నవభారత నిర్మాణంలో భాగమవుదాం

రండి.. ఇంటింటికీ వెళ్దాం, గడపగడపలో అడుగుపెడదాం, ప్రతిఒక్కరికీ సంక్షేమ ఫలాన్ని చేరుద్దాం, ప్రధాని మోడీతో కలిసి నడుద్దాం, నవభారత నిర్మాణంలో మనమూ భాగమవుదాం. దేశం ఎన్నో సవాళ్ల మధ్య నుంచి ఎన్నడూ లేనంత ఎత్తుకు ఎదుగుతోంది. ప్రధాని మోడీ సారథ్యంలో నవభారతం నిర్మితమవుతున్నది. ఈ క్రతువులో మనమందరం భాగస్వాములు కావాలి. నెలరోజుల పాటు సాగే ‘మహాజన సంపర్క్​ అభియాన్‌‌’లో పాల్గొనాలి. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికీ చేర్చేందుకు.. తొమ్మిదేళ్ల మోడీ సర్కారు పాలనను ప్రజలకు వివరించేందుకు అందరూ ఈ అభియాన్‌‌లో ముందడుగు వేయాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ.. 142 కోట్లకు పైగా జనాభా కలిగిన మన దేశ ప్రధాని మాత్రమే కాదు. ప్రపంచమే ‘ది బాస్‌‌’ అంటూ కొనియాడేలా ఎదిగిన విశ్వనాయకుడు. దేశ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతూనే ప్రపంచంలో భారత్‌‌ను మేటిగా నిలిపేందుకు ఆయన నిత్యం శ్రమిస్తున్నారు. 

‘నా దేశం అన్నార్థి కాదు.. అన్నీ ఇచ్చి ఆదుకునే అన్నపూర్ణ..’అంటూ ఎన్నోదేశాలకు కరోనా కాలంలో ప్రాణభిక్ష పెట్టారు. అలాంటి దేశాలు తనకు పాదాభివందనం చేస్తూ కృతజ్ఞతాభావాన్ని చాటుకున్న తీరునూ ఇటీవల చూశాం. ఇంకెన్ని దశాబ్దాలు గడిచినా ఈ దేశం అసలు వాటిని చూడగలదా? అనే సందర్భాలను మోడీ తన పాలనలో ఆవిష్కరిస్తున్నారు. 370 ఆర్టికలైనా, అయోధ్య ఆలయమైనా, ట్రిపుల్‌‌ తలాఖైనా.. ఇలా ఎన్నో అసాధ్యాలనుకున్నవి ఒక్క మోడీ సర్కారుతోనే సుసాధ్యమయ్యాయి. ఒక్క స్కామ్‌‌ కూడా లేని స్వచ్ఛమైన, అవినీతి రహిత పాలన అందిస్తున్న ఘనత కూడా మోడీకే దక్కుతుందని సగర్వంగా చెప్పగలం. 

సంక్షేమం దిశగా..

తొమ్మిదేళ్ల క్రితం దేశంలో రోజుకో అవినీతి బాగోతం బయటపడేది. 2జీ స్పెక్ట్రమ్, బొగ్గు, కామన్వెల్త్‌‌ గేమ్స్, ఆర్మీ హెలికాప్టర్స్, ఆదర్శ హౌసింగ్‌‌ కుంభకోణం.. ఇలా యూపీఏ ప్రభుత్వ హయాంలో ఎన్నో అవినీతి మరకలు ఉన్నాయి. తమ జేబులు నింపుకునేందుకు దేశాన్ని అప్పుల ఊబిలోకి చేర్చి, ఆర్థికంగా దిగజార్చిన యూపీఏకు తొమ్మిదేళ్లక్రితం ప్రజలు చెంపపెట్టులా తీర్పునిచ్చారు. ఎన్ని ఆరోపణలు చేసినా నిప్పులా నిలబడినా నరేంద్రమోడీ చేతికి ఢిల్లీ పగ్గాలను అప్పగించారు. సవాళ్లతో కూడిన ఆర్థికవ్యవస్థను గాడిన పెడుతూ, పేదప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ, అవినీతి అనే పదమే లేకుండా పాలన సాగిస్తూ.. ప్రపంచమంతా భారతదేశం వైపు చూసేలా మోడీ నిలబెట్టారు. 

 దేశచరిత్రలో సరికొత్త అధ్యాయం..

వేల ఏళ్ల చరిత్ర కలిగిన మన దేశంలో నరేంద్రుడి పాలన సరికొత్త అధ్యాయంగా చెప్పవచ్చు. పక్కలో బల్లెంలా నిత్యం చిచ్చుపెట్టే పాక్​పీచమణచి, ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపారు. మా దేశంపై దాడి చేస్తే ఎంతకైనా తెగిస్తామంటూ సర్జికల్‌‌ స్ట్రైక్స్‌‌తో హెచ్చరించారు. వింగ్‌‌ కమాండర్‌‌ అభినందన్‌‌ను పాక్​క్షేమంగా తిరిగి పంపించిందంటే కారణం.. మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందో, ఎంతకు తెగిస్తుందోనన్న భయం. గత ప్రభుత్వ హయాంలో నిత్యం ఉగ్రచర్యలతో, మన సైనికులపై రాళ్లదాడులతో అల్లకల్లోలంగా ఉండే కాశ్మీరాన్ని ఒక్క ఆర్టికల్‌‌ 370 రద్దుతో మోడీ ప్రభుత్వం ప్రశాంతంగా మార్చేసింది. దేశ ఆర్థిక చరిత్రలోనే సరికొత్త అధ్యాయం జీఎస్టీ. తొమ్మిదేండ్ల క్రితం జీడీపీలో మన దేశం11వ స్థానంలో ఉండగా, మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేగంగా ఆర్థిక వృద్ధి చెందుతూ ప్రస్తుతం ఐదో స్థానానికి చేరింది.


 హిందువుల దశాబ్దాల కల అయోధ్యలో రామమందిర నిర్మాణం. 2014 లోక్‌‌సభ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోలోనే దీన్ని ప్రకటించారు. మందిర అంశం సుప్రీంకోర్టులో ఉన్న విషయమైనప్పటికీ మోడీ హయాంలోనే అనుకూల తీర్పురావడం తన ప్రభ మరింత పెంచింది. మందిర నిర్మాణం సైతం మోడీ చేతుల మీదుగానే శంకుస్థాపన కావడం విశేషం. మేకిన్‌‌ ఇండియా–డిజిటల్‌‌ ఇండియా.. నినాదాన్ని అమలులోకి తెచ్చారు. గుండుసూది నుంచి యుద్ధవిమానం వరకు దిగుమతులపై ఆధారపడుతున్న దేశంలో వస్తు ఉత్పత్తిని ప్రోత్సహించారు. డిజిటల్‌‌ ఇండియా ఆర్థిక రంగానికి భరోసా ఇస్తోంది. ‘ఉజ్వల’ పథకాన్ని ప్రారంభించి మహిళల వంట కష్టాలను తప్పించారు. అన్నదాతల కోసం ‘పీఎం కిసాన్‌‌ సమ్మాన్‌‌ నిధి’ ద్వారా ఏడాదికి రూ.6,000 చొప్పున మోడీ సర్కారు అందిస్తోంది. పంట నష్ట పరిహారం కోసం ‘ఫసల్‌‌బీమా యోజన’ తీసుకువచ్చింది.

అన్నిరంగాల్లో అభివృద్ధి

74 ఎయిర్‌‌ పోర్టులను నిర్మించి, చౌక ధరకే సామాన్యులు కూడా విమాన ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించారు ప్రధాని మోడీ. తొమ్మిదేండ్లలో 53 వేల కి.మీలకు పైగా రోడ్లను విస్తరించారు. ప్రపంచస్థాయికి అనుగుణంగా 20 వందే భారత్‌‌ రైళ్లను, 15 మెట్రోరైళ్లను ప్రవేశపెట్టారు. రైల్వేస్టేషన్‌‌లను అంతర్జాతీయ స్థాయిలో ఆధునీకరిస్తున్నారు. అందులో మన సికింద్రాబాద్‌‌ రైల్వేస్టేషన్‌‌ కూడా ఉంది. కొత్తగా కరీంనగర్‌‌ టు వరంగల్, మహబూబ్‌‌నగర్‌‌ టు విశాఖపట్నం రైల్వేలైన్‌‌ మంజూరయ్యాయి. గతంలో ఏడు ఎయిమ్స్‌‌ ఉంటే.. మోడీ హయాంలో 15 ఎయిమ్స్‌‌ కొత్తగా వచ్చాయి. అందులో తెలంగాణలో ఒకటుంది. ‘పీఎం ఆవాస్‌‌ యోజన’ కింద 3.5 కోట్ల మందికి ఇండ్లను నిర్మించారు. 

జల్‌‌ జీవన్‌‌ మిషన్‌‌ కింద 12 కోట్ల ఇండ్లకు నల్లాల ద్వారా శుద్ధ మంచినీరు అందించారు. ప్రధాన మంత్రి గరీబ్‌‌ కళ్యాణ్‌‌ అన్నయోజన’ కింద కొవిడ్‌‌ సమయంలో 80 కోట్ల మందికి ప్రతినెలా ఉచితంగా రేషన్‌‌ అందించారు. గతంలో ప్రభుత్వం రూపాయి ఇస్తే లబ్ధిదారుడి వద్దకు వచ్చేసరికి 15 పైసలే అందేవి. మోడీ హయాంలో జన్‌‌ధన్‌‌ ఖాతాల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో సంక్షేమ పథకాల నగదు జమ అవుతోంది. ప్రపంచంలోనే పెద్దదైన ఆయుష్మాన్‌‌ భారత్‌‌ పథకాన్ని ప్రవేశపెట్టి రూ.5 లక్షల వరకు ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. రూ.6,338 కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించి, రైతులకు కొరత లేకుండా ఎరువులు అందిస్తున్నారు.

కుటుంబ పార్టీలకు చెంపపెట్టులా..
.
అవినీతి, అక్రమాలకు కాంగ్రెస్, బీఆర్‌‌ఎస్‌‌ వంటి కుటుంబ పార్టీలే కారణం. ప్రజా సమస్యలను పక్కన పెడుతూ వ్యక్తిగత సంపదపైనే దృష్టిపెడుతున్నాయి. సబ్బండవర్గాల పోరుతో, అమరవీరుల త్యాగాలతో వచ్చిన తెలంగాణను కేసీఆర్‌‌ కుటుంబం చెరబట్టింది. ఒక్క ఇంటి నుంచే తండ్రి, కొడుకు, బిడ్డ, ఇద్దరు అల్లుళ్లు అధికారాన్ని చేతబట్టారు. పథకాల పేరిట ప్రజలకు చారాణ ఇస్తూ.. బారాణ జేబులో వేసుకుంటున్నారు. ప్రతీ పనిలో కమీషన్లు, ప్రతీ దందాలో వాటాలు, ఆఖరికి నిరుద్యోగ యువత జీవితాలతోనూ ఆడుకునేలా టీఎస్‌‌పీఎస్‌‌సీ పేపర్‌‌ లీకేజీలు చేస్తున్నారు. 

ఇలాంటి కుటుంబ పార్టీల కథలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాల్సిన అవసరముంది. వచ్చే ఎన్నికల్లో వారికి చెంపపెట్టులా ప్రజలు తీర్పు ఇవ్వాల్సిన అవసరమూ ఉంది. కేంద్రప్రభుత్వ పథకాలను, మోడీ పాలనదక్షతను ఇంటింటికీ, ప్రతి ఒక్కరికీ తెలియజేసేందుకే బీజేపీ ‘మహాజన్‌‌ సంపర్క్‌‌ అభియాన్‌‌’ చేపట్టింది. ఇది మే30 నుంచి జూన్‌‌ 30 వరకు కొనసాగుతుంది. తొమ్మిదేళ్లుగా మోడీ ప్రభుత్వం ‘సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం’ అనే అంశాలే ఎజెండాగా సాధించిన విజయాలను దేశప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

-  బండి సంజయ్, ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,  తెలంగాణ