- ఫస్ట్ స్పీచ్‌లోనే భారత్‌పై పాక్ కొత్త ప్రధాని అక్కసు
- పదవీ బాధ్యతలు స్వీకరించిన షెహబాజ్ షరీఫ్
ఇస్లామాబాద్ : ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాడో లేదో షెహబాజ్ షరీఫ్ కాశ్మీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీరీలతో పాటు పాలస్తీనియన్ల స్వాతంత్ర్యం కోసం తీర్మానం పాస్ చేద్దామంటూపిలుపునిచ్చారు. ప్రధానిగా ఎన్నికైన తర్వాత ఆదివారం జాతిని ఉద్దేశిస్తూ ఆయన మొదటిసారిగా ప్రసంగించారు. పొరుగు దేశాలతో పాటు ముఖ్యమైన దేశాలన్నింటితోనూ తమ సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు కృషి చేస్తామన్నారు. స్నేహితుల సంఖ్యను పెంచుకుంటామని చెప్పారు. తనపై విశ్వాసం ఉంచి ప్రధానిగా ఎన్నుకున్నందుకు మిత్రపక్షాలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు.
అలాగే ప్రధానిగా తన పేరు నామినేట్ చేసిన మాజీ ప్రధాని, తన సోదరుడు నవాజ్ షరీఫ్ కు కూడా థ్యాంక్స్ చెప్పారు. బలహీనమైన ఆర్థిక వ్యవస్థ వల్ల దేశం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నదని పేర్కొన్నారు. ఒక ట్రిలియన్ రూపాయల కన్నా ఎక్కువ లోటు బడ్జెట్ ఉన్న పరిస్థితిలో తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టానన్నారు. ఆర్థిక వ్యవస్థను సంస్కరించడం తన ముందున్న అతిపెద్ద సవాలన్నారు.
సాయుధ బలగాలకు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వడ్డీలకే ఏటా కొన్ని వేలకోట్ల రూపాయలు కట్టాల్సి ఉందన్నారు. ఎన్ని సవాళ్లు ఉన్నా దేశాన్ని ప్రగతి పథం వైపు నడుపుతానని, సంక్షోభం నుంచి కాపాడుతానని ధీమా వ్యక్తం చేశారు. పెట్టుబడులను ఆకర్షించి ఆర్థిక వృద్ధిని పెంచుతామన్నారు. అలాగే దేశంలో టెర్రరిజంను నిర్మూలిస్తామని షెహబాజ్ హామీ ఇచ్చారు.
కాగా, పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ (పీఎంఎల్ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అభ్యర్థి అయిన షెహబాజ్ కు 336 మంది సభ్యులు ఉన్న నేషనల్ అసెంబ్లీలో 201 ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థి, పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ అభ్యర్థి ఒమర్ ఆయూబ్ ఖాన్ కు 92 ఓట్లు వచ్చాయి. దీంతో ప్రధానిగా షెహబాజ్ ఎన్నికయ్యారు.