ఏ దేవాలయానికి వెళ్లినా గుడి ముందు ఎత్తుగా ధ్వజస్తంభం ఉంటుంది. భక్తులు ముందు దానికి నమస్కరిస్తారు. ప్రదక్షిణ చేస్తారు. ఆ తర్వాత ఆలయంలోకి వెళ్తారు. ధ్వజస్తంభానికి ప్రత్యేకంగా అలంకరణలు చేస్తారు. ధ్వజస్తంభం ప్రతిష్టను ప్రత్యేక తంతుగా నిర్వహిస్తారు. గుడిలో దేవుడు ఉంటాడు. మరి.. గుడి ముందు ధ్వజస్తంభం ఎందుకు ఉంటుంది? ధ్వజస్తంభానికి ఎందుకు మొక్కాలి? ధ్వజస్తంభం ప్రత్యేకతేంటి?
మహాభారతంలో భక్తి, భక్తుడు, భగవంతుడికి ఉన్న సంబంధాన్ని తెలిపే కథలు చాలా ఉన్నాయి. భక్తి కేవలం భగవంతుడి మీద ఉంటే సరిపోదు. సాటివారి మీద కూడా ఉండాలి. దేవుడిని ఎలా ప్రేమిస్తారో తోటివారిని కూడా అలా ప్రేమించగలిగితే, సాయం చేయగలిగితే భగవంతుడికి మరింత దగ్గరవ్వొచ్చని చెప్తుంది మయూరధ్వజుని కథ. మయూరధ్వజుడికి, దేవాలయంలో ఉండే ధ్వజస్తంభానికి సంబంధం ఉంది.
పేరుకోసం
ధర్మరాజు కురుక్షేత్ర యుద్ధం తర్వాత సింహాసనం అధిష్టిస్తాడు. దానాలు, ధర్మాలు చేస్తూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలనుకుంటాడు. ధర్మబద్ధంగా పాలన చేస్తుంటాడు. అలా చేయడం వల్ల తనకు కీర్తి రావాలని, అందరి రాజులకన్నా గొప్ప పేరు కావాలని కోరుకుంటాడు. అది ఎంతదాకా వెళ్తుందంటే... కేవలం పేరుకోసమే దాన ధర్మాలు చేసే వరకు పోతుంది. కృష్ణుడు దానంలోని గొప్పతనం గురించి, ప్రతిఫలం కోసం దానం చేయకూడదని ధర్మరాజుకు తెలిసేలా చేయాలనుకుంటాడు. 'పాండవుల గొప్పదనం. కీర్తి అందరికీ తెలియాలంటే అశ్వమేధయాగం చేయాలి' అని ధర్మరాజుకు సలహా ఇస్తాడు. పాండురాజు సంతోషంగా అశ్వమేధయాగానికి ఏర్పాట్లు చేస్తాడు.
కారణం తెలుసుకో..
యాగాశ్వానికి రక్షకులుగా నకులసహదేవులు వెళ్తారు. యాగాశ్వం మణిపురం అనే రాజ్యానికి చేరుకుంటుంది. ఆ రాజ్యాన్ని మయూరధ్వజుడనే రాజు పరిపాలిస్తూ ఉంటాడు. అతడు గొప్ప భక్తుడు. దాత, పరాక్రమవంతుడు. అతడి కొడుకు తామ్రధ్వజుడు. పాండవులు యాగాశ్వాన్ని పట్టుకుని, బంధిస్తాడు. యాగాశ్వం కోసం నకులుడు, సహదేవుడు అతడితో యుద్ధం చేసి ఓడిపోతారు. ఆ తర్వాత అర్జునుడు, భీముడు కూడా అతడి పరాక్రమం ముందు నిలవలేకపోతారు. చివరకు ధర్మరాజు వంతు వస్తుంది. కృష్ణుడు ధర్మరాజును ఆపి.. 'ఒక్కసారి ఆలోచించు. కురుక్షేత్రంలో అంతమంది రాజులను, పరాక్రమవంతులను జయించిన నీ తమ్ముళ్లు అతడి చేతిలో ఓడిపోయారంటే కారణం ఏదో ఉంది. అది తెలుసుకోకుండా తొందరపడడం మంచిది. కాదు. అతడి విజయం వెనక ఏదో బలమైన కారణం ఉంటుంది. దాన్ని తెలుసుకుందాం' అని చెప్తాడు.
దానాన్ని మించింది లేదు
కృష్ణుడు, ధర్మరాజు బ్రాహ్మణులు వేషంలో మయూరధ్వజుని ఇంటికి వెళ్తారు. అతడు వాళ్లిద్దరికి మర్యాదలు చేసి, ఏం కావాలో కోరుకోమంటాడు. కృష్ణుడు 'మేం అడవిగుండా.. వస్తుంటే ఒక సింహం నా కొడుకును పట్టుకుంది. నన్ను తిని నా కొడుకును వదిలి పెట్టమంటే, “ఈ రాజ్యాన్ని పాలించే మయూరధ్వజుని శరీరంలో సగభాగం నాకు తెచ్చి ఇస్తే వదిలి పెడతాను.. అని చెప్పింది. నీ శరీరంలో సగం ఇచ్చినా కొడుకు ప్రాణాలు కాపాడు” అని అడుగుతాడు. రాజు అందుకు ఒప్పుకుని తన శరీరంలోంచి సగభాగం కోసి ఇవ్వడానికి ఏర్పాటు చేస్తాడు. అయితే కృష్ణుడు నీ శరీరాన్ని నీ భార్య, కొడుకు మాత్రమే కోసి ఇవ్వాలనే షరతు పెడతాడు. అందుకు కూడా ఒప్పుకున్న మయూరధ్వజుడు భార్య, కొడుకును పిలిచి తనను కోయమని చెప్తాడు. ధర్మరాజు అతడి దాన గణానికి నివ్వెరపోయి చూస్తుంటాడు.
స్వార్థం లేకుండా..
కోసేటప్పుడు మయూరధ్వజుడి ఎడమకంటిలోంచి కన్నీళ్లు వస్తుంటాయి. అది చూసి కృష్ణుడు "ఏడుస్తూ ఇచ్చే దానం పనికిరాదు. నువ్వు సంతోషంగా దానం ఇవ్వడం లేదు అని అంటాడు. అందుకు రాజు. 'నేను ఏడుస్తుంది... మీకు దానం ఇస్తున్నందుకు భాగం సంతోషంగా సింహానికి ఆహారం అవుతుంది. ఎడమ భాగం మాత్రం వృథాగా పోతుంది కదా అని బాధపడుతున్నాను. అంతేకానీ, మరొకందుకు కాదు. మనస్ఫూర్తిగా మీకు నా శరీరాన్ని దానం ఇస్తున్నాను' అని చెప్తాడు. మయూరధ్వజుని భక్తికి, పరోపకారానికి, దానగుణానికి మెచ్చిన కృష్ణుడు నిజరూపంలో దర్శనమిస్తాడు. స్వార్థం లేని నీ దానగుణాన్ని కళ్లారా చూశాను. ఏం అంటాడు. అందుకు మయూరధ్వజుడు 'నేను చనిపోయినా, నీ ముందు ఉండాలి. ఎప్పుడూ ఇతరులకు ఉపయోగపడేలా దీవించు' అని అడుగుతాడు. అందుకు కృష్ణుడు ఒప్పుకుంటాడు.
దీపమే సాయం
ప్రతి దేవాలయం గర్భగుడిలో దేవుడు ఉంటాడు. అ గర్భగుడికి ఎదురుగా ధ్వజస్తంభం రూపంలో మయూరధ్వజుడు ఉంటాడు. ముందు అతడిని దర్శించి, నమస్కారం చేసిన తర్వాతే భక్తులు దేవుడి దగ్గరకు వెళ్తారు. ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగిస్తారు. మంచి జరగాలని మొక్కుకుంటారు. అలాగే రాత్రుల్లో ధ్వజస్తంభం పైన వెలిగించే దీపం దారి చూపుతుంది. ఈ కథలో ఇంకా మరెన్నో అంశాలూ ఉన్నాయి. దానం మనస్ఫూర్తిగా ఇవ్వాలి. స్వార్థం, ప్రతిఫలం వస్తుందన్న ఆశ ఉండకూడదు. దేవుడిని ఎలా ప్రేమిస్తారో తోటి మనుషులను అలాగే ప్రేమించాలి.
భగవంతుడిని ఎలా చూస్తారో, సాటి మనిషిని అలాగే చూడాలి. మయూరధ్వజుడు సాటి మనిషికోసమే చనిపోవడానికి సిద్ధపడ్డాడు. కష్టాల్లో ఉన్నవాళ్లను ఆదుకోవడం, చేతనైన సాయం చేయడమే ధ్వజస్తంభానికి మొక్కడం వెనకున్న పరమార్ధం. ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించడం అంటే, మరొకరి జీవితాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడం.