
ఈ భూమి మీద జన్మించే ప్రతి ప్రాణి ఏదో ఒకరోజు చనిపోవాల్సిందే. ఒక్కో జీవికి ఒక్కో ఆయుష్షు రేఖ ఉన్నప్పటికీ.. ఏ జీవి ఎప్పుడు చనిపోతుందో తెలియదు. మనిషి జీవితం కూడా మరణానికి అతీతమేమి కాదు. ప్రస్తుతం మనిషి సగటు జీవితకాలం 70 నుంచి 80 సంవత్సరాలని అనుకుంటున్నా.. అందులో అనారోగ్యాలు, రోడ్డు ప్రమాదాలు, అంతుచిక్కని వ్యాధులతో ఎంతోమంది తమ ఆయుష్షుకు అనుగుణంగా సంపూర్ణ జీవితాన్ని అనుభవించలేకపోతున్నారు. ముఖ్యంగా కొన్ని అరుదైన వ్యాధులు సోకినప్పుడు వాటికి సరైన మందులు లేకపోవడం, ఒకవేళ ఉన్నా వాటికి లక్షలు, కోట్లలో ధర చెల్లించాల్సి రావడం ఆందోళన కలిగిస్తోంది.
ఇక పిల్లల విషయంలో ఇలాంటి ఘటనలు ఎదురైతే తల్లిదండ్రులు సైతం అల్లాడిపోతున్నారు. కొంతమంది తల్లులు ఆ వేదన భరించలేక పిల్లలను చంపుకుంటూ వారూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అయితే, ప్రస్తుత ఆధునిక సాంకేతికరంగంలో ఎన్నో అరుదైన వ్యాధులకు సైంటిస్టులు మందులు కనిపెడుతున్నారు. రోజురోజుకు పుట్టుకొస్తున్న కొత్తరకం వ్యాధులకు కూడా రెమిడీని కనుగొంటున్నారు.
కానీ, ఈ విషయాలపై బాధితులకు పూర్తిస్థాయిలో అవగాహన ఉండడం లేదనేది తెలుస్తోంది. దీంతో కొన్ని క్లిష్టమైన వ్యాధులు సంభవించగానే.. వాటికి పెద్ద మొత్తంలో ఖర్చవుతుందనే భావనతో బాధితులు మానసికంగా కుంగిపోయి.. ఇక మా జీవితాలు ఇంతే అంటూ కుమిలిపోతున్నారు. ఈ విషయంలో బాధితులకు అవగాహన కల్పించి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వాలతో పాటు ప్రతి ఒక్కరిపై ఉంది. ఈ రోజుల్లో ఎన్నో వ్యాధులకు మందులున్నాయనే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి మన ఇంటి పక్కనో.. మన పక్క ఊరిలోనో ఒకరు ఓ వింత వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిసినవెంటనే మానవతా దృక్పథంతో స్పందిస్తే.. అది పాలకుల వరకు లేదా డాక్టర్లు, స్వచ్ఛంద సంస్థల వద్దకు చేరి బాధితులకు ఎంతో కొంతైనా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. బాధితులు సైతం ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. ముఖ్యంగా తల్లులు.. పిల్లల విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా చివరి వరకూ పోరాడాలే తప్ప అర్ధాంతరంగా జీవితాలను ముగించుకోకూడదు.
బాధితులకు సోషల్ మీడియా అండగా నిలవాలి
ఈ రోజుల్లో సోషల్ మీడియా చాలా పవర్‌ఫుల్‌గా మారింది. దురదృష్టవశాత్తు అది చాలావరకు మిస్ యూజ్ అవుతోంది. మంచి కంటే చెడు ఎక్కువగా వైరల్ అవుతోంది. కానీ, వాస్తవానికి వైరల్ చేయాల్సిన అంశాలు ఇలాంటివి. ఆపదలో ఉన్నామంటే ఆదుకునేవాళ్లు సమాజంలో చాలామందే ఉన్నారు. కానీ, బాధితుల సమస్య వారి వరకు చేరడమే సమస్య. ప్రస్తుతం అది సోషల్ మీడియాతోనే సాధ్యం. కాబట్టి స్మార్ట్ ఫోన్ యూజర్లు అనవసర విషయాలు పది షేర్ చేసినా.. ఒక్కటైనా ఇలాంటి పనికొచ్చే విషయం ఆపద్బాంధవులకు చేరేవరకు షేర్ చేస్తే ఓ ప్రాణం నిలబడుతుంది. మన దేశంలో దాదాపు 100 కోట్ల స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఉన్నారని ఓ అంచనా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 4 నుంచి 5 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్ వాడుతున్నట్టు లెక్కలు చెప్తున్నాయి. అందులో సగం మంది ఒక్కరు ఒక్క రూపాయి ఇచ్చినా కోట్లలో జమ అవుతాయి. ఇక్కడ చేయాల్సిందల్లా సమస్యను వారి వరకు తీసుకెళ్లడమే అని గుర్తించాలి.
స్పెషల్ కేసులకు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలి..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఇలాంటి అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. కేవలం ఆస్పత్రుల్లో నయమయ్యే వాటికే చికిత్స చేస్తాం అంటే సరిపోదు. ఇలాంటి స్పెషల్ కేసులకు కూడా కావాల్సిన సాయం చేయాలి. కళ్లముందు ఓ ప్రాణం పోతుంటే కేవలం దాతలే సహకరించాలని వదిలేయడం కరెక్ట్ కాదు. ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఎన్ని కోట్లయినా భరించాల్సిందే. ఈ రోజుల్లో ఒక ప్రాణం కోసం ప్రభుత్వం 10 నుంచి 20 కోట్లు ఖర్చు చేయడం పెద్ద విషయేమే కాదు. అంతేకాకుండా.. ఇలాంటి స్పెషల్ కేసుల పరిష్కారం కోసం ఓ ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలి.
అందులో నిష్ణాతులైన డాక్టర్ల టీంను పెట్టి ఆ కేసు పరిష్కారం కోసం ఎంత ఖర్చయినా చివరివరకు ప్రయత్నించాలి. ఎన్నో కొత్త పథకాలకు రూపకల్పన చేస్తున్న ప్రభుత్వాలు ఇలాంటి అంశంలోనూ ఓ పథకాన్ని ప్రవేశపెట్టాలి. అప్పుడే పాలకులకు తాము చేపట్టిన పదవికి ఓ అర్థం పరమార్థం ఉంటాయి. లేదంటే ప్రజాసేవే నా లక్ష్యం అనే వ్యాఖ్యలు ఊకదంపుడు ఉపన్యాసాలుగా మిగిలిపోతాయి. ఓ సినిమాలో చెప్పినట్టు ‘వందమందిని చంపితే వీరుడంటారు.. ఒక్కరిని కాపాడినా దేవుడంటారు’ అన్నట్టుగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఇలా సామాన్యుల వరకు ఒక ప్రాణాన్ని నిలబెట్టేందుకు ఎంతోకొంత సాయం చేసి బాధితుల పట్ల దేవుళ్లుగా మిగిలిపోవాలి. ఆ సాయం వారికి తిరిగి ఏదో ఒకరూపంలో తప్పకుండా తిరిగి వస్తుంది. ప్రైవేటు ఆస్పత్రులు సైతం అలాంటి వ్యాధిని నయం చేసే టెక్నాలజీ వారి వద్ద ఉంటే.. లాభాపేక్షకు పోకుండా మానవతా దృక్పథంతో ముందుకొచ్చి వారు చేయగలిగినంత సాయం చేయాలి.
15 నెలల బాలుడికి రూ.17 కోట్ల ఇంజెక్షన్
ఉత్తరప్రదేశ్‌లో 15 నెలల బాలుడి ఎస్ఎంఏ-టైప్1 అనే అరుదైన వ్యాధి బారినపడ్డాడు. ఆ బాలుడు బతకాలంటే 17 కోట్ల రూపాయల విలువ చేసే ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పారు. రెక్కాడితేగానీ డొక్కాడని ఆ బాలుడి కుటుంబానికి రూ.17 కోట్లంటే మామూలు విషయం కాదు. కానీ, చిన్నారికి సాయం చేసేందుకు ఓ బడా ఫార్మా కంపెనీ, కేంద్ర ప్రభుత్వం, ఎంతోమంది దాతలు సైతం ముందుకొచ్చారు. 'సేవ్ భూదేవ్' పేరుతో పెద్ద క్యాంపెయిన్‌ను నడిపించారు. కేంద్ర ప్రభుత్వం ఆ ఇంజెక్షన్‌ను దిగుమతి సుంకం నుంచి మినహాయించింది. ప్రభుత్వ నిర్ణయంతో రూ.17 కోట్లుగా ఉండే ఇంజెక్షన్ ధర రూ.10 కోట్లకు దిగివచ్చింది. దాతల సాయంతో దిగుమతి చేసుకున్న ఈ ఇంజెక్షన్‌ను ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఆ బాలుడికి ఇచ్చి అతని ప్రాణాలు కాపాడారు. ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి.
- గొడిషాల
రమేష్ బాబు,
సీనియర్ జర్నలిస్ట్