ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం

జమ్మూ కాశ్మీర్​లోని పహల్గాంలో టూరిస్టులను కాల్చి చంపిన టెర్రరిస్టులను కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్యాంక్​ ఎంప్లాయ్స్​ ఫెడరేషన్ కోరింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో దేశానికి అండగా నిలుస్తామని చెప్పింది. కోఠి బ్యాంకు స్ట్రీట్​లో శుక్రవారం ఫెడరేషన్ ఆధ్వర్యంలో  నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఫెడరేషన్ ​ప్రధాన కార్యదర్శి బి.ఎస్.రాంబాబు, వందల మంది బ్యాంకు ఉద్యోగులు క్యాండిల్స్​తో పహల్గాం మృతులకు నివాళులర్పించారు.

 ఉగ్రదాడిని నిరసిస్తూ రిసాల ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు వ్యాపారస్తులు ఉస్మాన్ గంజ్ నుంచి సిద్దంబర్ బజార్ మీదుగా ఎంజే మార్కెట్ ​వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. మజ్జిద్​ కమిటీ ఆధ్వర్యంలో పరిగి టౌన్​లో ముస్లింలు, బీఆర్ఎస్​ నాయకులు నిరసన ర్యాలీ తీశారు. ఉగ్రవాదులు భారతదేశంలో మతాల మధ్య చిచ్చు రేపడమే లక్ష్యంగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని మండిపడ్డారు. 

వికారాబాద్​లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుంచి ఎన్టీఆర్ ​చౌరస్తా వరకు డాక్టర్లు, మెడికల్ కాలేజీ స్టూడెంట్లు క్యాండిల్స్​ ​ర్యాలీ నిర్వహించారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో నెక్లెస్​ రోడ్ ​పీపుల్స్ ​ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు నిర్వహించిన క్యాండిల్స్​ర్యాలీలో ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం, జీహెచ్ఎంసీ మేయర్​ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ ​శ్రీలతారెడ్డి, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.