అవినీతి రహిత సమాజ నిర్మాణ ఉద్యమంలో భాగంగా అవినీతి నిరోధక చట్రం బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. దేశంలో అత్యున్నత నైతికత పర్యవేక్షణ సంస్థగా ఏర్పాటైన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) ఎంతో ముందడుగు వేసింది. కాలక్రమేణా అవినీతి చర్యలకు పాల్పడితే జరిమానా విధింపు/బహిరంగ మందలింపు నుంచి అవినీతి నిరోధక చర్యలను వ్యవస్థీకృతం చేయడంలో గణనీయ మార్పు ప్రస్ఫుటమైంది. ఈ మేరకు పాలన విధానాల ఆధునికీకరణ, సమాచార సాంకేతికత వినియోగం, ప్రక్రియల పునర్నిర్మాణం, తనిఖీ/సమతూకం వగైరాలపై నిశితంగా దృష్టి సారించడం సాధ్యమైంది. అవినీతి నిరోధంపై సందేశాన్ని అంతర్గతీకరించడం సహా అమలు చేయడంలో సమష్టి సంకల్పంతో కూడిన పౌర భాగస్వామ్యం అవసరం. తదనుగుణంగా అవినీతి సంపూర్ణ నిర్మూలన ప్రధాన లక్ష్యంగా ఉండాలి.
అవగాహన కార్యక్రమాలు
అవినీతిపై యుద్ధంలో భాగస్వామ్య సంస్థలన్నిటినీ ఏకతాటిపైకి తేవడంతోపాటు పారదర్శకత, ప్రభుత్వ పాలనలో నిజాయతీకి బలం చేకూర్చేందుకు సెంట్రల్ విజిలెన్స్‌కమిషన్ ప్రజల భాగస్వామ్యాన్ని ఒక ఉపకరణంగా వినియోగిస్తున్నది. ఈ దిశగా ఈ ఏడాది అక్టోబరు 30 నుంచి నవంబరు 5 వరకూ
విజిలెన్స్ అవేర్నెస్ వారోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది. దీన్ని లక్ష్యానికి చేరువయ్యే ఓ కీలక చర్యగా పరిగణించవచ్చు. ఈ క్రమంలో కొన్నేళ్లుగా నిఘా అవగాహన వారోత్సవాలకు ప్రభుత్వ- ప్రభుత్వేతర భాగస్వాముల నుంచి ఉత్సాహపూరిత భాగస్వామ్యం, మద్దతు సమాన స్థాయిలో లభించాయి. తదనుగుణంగా అన్ని రంగాల్లో నిజాయితీకి గల ప్రాధాన్యాన్ని విస్తరింపజేసేలా సదస్సులు, అవగాహన కార్యక్రమాలు, గ్రామసభలు నిర్వహించేలా ఆయా సంస్థలను ‘సీవీసీ’ ప్రోత్సహించింది. ఇందులో భాగంగా ఇప్పటివరకూ1.60 కోట్ల మందికిపైగా పౌరులతో పాటు 2,50,000కు పైగా సంస్థలు ఈ -ఇంటిగ్రిటీ ప్రతిజ్ఞ స్వీకరించాయి. ఈ కార్యక్రమాలన్నీ అవినీతిపై ఐక్యరాజ్య సమితి తీర్మానం నిబంధన13 స్ఫూర్తికి అనుగుణంగా ఉండటం గమనార్హం. అవినీతి జాఢ్యం తీవ్రత, ముప్పుపై ప్రజల్లో అవగాహన పెంచే దిశగా సమాజ భాగస్వామ్యం సహా పౌర సమాజం, ప్రభుత్వేతర సంస్థల క్రియాశీల భాగస్వామ్యం అవసరం” అని యూఎన్ నిబంధన స్పష్టం చేస్తోంది.
వ్యవస్థాగత మార్పులు
ఈ ఏడాది అక్టోబర్30 నుంచి నవంబర్5 వరకు జరగబోయే నిఘా అవగాహన వారోత్సవాలకు ముందుగా మూడు నెలలపాటు ప్రచార కార్యక్రమం ప్రారంభించాలని సీవీసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆరు రకాల అవినీతి నిరోధక నిఘా చర్యలపై దృష్టి సారించింది. అవినీతి వ్యతిరేక ఉద్యమకారుల ఫిర్యాదులపై అవగాహన పెంపు, సామర్థ్య నిర్మాణం, వ్యవస్థాగత మెరుగుదల, ఫిర్యాదుల పరిష్కారానికి సమాచార సాంకేతిక వినియోగం, సర్క్యులర్లు/మార్గదర్శకాల నవీకరణ, పెండింగ్ ఫిర్యాదుల పరిష్కారం వంటివి ఈ చర్యల్లో భాగంగా ఉన్నాయి. అవినీతి నిరోధక కార్యక్రమాల్లో విధానాల నవీకరణ, వ్యవస్థాగత మార్పులపై ప్రధానంగా దృష్టిసారించాం. ప్రభుత్వ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేవిధంగా పాలనలో వినూత్న మార్పులు తీసుకురావడమే వీటి అంతిమ లక్ష్యం. 2022లో సెంట్రల్బోర్డ్ఆఫ్సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) సహకారంతో సెంట్రల్ విజిలెన్స్‌కమిషన్(సీవీసీ) వ్యాసరచన పోటీలు నిర్వహించింది. దేశవ్యాప్తంగా 10 వేలకుపైగా పాఠశాలల్లోని 7.6 లక్షల మంది విద్యార్థులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
అందుబాటులో ఫిర్యాదుల పోర్టల్
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత సంవత్సరం సెంట్రల్ విజిలెన్స్‌కమిషన్ ఫిర్యాదుల నిర్వహణ పోర్టల్‌ను ప్రారంభించారు. అవినీతిపై జరుగుతున్న యుద్ధంలో పౌరుల ప్రమేయం పెంచడంలో ఇదొక కీలక ప్రయత్నంగా భావించాలి. కేంద్ర ప్రభుత్వ అధికారులెవరైనా తప్పు చేయడం గమనిస్తే పౌరులు ఈ పోర్టల్ ద్వారా నేరుగా ‘సీవీసీ’కి ఫిర్యాదు చేయవచ్చు. ఈ ఫిర్యాదు చేసే వ్యక్తి ఏ కారణం చేతనైనా తమ గుర్తింపును బహిర్గతం చేయరాదని భావిస్తే, నేరుగా సీవీసీ’లో అవినీతి ఉద్యమకారుడిగా ఫిర్యాదు దాఖలు చేయవచ్చు. ఈ విధంగా ఈ అత్యున్నత సంస్థ తనకుతాను ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. మన దేశంలో అవినీతి వ్యతిరేక ఉద్యమానికి ప్రజా ప్రయోజన సమాచార ప్రదాతలకు రక్షణ(పీఐడీపీఐ) నిబంధన ద్వారా చట్టపరంగా రక్షణ లభిస్తుంది. తద్వారా ఫిర్యాదుదారు గుర్తింపు గోప్యంగా ఉంచబడుతుంది. అలాగే వారికి రక్షణ అవసరమనిపిస్తే ‘సీవీసీ’ అందుకు తగిన చర్యలు తీసుకుంటుంది. ఆ మేరకు పౌరులు తమవద్ద గల సమాచారంతో సంస్థ ముందుకు రావడాన్ని ప్రోత్సహిస్తుంది. అదే సమయంలో అనామక లేదా ఆకాశరామన్న లాంటి ఆధారాలు లేని ఫిర్యాదులకూ అడ్డుకట్ట వేస్తుంది.
ప్రజల భాగస్వామ్యంతో..
అవినీతిని నిర్దాక్షిణ్యంగా తిరస్కరించే సంస్కృతిని పెంచేందుకు, అవినీతిని కూకటివేళ్లతో పెకిలించేందుకు సీవీసీ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నది. అంతిమంగా కేంద్ర నిఘా సంస్థ, ఇతర ప్రభుత్వ సంస్థలు అవినీతిని నిరోధించడానికి, నిర్మూలనకు చురుగ్గా పోరాడుతున్నా, క్షేత్రస్థాయిలో ప్రజల స్పందన, భాగస్వామ్యంతోనే దాని విజయం ఆధారపడి ఉంటుంది. ప్రజలే పాలనలో నిజాయితీని ప్రభావితం చేయగలరు. అవినీతి రహిత సమాజం దిశగా సుస్థిర, వాస్తవిక మార్పును తేవాలంటే పౌరుల నిరంతర మద్దతుతోపాటు తగిన సాధికారత కల్పించాలి. అవినీతి రహిత సమాజాన్ని బలోపేతం చేసేందుకు పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం.
- పి. డేనియల్, సెక్రటరీ, ఊర్మిళా జాస్మిన్, డిప్యూటీ సెక్రటరీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్