రాజకీయాలకు అతీతంగాకలిసి పనిచేద్దాం
సిటీ ఎమ్మెల్యేలు, అధికారులతో మంత్రి భేటీ
డెంగ్యూ రాకుండాచర్యలు చేపట్టాలని ఆదేశం
హైదరాబాద్ ను డెవలప్ చేస్కుందామని తెలిపిన మంత్రి
హైదరాబాద్, వెలుగు: రాజకీయాలకు అతీతంగా కలిసి పని చేద్దామని, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసుకుందామని సిటీ ఎమ్మెల్యేలకు మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ అభివృద్ధిపై జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఆయన సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో నగర ఎమ్మెల్యేలు గణేశ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, మహమ్మద్ ముబిన్, కౌసర్ మోహినుద్దీన్, అబ్దుల్లా బలాల, మాజిద్ హుస్సేన్, జాఫర్ హుస్సేన్, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, ప్రభాకర్ రావు, మీర్జా రియాజ్ ఉల్ హుస్సేన్ ఎఫండి, మీర్జా రహమాన్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సిటీ అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ పనులు, ఇతర అవసరాలకు నిధులు, ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీ పనుల పురోగతి తదితర అంశాలపై బడ్జెట్ సమావేశాల్లోపే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి విజ్ఞప్తి చేయాలని సమావేశంలో చర్చించారు.
నగరంలో డెంగ్యూ వ్యాప్తి చెందకుండా వైద్యాధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, నీళ్ళు నిల్వ ఉండకుండా జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జీహెచ్ఎంసీ,హెచ్ఎండీఎ, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ సమస్యలు, పెండింగ్ బిల్స్, ప్రస్తుత పనులకు అవసరమైన నిధుల విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. హైదరాబాద్ ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలన్న సీఎం ఆదేశాల మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని మెడికల్ షాపులలో డ్రగ్స్ సంబంధిత మెడిసిన్స్ బయటపడున్నాయని ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేస్తున్నారని, అలాంటివి ఏం ఉన్నా తక్షణమే సీజ్ చేయాలని ఆదేశించారు. పెరుగుతున్న ట్రాఫిక్ కు అనుగుణంగా తీసుకుంటున్న చర్యలు, శాంతి భద్రతలపై పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.
స్కూళ్లు, హాస్టల్స్ తనిఖీ చేయాలె..
సిటీలోని గురుకులాలు, ప్రభుత్వ హాస్టళ్లు, స్కూళ్లను ఎమ్మెల్యేలు, అధికారులు తనిఖీ చేయాలని, విద్యార్థులకు భరోసా ఇవ్వాలని సూచించారు. బడుల్లో పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని, తాగునీటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా చర్యలు తీసుకునేందుకు సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వాటిని వెంటనే పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
కేంద్రం నుంచి కిషన్ రెడ్డి నిధులు ఇప్పించాలి:
కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తగినన్ని నిధులు కేటాయించేలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సోమవారం సెక్రటేరియెట్ మీడియా సెంటర్ లో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా తాము అన్ని వినతులూ చేశామని.. రాష్ట్రం సహకరించలేదని చెప్పకుండా రాజకీయాలకు అతీతంగా నిధులు కేటాయించేలా చూడాలన్నారు. విభజన హామీలను కూడా నెరవేర్చాలని కోరారు. హైదరాబాద్ కు డీఎంఎఫ్ టీ నిధులు ఇవ్వడం లేదని, వాటిని ఇచ్చేలా చూడాలన్నారు. మెట్రో వాటర్ వర్క్స్, మౌలిక సదుపాయాలు, చెరువుల అభివృద్ధి, వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద పనులకు, మెట్రోకు సాయం అందించాలన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు కూడా విడుదల చేయాలన్నారు. నవోదయ, సైనిక్ స్కూల్స్ మంజూరు చేయాలని కోరారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకూ సాయం చేయాలన్నారు.