
19వ శతాబ్దం చివరి వరకు గోండులు అడవిలో పోడు వ్యవసాయం చేసి, స్వేచ్ఛగా జీవించేవారు. 20వ శతాబ్దం ప్రారంభం నుంచి బ్రిటీష్ ప్రభుత్వం ప్రత్యక్షంగా తన అధీనంలో ఉన్న ప్రాంతాల్లోను, సామంతరాజుల ఏలుబడిలో ఉన్న ప్రాంతాల్లోను అటవీ చట్టాలను ప్రవేశపెట్టింది. తద్వారా గోండు రైతులపైన వివిధ రకాలైన పన్నులను విధించారు. పంట కల్లాల్లో ఉండగానే అంతకుముందు అప్పులిచ్చిన వ్యాపారులు బాకీ కింద బస్తాలకు బస్తాలు ధాన్యాన్ని తీసుకుపోయే వారు. ఇలాంటి పరిస్థితుల్లో కుమ్ర్ం భీం 1940లో గూడేలన్నీ తిరిగి గోండులను సమావేశపరిచి పోరాట మార్గాన్ని వివరించి చెప్పారు. ఈ విధంగా జోడేఘాట్ ప్రాంతంలో గోండులు కుమ్రం భీం నాయకత్వంలో తిరుగుబాటు చేశారు.
మన్యం తిరుగుబాటు
విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఆంగ్లేయుల దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా 1922–24ల మధ్యకాలంలో అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో మన్యం గిరిజనులు సాయుధం పోరాటం చేశారు. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో బ్రిటీష్ పాలకుల అండతో జమీందార్లు, ముస్తార్లు, పోలీసులు కోయ, కొండరెడ్లపై విపరీతంగా పన్నులు విధించుతూ బ్రిటీష్ ప్రభుత్వం రోడ్డు నిర్మాణ పని కోసం గిరిజనులతో బలవంతంగా పనులు చేయించాలని ప్రయత్నించడంతో వీరందరి పట్ల పేరుకుపోయిన అసంతృప్తి తిరుగుబాటుకు దారి తీసింది.
కోల్ తిరుగుబాటు
ఈ తిరుగుబాటు బుద్ధో భగత్ నాయకత్వంలో జార్ఖండ్‌లో జరిగింది. ఇందుకు కారణం ప్రభుత్వ చట్టాలు గిరిజనేతరులను అనుమతించడం.1832లో ప్రారంభమైన తిరుగుబాటు కలకత్తా, దీనాపూర్, బెనారస్ ప్రాంతాలకు విస్తరించింది.
వర్లీ తిరుగుబాటు
మహారాష్ట్ర కోస్తా జిల్లా అయిన థానేలో ఎక్కువ సంఖ్యలో వర్లీలు నివసిస్తున్నారు. వర్లీల ప్రధాన వృత్తి వ్యవసాయం. మిగతా అన్ని ప్రాంతాల్లో మాదిరిగానే భూస్వాములు వారి భూములను లాక్కొని వారిని వ్యవసాయ కూలీలుగా దిగజార్చారు. 1944లో రెండో ప్రపంచ యుద్ధం ప్రభావం వల్ల నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయి. కానీ వర్లీలకు చెల్లించే వేతనాల్లో పెరుగుదల లేకపోవడంతో వర్లీల జీవన పరిస్థితులు పూర్తిగా దిగజారాయి. దోపిడీ నుంచి విముక్తి పొందడానికి కిసాన్ సభ నాయకత్వంలో వర్లీలు పోరాటం చేశారు.