సంక్రాంతికి రైతు భరోసా.. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు: మంత్రి పొన్నం ప్రభాకర్

సంక్రాంతికి రైతు భరోసా.. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు: మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్: ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా స్కీమ్ అమలుపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం (జనవరి 2) కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని రైతులకు తీపి కబురు చెప్పారు. అలాగే కొత్త రేషన్ కార్డులు కూడా త్వరలోనే జారీ చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతుందని.. త్వరలోనే లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు. 

మాట ఇచ్చినట్లుగానే సన్న వడ్లకి రూ.500 బోనస్ ఇచ్చాం, వరి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు వేశామని పేర్కొన్నారు. పాఠశాల విద్యార్థులకు డైట్ చార్జీలు పెంచామని..  ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు వేస్తున్నామని గుర్తు చేశారు. 2025 సంవత్సరంలో అంత మంచే జరుగుతుందని.. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న హుస్నాబాద్ గౌరవాన్ని మరింత పెంచుతానని అన్నారు మంత్రి పొన్నం. నియోజకవర్గంలో విద్య, వైద్యం, సాగునీరు అందించడమే నా తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. 

ALSO READ | తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్: 14 నుంచి రైతు భరోసా డబ్బులు జమ

ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా చిగురు మామిడి, సైదాపూర్ మండలాలకు సాగు నీరు అందించే బాధ్యత నాదని నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ బలోపేతం కోసం పని చేయాలని.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలని.. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచే ఉండాలని పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్‏లను ధీటుగా ఎదుర్కోవాలని కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ పదేళ్లు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.