‘‘భారతదేశం నా మాతృభూమి... సుసంపన్నమైన, బహు విధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి నేను సర్వదా కృషి చేస్తాను..”అని చిన్నతనం నుండి ప్రతిజ్ఞ చేస్తున్నాం. అలాగే డా. బీఆర్ అంబేద్కర్ రచించిన మన భారత రాజ్యాంగం ప్రకారం మన సంస్కృతి సాంప్రదాయాలు, చారిత్రక కట్టడాలు, నిర్మాణాలు పదికాలాల పాటు పదిలంగా కాపాడుకునే విధంగా, భౌగోళికంగా అనేక విభిన్న పరిస్థితులున్న.. భిన్నత్వంలో ఏకత్వం గల మన దేశంలో.. ప్రజాస్వామ్య, లౌకిక విధానాన్ని గౌరవించి, ఆచరించే విధంగా ప్రాధమిక హక్కులు, బాధ్యతలు ప్రసాదించారు. దీనికి కట్టుబడే అంతా ప్రయాణం చేయాలి. ప్రపంచ మానవాళి కూడా ఇదే స్ఫూర్తితో కొనసాగాలి. ముఖ్యంగా ప్రతీ దేశంలో ఉన్న మానవ నిర్మిత ప్రదేశాలు, కట్టడాలు, దేవాలయాలు, చర్చిలు మసీదులు, ఆరామాలు, గురుద్వారాలు, రాజ ప్రసాదాలు, ప్రకృతి దృశ్యాలు, సుందర ప్రదేశాలు, శిల్పాలు, చిత్రలేఖనాలు, తాళపత్ర గ్రంథాలు, శిలాశాసనాలు ఇలా అనేక వాటిని రక్షించాలి. భద్రపరచుకోవాలి. ఒక దేశ గొప్పతనం, నాగరికత, సంస్కృతి, సాంప్రదాయాలు అన్నీ ఈ వారసత్వ సంపద ద్వారానే భావి తరాల వారికి వారధిగా ఉంటుంది అని అందరూ గుర్తెరగాలి. లేదంటే ఆ దేశ చరిత్ర, జాతి చరిత్ర జీవచ్ఛవంలా మారుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
ఐక్యరాజ్యసమితి సమావేశంలో ప్రపంచ సాంస్కృతిక, పక్రృతి పరిరక్షణకు 1972లో ఒక తీర్మానం ఆమోదం చేశారు. తర్వాత 1982లో అంతర్జాతీయ పురాతన కట్టడాలు, స్థలాలు పరిరక్షణ సంస్థ వారు ట్యునీషియాలో సమావేశం నిర్వహించి ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం ఉన్న అన్ని దేశాలూ ఈ రోజున ‘ప్రపంచ వారసత్వ దినోత్సవం’ జరపాలని నిశ్ఛయించారు. అప్పటి నుంచీ ఈ వేడుక జరపడం ఆనవాయితీగా మారింది. యూనెస్కో ఆధ్వర్యంలో ‘వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్’ 1945లో ఏర్పడి, ప్రపంచంలో ఉన్న వారసత్వ సంపదలోని వాటి ప్రాముఖ్యత ప్రాధాన్యత, నాణ్యత, నైపుణ్యాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రపంచ వారసత్వ ప్రదేశాలు/సంపదగా ప్రకటిస్తోంది.
తెలంగాణలో రామప్ప దేవాలయం..
మన భారతదేశం నవంబర్ 14, 1977లో ఈ వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ లో భాగస్వామ్యం అయింది. ఈ విధంగా ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా 1154 వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్స్, సైట్స్‌గా గుర్తింపు పొందాయి. వీటిలో 897 కల్చరల్, 218 నేచురల్, 39 మిక్సింగ్ చెందిన వారసత్వ సంపదలు ఎక్కువగా యూరప్, నార్త్ అమెరికాలో ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా 58 ప్రపంచ వారసత్వ సంపదలుతో ఇటలీ మొదటి స్థానంలో ఉండగా, చైనా 56, జర్మనీ 51, ఫ్రాన్స్ 48, స్వీడన్ 49, మన భారత్ 40 వారసత్వ సంపదలతో తులతూగుతోంది. 2021 లో ప్రకటించిన తెలంగాణ లోని రామప్ప దేవాలయం, గుజరాత్ లోని ‘ఢోలవీర’ ప్రకటన ద్వారా మనదేశం 40 వారసత్వ ప్రదేశాలు మైలురాయి చేరింది. వీటిలో 32 కల్చరల్, 7 ప్రకృతి, 1 మిక్స్డ్ సంపదలుగా ఉన్నాయి. ఈ వారసత్వ ప్రదేశాలు మనదేశంలో 19 రాష్ట్రాల్లో విస్తరించి ఉండగా, ఎక్కువగా మహారాష్ట్రలో 5 ఉన్నాయి. అజంతా ఎల్లోరా గుహలు, ఆగ్రా కోట, తాజ్ మహల్, కోణార్క్ సూర్య దేవాలయం, ఖజురహో, ఖజరంగా నేషనల్ పార్క్, ఫతేపూర్ సిక్కీం, కుతుబ్ మినార్, తమిళనాడు కర్ణాటక లోని దేవాలయాలు ఉన్నాయి. ఇంకా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక వారసత్వ ప్రదేశాలు సంపదలు ఉన్నాయి అన్నది ప్రత్యక్ష చారిత్రక వాస్తవాలు. ఆంధ్రప్రదేశ్ లోని ‘లేపాక్షి నంది’ ప్రస్తుతం పరిశీలనలో ఉంది. ఇంకా మనం అనేక వాటికి వారసత్వ హోదా సాధించ వలసి ఉంది. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, మేధావులు, మీడియా, పురావస్తు శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు కీలక పాత్ర పోషించి, సాధించాలి. ముఖ్యంగా తెలంగాణలో చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్ షాహీ సమాధులు, ఆలంపూర్ దేవాలయాలు, మెదక్ చర్చి వంటివి, ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం జిల్లా శ్రీముఖ లింగం, శాలిహుండం బౌద్ధ ప్రదేశం, అరసవల్లి సూర్య నారాయణ స్వామి ఆలయం, రామతీర్థం, అరకు లోయ, బొర్రా గుహలు 1661–-1770 మధ్య కాలంలో నిర్మించిన అనేక కట్టడాలు ప్రపంచ వారసత్వ ప్రదేశాల సంపదలుగా గుర్తింపు పొందుటకు ఎదురుచూస్తున్నాయి.
శిల్పకళకు పుట్టినిల్లు మన దేశం..
ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో మన దేశంలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు, కళలు, సాహిత్యం, కట్టడాలు సంరక్షణ కోసం రాజీవ్ గాంధీ ఛైర్మన్‌గా ‘భారత జాతీయ కళా సాంస్కృతిక సంస్థ’ నెలకొల్పారు. ప్యారిస్ కేంద్రంగా ‘ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్’ సంస్థ ప్రపంచ వారసత్వ ప్రదేశాలు సంపదలు గుర్తించుటలోను, కాపాడుటలోను అందరికీ దిశా నిర్దేశం చేస్తోంది. అజంతా శిల్పాల నుంచి అంగకర్ వాట్ట్ దేవాలయాలు శిల్పాలు చెక్కిన వారు భారతీయులు అని చరిత్ర చెబుతోంది. అనేక శిల్పకళలకు , దేవాలయాలు, రాజ ప్రసాదాలు, చిత్రకళకు , తాళపత్ర గ్రంథాలకు మనదేశం నిలయం. అయితే విదేశీయుల దండయాత్ర వలన చాలా వరకూ కాలగర్భంలో కలిసిపోయాయి. కొంతమంది దొంగలు, ముఠాలు వల్ల విలువైన విగ్రహాలు ఇతర దేశాలకు తరలిపోతున్నాయి. ఏండ్ల కిందట డబ్బుకు ఆశపడి మనదేశంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నటరాజ విగ్రహం ఇతర దేశాలకు తరలిపోయి... అది ప్రస్తుతం బోస్టన్ మ్యూజియంలో తేలింది. ఇక మన రాష్ట్రంలో 1960 నుంచి పురావస్తు స్థలాలు, కట్టడాల పరిరక్షణ చట్టం అమలు అవుతోంది. వారసత్వ సంపద కాపాడుటకు దేవాదాయ ధర్మాదాయ శాఖ, పురావస్తు శాఖ, పలు నిఘా సంస్థలు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. కొత్త వాటిని నిర్మించడం పైనే పాలకులు, వివిధ సంస్థలు దృష్టి కేంద్రీకరణ చేస్తున్నాయి తప్ప, శిథిలావస్థకు చేరుకుంటున్న కట్టడాలు, నిర్మాణాలు పరిరక్షణకు తగిన నిధులు మంజూరు చేయడం లేదు. భద్రతా చర్యలు అనుకున్న రీతిలో ఉండటం లేదు. తీరా ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ప్రకటిస్తున్నా, ఆయా ప్రభుత్వాలు చొరవ చూపకపోతే, వారసత్వ హోదా కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఆధునీకరణ, మరమ్మతులు చేసే క్రమంలో సున్నం రాయడం ద్వారా అసలు విగ్రహం ప్రతిష్టత, నైపుణ్యాలు, శాసనాలు నాణ్యత కోల్పోతున్నాయి. జాగ్రత్తలు తీసుకోవాలి.
ప్రభుత్వాల,ప్రజల సహకారం అవసరం
ఈ వారసత్వ ప్రదేశాలు సంపదలు కాపాడుకొనేందుకు ప్రభుత్వాలు, ప్రజలు అందరూ ఒకరికొకరు సహకరించుకోవాలి. కాలుష్య కోరల్లో ‘తాజ్ మహల్’ మసకబారుతోంది. సంరక్షణ లేక అనేక కట్టడాలు నిర్వీర్యం అవుతున్నాయి. యుద్ధాలు, పక్రృతి విపత్తులు, ఉగ్రవాద దాడుల్లో ప్రపంచ వ్యాప్తంగా అనేక కట్టడాలు కాలగర్భంలో కలిసిపోయాయి. కలిసిపోతూ ఉన్నాయి. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే ‘వారసత్వ సంపదలే...మన జవసత్వాలు’ అనే నిజాన్ని ఎవరూ గుర్తించకపోవడమే. ఇవి జాతి సంపదకు నిదర్శనం. ప్రజలు ప్రపంచ వారసత్వ ప్రదేశాలు చూడటం ద్వారా ఆదేశ, జాతి గొప్పతనం, నైపుణ్యాలు అవగాహన చేసుకుంటారు. విజ్ఞానం సంపాదిస్తారు. వివిధ దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు, ఇంజనీరింగ్ నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఈఫిల్ టవర్, చైనా గోడ, స్టాట్యు ఆఫ్ లిబర్టీ, తాజ్ మహల్, రామప్ప గుడి వంటివి ఉదాహరణలుగా నిలిచాయి. ముఖ్యంగా పర్యాటకులు, సందర్శకులు ఆకర్షించే విధంగా వారసత్వ ప్రదేశాలు రూపుదిద్దుకోవాలి. దానికి ప్రభుత్వాలు పూనుకోవాలి. దేశ, విదేశీ మారక ద్రవ్యం ఆర్జించాలంటే, వీటి కొరకు పటిష్ట ప్రణాళికలు రచించాలి. అమలు చేయాలి. ఆదాయ ఆర్జనతో పాటు, పరిరక్షణకు ప్రధమ ప్రాధాన్యత ఇచ్చుటయే ఈ ప్రపంచ వారసత్వ దినోత్సవ పరమార్థం.
- ఐ.ప్రసాదరావు,
సోషల్ ఎనలిస్ట్