
ఐఐటీల్లో ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ + పీహెచ్‌డీల్లో అడ్మిషన్స్‌కు నిర్వహించే పరీక్ష గేట్. దీంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో(పీఎస్‌యూ), ఎంట్రీ లెవల్‌లో ఇంజనీర్ ఉద్యోగాలకు సైతం గేట్ స్కోరే ప్రామాణికం. అందుకే ఏటా దేశవ్యాప్తంగా లక్షల మంది ఈ పరీక్షకు హాజరవు తున్నారు. ఇటీవల గేట్-2024 నోటిఫికేషన్ విడుదలైంది. . ఈ పరీక్ష ఫిబ్రవరి 3 నుంచి జరగనుంది. ఈ నేపథ్యంలో ఎగ్జామ్ ప్యాటర్న్, కొత్త మార్పులు, పరీక్షలో విజయం ఎలా సాధించాలో తెలుసుకుందాం..
గేట్ పరీక్షలో ప్రతి ఏటా ఏదో ఒక మార్పు కనిపిస్తోంది. ఈ ఏడాది కొత్తగా డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేపర్‌ను ప్రవేశ పెట్టారు. దీంతో.. గేట్ పేపర్ల సంఖ్య 30కి చేరింది. కొన్ని ఐఐటీలు ఎంటెక్ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ప్రోగ్రామ్‌లను అందిస్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకొని, ఈ పేపర్‌ను ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది.
రెండు పేపర్లకు చాన్స్ : గేట్–2024 నుంచి రెండు పేపర్లకు హాజరయ్యే అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు అభ్యర్థులు తమ అర్హతకు అనుగుణంగా ఏదైనా ఒక పేపర్‌కు మాత్రమే హాజరయ్యే పరిస్థితి ఉండేది. తాజా మార్పుతో ఇకపై తమ అర్హతలకు సరితూగే రెండు పేపర్లలో పరీక్షకు హాజరు కావచ్చు. గేట్ నిర్వాహక కమిటీ నిర్దేశించిన నిబంధనలను అనుసరిస్తూ.. నిర్దిష్ట కాంబినేషన్స్‌లోనే పేపర్లను ఎంచుకోవాల్సి ఉంటుంది.
పరీక్షలో మార్పుల్లేవ్ : ఈ ఏడాది గేట్ పరీక్ష విధానంలో ఎలాంటి మార్పులు లేదు. పరీక్ష ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. గేట్ పరీక్ష పార్ట్–1, పార్ట్–2 పేరుతో రెండు విభాగాల్లో వంద మార్కులకు ఉంటుంది. మొత్తం 65 ప్రశ్నలు అడుగుతారు. పార్ట్–1లో జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి 10 ప్రశ్నలు ఉంటాయి. ఈ విభాగానికి 15 మార్కులు కేటాయిస్తారు. ఒక మార్కు ప్రశ్నలు అయిదు, రెండు మార్కుల ప్రశ్నలు అయిదు ఉంటాయి. పార్ట్–2లో అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్ట్‌లో 55 ప్రశ్నలు అడుగుతారు. ఇందులోనే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ నుంచి కూడా 13 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఒక మార్కు ప్రశ్నలు 25, రెండు మార్కుల ప్రశ్నలు 30 ఉంటాయి.
బెనిఫిట్స్ : గేట్ స్కోర్ ఆధారంగా ఆయా విద్యాసంస్థల్లో పీజీ, పీహెచ్‌డీలో అడ్మిషన్స్ పొందిన వారికి పలు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఎంటెక్ వంటి పీజీ ప్రోగ్రామ్‌లో అడుగుపెడితే నెలకు రూ.12,400 స్టయిఫండ్, పీహెచ్‌డీలో చేరితే నెలకు రూ.28 వేల స్కాలర్‌షిప్ అందుతుంది. రాష్ట్ర స్థాయిలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో పీజీలో ప్రవేశాలకు సంబంధించి గేట్ ఉత్తీర్ణులకు తొలి ప్రాధాన్యం ఇస్తారు.
ఇంటర్వ్యూ : పీఎస్‌యూలు మలి దశలో నిర్వహించే గ్రూప్ డిస్కషన్‌లో ప్రతి అభ్యర్థికి సగటున అయిదు నుంచి ఆరు నిమిషాల సమయం లభిస్తుంది. ఈ సమయంలోనే అభ్యర్థులు సదరు టాపిక్‌పై తమ అభిప్రాయాలను తెలపాల్సి ఉంటుంది. గ్రూప్ టాస్క్ విధానంలో ఒక వాస్తవ సమస్యను అభ్యర్థుల ముందుంచి.. సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని సూచిస్తున్నారు. పీఎస్‌యూల ఎంపిక ప్రక్రియలో చివరి దశ పర్సనల్ ఇంటర్వ్యూ. గ్రూప్ డిస్కషన్ లేదా గ్రూప్ టాస్క్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా పర్సనల్ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
ఈ ఇంటర్వ్యూల్లో అభ్యర్థుల వ్యక్తిగత నేపథ్యం, టెక్నికల్ నాలెడ్జ్‌లను పరిశీలించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. ఐఐటీల్లో ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్+పీహెచ్‌డీ వంటి ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి గేట్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఐఐటీలు సైతం మలి దశలో గ్రూప్ టాస్క్, గ్రూప్ డిస్కషన్స్ పేరిట పరీక్షలను నిర్వహిస్తున్నాయి. కొన్ని ఐఐటీలు రిటెన్ ఎస్సేలు నిర్వహించే విధానాన్ని అనుసరిస్తున్నాయి. వీటిలో విజయం సాధించిన వారికే సీట్ల ఖరారు అవుతున్నాయి.
ఐఐటీల్లో ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ + పీహెచ్‌డీల్లో ప్రవేశం, అదే విధంగా పీఎస్‌యూ కొలువులకు షార్ట్ లిస్టింగ్ క్రమంలో గేట్ స్కోర్ కటాఫ్‌లు క్రమేణా పెరుగుతున్నాయి. జనరల్ కేటగిరీలో 750 నుంచి 800 స్కోర్, రిజర్వ్‌డ్ కేటగిరీలో 500 నుంచి 600 స్కోర్ సాధిస్తేనే మలి దశకు అవకాశం లభిస్తుంది.
రివిజన్ ముఖ్యం : ప్రిపరేషన్ చివరి దశలో ఉన్న అభ్యర్థులు మిగిలిన అంశాలు పూర్తి చేయాలి. కఠినమైన అంశాలు చదవకపోతే ఈ సమయంలో ముందుగా వాటిపై దృష్టి సారించాలి. సన్నద్ధత పూర్తికాగానే అన్నీ చదివామని విశ్రాంతి స్థితిలోకి వెళ్లకుండా కఠినమైన అంశాలతో సహా చదివిన అన్ని (సులభమైన, మధ్యస్థ) అంశాలను తప్పనిసరిగా రివిజన్ చేయాలి. ప్రిపరేషన్ మధ్యలో ఉంటే వీలైనంత త్వరగా అన్ని అంశాలూ చదవాలి. తర్వాత పరీక్షలో మార్కుల వెయిటేజీ ఆధారంగా కఠినమైన అంశాలు చదవాలి. సన్నద్ధత పూర్తవగానే అన్ని అంశాలనూ పునశ్చరణ చేయాలి.
సబ్జెక్టుల్లో కొన్ని అంశాలను మాత్రమే చదివితే గేట్ సిలబస్‌పరంగా ఈ సమయంలో ఏ అంశాలపై, ఏ సబ్జెక్టులపై దృష్టిపెడితే ఎక్కువ మార్కులు వస్తాయో గుర్తించి వాటిపై శ్రద్ధ వహించాలి. చదివింది తక్కువ అయినాసరే.. వాటన్నిటినీ తప్పకుండా రివిజన్ చేయాలి. సన్నద్ధత పూర్తయిన అభ్యర్థులు మాత్రం ఎక్కువ మార్కులు వచ్చే అంశాలపై పునశ్చరణలో, పరీక్ష ముందూ ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ప్రిపరేషన్ చివరి ఘట్టంలో ఉన్నా, మధ్యలో ఉన్నా, కొన్ని అంశాలు మాత్రమే సాధన చేసినా.. అభ్యర్థులందరికీ రివిజన్ తప్పనిసరి. పరీక్షలో గెలిపించడానికి తోడ్పడేది ఇదే.
నెగెటివ్ మార్కులతో జాగ్రత్త : పరీక్షలో రుణాత్మక మార్కులు ఉన్నందున కచ్చితంగా తెలిసిన సమాధానాలు మాత్రమే రాయాలి. అంచనా వేసి సమాధానాలు గుర్తించడం వల్ల ఒక్కోసారి నష్టం జరుగుతుంది. ఇక్కడ న్యూమరికల్, ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు నెగెటివ్ మార్కులు ఉండవని మరవద్దు. పరీక్ష సమయం దగ్గరపడుతున్నకొద్దీ కొంతమంది సాధారణంగా ఒత్తిడికి లోనవుతుంటారు. ఈ సమయంలో మానసిక ప్రశాంతతో ఉండి ఇప్పటివరకూ చేసిన సన్నద్ధత పరీక్ష రాయడానికి సరిపోతుందనే ధైర్యంతో ముందుకు సాగాలి. ఈ కీలక సమయంలో సమయం వృథా చేయడాన్ని నిరోధించాలి. టీవీ, సినిమా, సోషల్ మీడియాకు దూరంగా ఉండడం మంచిది.
పరీక్ష సమయం దగ్గరపడుతుంటే కొంతమంది విద్యార్థులు ఆందోళనకు, ఒత్తిడికి గురి అవుతుంటారు. దీన్ని అధిగమించడానికి ప్రతిరోజూ అరగంట యోగా, ధ్యానం, వ్యాయామం చేస్తే ఒత్తిడి మాయవువుతుంది. పరీక్షలో కఠినమైన ప్రశ్నలను చూసి ఆందోళనకు గురికాకూడదు. మొత్తం పేపర్ కఠినంగా అనిపించినప్పటికీ కంగారు అనవసరం. గేట్ స్కోర్ కేవలం సహ అభ్యర్థుల సాపేక్ష ప్రతిభపై ఆధారపడి ఉంటుందని మరిచిపోవద్దు. పూర్వపు గేట్ పరీక్షలను పరిశీలించినట్లయితే.. కొన్ని విభాగాల్లో 100కు 65 నుంచి 75 మార్కులు సాధించినవారికి కూడా మంచి ర్యాంకులు వచ్చాయి.
పీఎస్‌యూ జాబ్స్‌కు ఆధారం : గేట్ స్కోర్ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాలను సైతం సొంతం చేసుకోవచ్చు. గత కొన్నేళ్లుగా నవరత్న, మహారత్న, మినీరత్న వంటి హోదా పొందిన పబ్లిక్ సెక్టార్ యూనిట్స్(పీఎస్‌యూ).. గేట్ స్కోర్ ఆధారంగా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ వంటి పోస్ట్‌లను భర్తీ చేస్తున్నాయి. అభ్యర్థులు ఆయా సంస్థల నోటిఫికేషన్స్‌కు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసి తదుపరి దశలో గ్రూప్ డిస్కషన్/గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నాయి. తుది ఎంపికలో గేట్ స్కోర్‌కు, జీడీ/జీటీలకు నిర్దేశిత వెయిటేజీ కల్పిస్తున్నాయి. గేట్ స్కోర్‌కు 75 శాతం వెయిటేజీ; గ్రూప్ డిస్కషన్/గ్రూప్ టాస్క్‌లకు గరిష్టంగా పది శాతం; పర్సనల్ ఇంటర్వ్యూకు 15 శాతం చొప్పున వెయిటేజీ ఇస్తున్నాయి. మరికొన్ని పీఎస్‌యూలు గేట్ స్కోర్‌కు 60 నుంచి 65 శాతం వెయిటేజీ కేటాయిస్తున్నాయి.
సిలబస్ తెలిస్తే బెటర్ స్కోర్ : ఎంచుకున్న సబ్జెక్ట్‌లో బేసిక్స్ నుంచి అడ్వాన్స్‌డ్ టెక్నిక్స్ వరకూ.. పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. ప్రతి టాపిక్‌ను చదివేటప్పుడు ప్రశ్నార్హమైన అంశాలను గుర్తించడంతో పాటు దానికి సంబంధించి ప్రాథమిక భావనలపై అవగాహన పెంచుకోవాలి. ఒక టాపిక్ నుంచి ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో గుర్తించి సాధన చేయాలి. గేట్ సిలబస్‌ను అకడమిక్ అంశాలతో అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. వీక్లీ టెస్ట్‌లు,మాక్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లకు హాజరు కావాలి. ఈ అప్రోచ్ విజయ సాధనలో ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుంది. అభ్యర్థులు ఆయా సబ్జెక్ట్‌లోని టాపిక్స్‌కు లభిస్తున్న వెయిటేజ్, అకడమిక్‌గా ఉన్న ప్రాధాన్యాన్ని అనుసరిస్తూ ప్రిపరేషన్ సాగించాలి.
డిసెంబర్ చివరి వారం లేదా జనవరి మొదటి వారానికి ప్రిపరేషన్ పూర్తి చేసుకునేలా టైమ్ ప్లాన్ రూపొందించుకోవాలి. ఆ తర్వాత ఉన్న వ్యవధిలో ఆన్‌లైన్ మోడల్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లకు హాజరయ్యే విధంగా ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇలా ఇప్పటి నుంచే నిర్దిష్ట ప్రణాళికతో అడుగులు వేస్తే.. పరీక్షలో మంచి స్కోర్ సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది. ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో (ప్రతి రోజు రెండు సెషన్లు. మొదటి సెషన్ ఉదయం 9-12, మధ్యాహ్నం సెషన్ 2-5 వరకు) పరీక్ష ఉంటుంది. రిజల్ట్స్ మార్చి 16న విడుదల చేస్తారు.