‘తిరుగుబాటు ఒక విప్లవం కాదు. అది చివరికి ముగింపునకు దారి తీయవచ్చు’ అని నిరంతరం నిప్పు కణికై రగిలి, భరతమాత దాస్య శృంఖలాలను ఛేదించటానికై పరితపించిన విప్లవ వీర కిశోరం షహీద్ భగత్ సింగ్ మాటలు అక్షర సత్యాలు. ఆధునిక కాలంలో అనేక తిరుగుబాట్లు ఏదో రకంగా చివరికి ముగింపునకు దారితీస్తున్నాయనేది కాదనలేని సత్యం. ఆ తిరుగుబాట్లు, పోరాటాలు, ఉద్యమాలు సమాజానికి ఏదో ఓ ఫలితాన్ని అందించి కనుమరుగవడం గమనార్హం. అందుకే సమాజ మనుగడకు పోరాటాలే శరణ్యం. పోరాడితే పోయేదేమీ లేదు. మరి అలాంటి పోరాట పటిమను ఉగ్గుపాలతోనే అలవరుచుకున్న భారత దేశ మొదటి మార్క్సిస్టు విప్లవకారుడు, స్వాతంత్య్రసమరేతిహాసంలో అరుణ పుటలను తెరిచిన ధీరుడు, చిన్న వయసులోనే ఉరికంబాన్ని ముద్దాడిన మహనీయుడు భగత్ సింగ్.
నేడు ఆయన స్ఫూర్తి, ఆలోచనలు, ఆశయాలు, ఆవేశం ఎంతమంది యువతలో మిగిలాయనేది ప్రశ్న. భగత్ సింగ్ బ్రిటీష్ ఇండియా పంజాబ్ రాష్ట్రం, లాయాల్ పూర్ జిల్లా, బంగా పట్టణ సమీప గ్రామమైన ఖత్కల్ కాలాన్ లో సర్దార్ కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు1907 సెప్టెంబర్ 28న జన్మించారు. స్వాతంత్ర్యోద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న కుటుంబ నేపథ్యం కావడంతో చిన్న వయసు నుంచి దేశభక్తి ఆయన నరనరాన జీర్ణించుకుపోయింది. తాత అర్జున్ సింగ్ దయానంద సరస్వతికి అనుచరులు. పినతండ్రులు అజిత్ సింగ్, స్వరణ్ సింగ్ గదర్ పార్టీ సభ్యులు. వీరి సంస్కరణ వాదాన్ని, పోరాట పటిమను దగ్గర నుంచి పరిశీలిస్తూ భగత్ సింగ్ పెరిగారు.
హిందూస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్
1923లో పంజాబ్ హిందీ సాహిత్య సమ్మేళన్ సంస్థ నిర్వహించిన వ్యాసరచన పోటీలో భగత్ విజయం సాధించి, ప్రొఫెసర్ భీమ్ సేన్ విద్యాలంకార్ దృష్టిని ఆకర్షించాడు. సింగ్ లాహోర్ నేషనల్ కాలేజీలో విద్యనభ్యసిస్తున్నప్పుడు, ఇంట్లో వాళ్లు పెళ్లి చేయాలని చూడటంతో ఇల్లు విడిచి పారిపోయి ‘నౌజవాన్ భారత్’ సభలో సభ్యుడిగా చేరాడు. ఆ సమయంలో ప్రపంచ విప్లవ ఉద్యమాలను గురించి విస్తృత అవగాహన ఏర్పరుచుకున్నాడు. రాజనీతి, అర్థశాస్త్రం, సామాజిక శాస్త్ర విషయాలకు సంబంధించిన అనేక గ్రంథాలను అధ్యయనం చేశారు. మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, బకునిన్, ట్రాటస్కి రచనలతో పాటు, ఐరోపా విప్లవ ఉద్యమాలు, ఫలితాలు ఆయనపై విశేష ప్రభావం చూపాయి. దాంతో భగత్ సింగ్ సామ్యవాదం, కమ్యూనిజం వైపు ఆకర్షితులయ్యారు. ప్రొ. విద్యాలంకార్ ప్రోత్సాహంతో అప్పటికే రామ్‌ప్రసాద్ బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్ నాయకత్వం వహిస్తున్న హిందూస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ లో సభ్యులుగా చేరారు.
అనతికాలంలోనే ప్రముఖ నాయకుడిగా ఎదిగారు. 1926లో అరెస్టు అయి ఐదు నెలల జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యారు.1928లో దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది విప్లవకారులను ఒకే వేదికపై తీసుకురావడానికై నౌజవాన్ భారత్ సభ, కీర్తి కిసాన్ పార్టీల పేరుతో ఢిల్లీలో ఒక సమావేశాన్ని జరుపతలపెట్టారు. దానికి భగత్ సింగ్ కార్యదర్శిగా వ్యవహరించారు. ఈ సభలో ప్రజా విప్లవ చర్యలే వలసదాస్యం నుంచి విముక్తి కలిగిస్తుందని విప్లవకారులు విశ్వసించారు. ‘ప్రజా విప్లవం ప్రజల కోసం’ అనే నినాదాన్ని కూడా ప్రతిపాదించారు. అనంతర కాలంలో సంఘానికి భగత్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికై పలు విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టాడు. ఆజాద్ చంద్రశేఖర్, సుఖ్ దేవ్ ల ప్రభావంతో సంస్థ పేరును హిందూస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ గా మార్చాడు. దీని ఆధ్వర్యంలో దేశమంతా విప్లవ కార్యకలాపాలు రహస్యంగా విస్తరించసాగాయి.
తిరుగుబాటు చేస్తేనే..
అయితే బ్రిటీష్ ప్రభుత్వం ఇదే సందర్భంలో భగత్ సింగ్ లాంటి విప్లవకారుడిని వదిలిపెట్టడం ఇష్టం లేక సాండర్స్ హత్య కేసును కూడా విచారించడం మొదలుపెట్టింది. భగత్ సింగ్ జైలులో ఖైదీగా ఉంటూనే భారత, బ్రిటన్ రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇతర రాజకీయ ఖైదీలతో కలిసి116 రోజుల నిరాహారదీక్ష చేశాడు. భగత్ సింగ్ డిమాండ్లకు చివరకు ప్రభుత్వం తలొగ్గింది.‘బాంబులు, తుపాకులు విప్లవం చేయలేవు. విప్లవం అనే కత్తికి మీ ఆలోచనలతో పదును పెట్టండి’ అంటూ చెప్పిన మాటలను ఈ సందర్భంగా ఆయనే నిజం చేసి చూపించారు. బ్రిటీష్ ప్రభుత్వం రెండేండ్ల విచారణ తర్వాత భగత్ సింగ్‌తోపాటు, సుఖ్ దేవ్, రాజ్ గురులను దోషులుగా ప్రకటించి ఉరి శిక్ష ఖరారు చేసింది. దీంతో దేశ వ్యాప్తంగా వారి ఉరిని వ్యతిరేకిస్తూ ఆందోళనలు, ఉద్యమాలు మొదలయ్యాయి.
దీనికి భయపడిన బ్రిటీష్ ప్రభుత్వం అత్యంత గోప్యంగా 1931, మార్చి 23న రాత్రి 7.30 గంటలకి భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురులను హుస్సైన్‌వాలా జైలులో ఉరి తీశారు. ఉరి తీసే నాటికి ఆయన వయసు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే. మనకు వారు ఇచ్చిపోయిన ఇంక్విలాబ్ జిందాబాద్ నినాద స్ఫూర్తిని, తిరుగుబాటును యువత పూర్తిగా మరిచిపోయింది. ఇవాళ దేశం, రాష్ట్రంలోని అనేక సమస్యలు ప్రజల జీవితాలకు గుదిబండలుగా మారి అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయ అక్రమాలు, అధికార దాహం, బంధుప్రీతి, ఉద్యోగుల లంచగొండితనం, అవినీతి వంటివి ఒకవైపు, ఆకలి, పేదరికం, నిరుద్యోగం లాంటివి మరోవైపు నిలిచి అభివృద్ధి నిరోధకాలుగా మారాయి. ఇలాంటి వాటి మీద యువత భగత్ సింగ్ స్ఫూర్తితో తెగించి ప్రజా ఉద్యమాలను నిర్మాణం చేసి తిరుగుబాటు చేస్తే తప్ప, వాటికి ముగింపు రాదు.
ఇంక్విలాబ్ జిందాబాద్
1928 అక్టోబర్ 30న సైమన్ కమిషన్ పర్యటనకు వ్యతిరేకంగా లాహోర్ లో పంజాబ్ కేసరి లాలా లజపత్ రాయ్ నాయకత్వంలో శాంతియుత నిరసన కార్యక్రమం జరిగింది. ఇక్కడ పోలీసులు లాఠీచార్జి చేశారు. లాలా లజపతి రాయ్ తీవ్రంగా గాయపడ్డారు, కొద్ది రోజులకు మరణించారు. ఈ సంఘటనతో భగత్ సింగ్ రగిలిపోయారు. దీనికి కారణమైన అధికారి స్కాట్‌ను హతమార్చడానికి సహచర విప్లవకారులైన శివరామ్ రాజ్‌గురు, జై గోపాల్, సుఖ్‌దేవ్ థాపర్‌లతో కలిసి ప్రణాళిక రచించారు. అయితే అనుకోకుండా స్కాట్‌కు బదులుగా సాండర్స్ కాల్చి చంపారు. తరువాత వీరందరూ పోలీసుల కంటపడకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా భద్రత సవరణ చట్టం అమలు చేయడానికి ప్రత్యేక ఆర్డినెన్సు జారీ చేస్తున్నట్టు 1929 ఏప్రిల్8న ప్రకటించింది.
దీన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర శాసనసభపై బాంబు వేయడానికి హిందూస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ వ్యూహరచన చేసింది. శాసనసభలో భగత్ సింగ్, బట్టుకేశ్వర దత్తులు బాంబు విసిరారు. అలాగే ఎర్ర కరపత్రం అన్న పేరుతో ప్రచురించిన కాపీలను వెదజల్లారు. ‘‘వందేమాతరం, ఇంక్విలాబ్ జిందాబాద్’’ అంటూ నినాదాలు చేస్తూ తమ ఉద్దేశపూర్వకంగా అక్కడే ఉండిపోయారు. చివరకు పోలీసులకు లొంగిపోయారు. ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టును వేదికగా చేసుకుని బహిరంగంగా తమ ఆదర్శాలను, మార్గాన్ని, ఎంచుకున్న లక్ష్యాలను ప్రపంచానికి చాటాలనుకున్నారు. ఇలా చేసి యువత దృష్టిని తమ ఉద్యమాల వైపు మళ్లేలా కూడా చేశారు. చివరకు ఈ కేసు విచారణ అనంతరం12 జూన్ 1929న సింగ్, దత్‌లకు ‘జీవితకాల దేశ బహిష్కరణ’ను విధించారు.
- డా. సందెవేని తిరుపతి, చరిత్ర పరిరక్షణ సమితి