ప్రపంచంలో నిరంతరం సాగుతున్న సాంకేతిక మేధోమథనం అటు అమృతంతోపాటు విషాన్నీ చిమ్ముతున్నది. అమృతాన్ని మనం ఆనందంగా ఆస్వాదిస్తున్నాం. కానీ మనకు కనిపించని వేయి పడగల సర్పం కక్కుతున్న విషం ఇవ్వాళ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. ‘నేరం’ తన రూపాలను మార్చుకొని ప్రపంచవ్యాప్త విష వలయంలా విస్తరించింది. మాదకద్రవ్యాలు, మానవ, పిల్లల, అక్రమ రవాణా, ఉగ్రవాదం, బాలలపై వేధింపులు, -దోపిడీ తదితర నేరాలకు భౌగోళిక సరిహద్దులంటూ ఏవీ లేవు. ముఖ్యంగా నేటి సమాజం గుర్తించాల్సిన విషయమేమిటంటే ఆన్‌లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు అత్యంత భయంకర, అసహ్యకర, దుర్మార్గ, జుగుప్సాకర నేరంగా పరిణమించింది. ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాల వలలో పడి బాలలు వారి ఫొటోలు, వీడియోలు షేర్చేస్తున్నారు. వారికి తెలియకుండానే నేరగాళ్లు మాయలో పడిపోతున్నారు. దీంతో నేరగాళ్లు వారి స్వార్థం కోసం పిల్లలను వేధింపులకు గురి చేస్తున్నారు. ఇంటర్నెట్‌తో ముడిపడి ఉన్న అన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, సామాజిక మాధ్యమాలు, అనుబంధ వెబ్‌సైట్లలో ఇలాంటి దుశ్చర్యలు నిత్యం జరుగుతున్నాయి. ‘చైల్డ్ పోర్న్’, ‘కిడ్ పోర్న్’, ‘పోర్నోగ్రఫీ’ వాటిల్లో బాలల ఫొటోలు, వీడియోలను వాడుతున్నారు. అలాంటి ప్రతి చిత్రం లేదా వీడియో వెనుక ఎంతో మంది బాలలు బాధ, ఒత్తిడి ఉంటున్నాయి.
సరైన అవగాహనతో..
ఆన్‌లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు బాగా పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో వారికి రక్షణ కల్పించే దిశగా మనం అన్ని వైపుల నుంచి పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. బాలల వేధింపులకు సంబంధించి నేరగాళ్ల తక్షణ గుర్తింపు, నేర పరిశోధన, బాధితుల గుర్తింపు, వారికి ఉపశమన చర్యలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఏది ఆమోదయోగ్య ప్రవర్తన, ఏది కాదు? అనే అంశంపై ఇంటర్నెట్ వాడే బాలబాలికలందరికీ అవగాహన కల్పించడం తప్పనిసరి. మన పిల్లలకు ఆన్‌లైన్‌లో ఎదురయ్యే అనేక వికృత, ప్రమాదకర పరిస్థితుల గురించి మనమే శ్రద్ధగా చెప్పి, వారిలో చైతన్యం తీసుకురావాలి. ప్రమాదకరమైన అంశాలను, వెబ్సైట్లను ముందుగానే గుర్తించి, నిరోధించడానికి సామాజిక మాధ్యమ వేదికలు కొన్ని విధివిధానాలను కూడా రూపొందిస్తున్నాయి. బాలల సంఖ్య అధికంగా గల దేశాల్లో భారత్ ఒకటి. 2011 జనాభా లెక్కల ప్రకారం18 ఏండ్లలోపు బాలల జనాభా 47.2 కోట్లు. వీరిలో 22.5 కోట్లమంది బాలికలున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా డిజిటల్ సాంకేతికత విశేషంగా చొచ్చుకుపోతున్న ఫలితంగా రకరకాల నేరాలూ పెరుగుతున్నాయి.
ఇంటర్‌పోల్‌తో కలిసి..
బాలలపై ఆన్‌లైన్‌లో లైంగిక వేధింపుల నివారణ కోసం సీబీఐ కృషి చేస్తున్నది. ఇందులో భాగంగానే బాధితులు, నిందితుల సమాచారం పరస్పరం మార్పిడి కోసం సీబీఐ ఇంటర్‌పోల్ నిర్వహించే ‘ఇంటర్నేషనల్చైల్డ్సెక్స్వల్ఎక్స్ప్లయిటేషన్డేటాబేస్’ భాగస్వామ్యం ఏర్పరచుకుంది. ప్రపంచంలో ఈ భాగస్వామ్యం ఏర్పరచుకున్న దేశాల్లో భారత్ 68వ దేశం కావడం గమనార్హం. ఈ అంతర్జాతీయ సమాచార నిధిలో 27 లక్షలకుపైగా ఫొటోలు ఉండగా, 23,000 మంది బాధితులను కనుగొనడంలో ఇవి ఎంతగానో తోడ్పడ్డాయి. ఈ సమాచార నిధి ప్రయోజనం గురించి ఇంటర్‌పోల్ ప్రధాన కార్యదర్శి ఇటీవల ప్రకటించిన దాన్ని బట్టి రోజువారీగా సగటున ఏడుగురు బాలలు బాధితులు ఉన్నట్లు తేలింది. ఈ ప్రక్రియలో సమన్వయపూరిత నిఘా ఆధారిత కార్యకలాపాలు కీలకమని సీబీఐ గ్రహించింది. అందులో భాగంగానే గత కొన్ని సంవత్సరాల నుంచి దేశమంతటా భారీస్థాయిలో పరిశోధక కార్యకలాపాలు చేపట్టింది. ఈ మేరకు 2021లో ‘ఆపరేషన్ కార్బన్’, 2022లో ‘ఆపరేషన్ మేఘచక్ర’ నిర్వహించి సోదాలు చేసింది. దేశంలోని అన్ని ప్రాంతాలకూ ఈ ముప్పు విస్తరించిందని ఈ సందర్భంగా స్పష్టం కావడం నిజంగా దురదృష్టకరం. నేడు ప్రపంచంలో100కుపైగా ప్రాంతాల పరిధిలో నేరజాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ జుగుప్సాకర కార్యకలాపాలకు తార్కిక ముగింపు పలకడం పెనుసవాలే. అయితే, దేశవ్యాప్తంగా సాగిన శోధన ప్రజలకు అవగాహన కల్పించే కీలక బాధ్యతను నిర్వర్తించడంలో ఎంతగానో తోడ్పడింది.
సమష్టి కృషితోనే..
బాలలపై ఆన్‌లైన్‌లో హేయమైన నేరాలకు పాల్పడే దుండగులు దేశంలో100కుపైగా ప్రాంతాల పరిధిలో చర్యలు సాగిస్తున్నారు. మన చట్టాల అమలు వ్యవస్థలు కూడా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. చట్టపరంగా పరస్పర సాయంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటున్నది. కొన్నిసార్లు సరిహద్దు అవరోధంతో పరిశోధనకు వీలుగా తక్షణ సమాచార సేకరణ సాగడం లేదు. వివిధ అధికార పరిధుల్లో సమాచార బట్వాడా విధానాలు సంక్లిష్టంగా ఉన్నాయి. నేరగాళ్లు అనామకులుగా/ప్రచ్ఛన్న వ్యక్తులుగాఉండటం, నకిలీ గుర్తింపు వాడకం లాంటి చర్యలు పరిశోధనలకు గండికొడుతున్నాయి. ఆన్‌లైన్ ద్వారా బాలలపై జరుగుతున్న వేధింపులను ఇతర నేరాలతో పోల్చలేం. ఈ పరిస్థితుల నడుమ ప్రాదేశిక పరిమితులు, చట్టపరమైన అసమతౌల్యం, సంక్లిష్ట ప్రక్రియలతో సతమతం కావడంగాక పరిష్కారాల అన్వేషణ కోసం విధాన రూపకర్తలు, చట్టాల అమలు వ్యవస్థలు కృషి చేయడం అత్యావశ్యకం. బాధ్యతాయుత అంతర్జాతీయ సమాజంగా మన విభేదాలన్నింటినీ తుంగలో తొక్కి ఈ ముప్పుపై వాస్తవిక ప్రపంచ కృషిని ప్రతిబింబించే తీవ్ర ఎదురుదాడి వ్యూహాన్ని రూపొందించాలి. ప్రస్తుతానికైతే, చట్టాల అమలు వ్యవస్థల నడుమ విశ్వాస నిర్మాణంలో ఇంటర్‌పోల్ తనవంతు పాత్రను పోషిస్తోంది. అది అత్యుత్తమ స్థానంలో ఉండగా-తదనుగుణంగా దానికి లోతైన సంబంధాలు, విస్తృత భాగస్వామ్యాలున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ వేదికగా నిర్వహించబోయే ఇంటర్‌పోల్ సర్వసభ్య సమావేశం ఈ సమస్యపై ప్రాథమికంగా దృష్టి సారించి దీనికి అగ్ర ప్రాధాన్యమివ్వాలి. ఎక్కడైనా, ఎప్పుడైనా- మన బాలలే మనకు ప్రధానం. అంతర్జాతీయ సమాజ ఏకైక లక్ష్యం, నినాదం ఇదే కావాలి.
చట్టాలు ఉన్నా..
దేశంలో బాలలకు లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించడం కోసం ప్రభుత్వం పోక్సో, సమాచార సాంకేతిక చట్టాలను రూపొందించాయి. బాలలకు ప్రాధాన్యమిచ్చే ఈ చట్టాల్లో స్నేహపూర్వక ఫిర్యాదు, సాక్ష్యం నమోదు, పరిశోధన, నేరంపై ప్రత్యేక కోర్టుల్లో సత్వర విచారణ వంటి ఏర్పాట్లున్నాయి. వీటన్నిటి గురించి బాలల తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలి. బాలల హక్కుల రక్షణపై పోక్సో అమలు తీరును జాతీయ కమిషన్ నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా బాలలకు వేధింపులపై పోరాటానికి భాతర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది. భారత్‌లోని చట్టాల అమలు సంస్థలు ఇంటర్‌పోల్, అంతర్జాతీయ సమాజంతో అనుసంధానమై చురుగ్గా పనిచేస్తున్నాయి. బాలలకు ప్రమాదకరంగా మారే వాటిని గుర్తించి నిరోధించడం, వాటి తాలూకు సమాచారం పంచుకోవడమేగాక శిక్షార్హ నేరంపై పరిశోధనకూ అధిక ప్రాధాన్యమిస్తాయి. ఈ మేరకు ఆన్‌లైన్ ద్వారా బాలలపై లైంగిక వేధింపులకు సంబంధించిన సమాచార సేకరణ, క్రోడీకరణ, దర్యాప్తునకు సీబీఐ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది.
- రిషి కుమార్ శుక్లా,సీబీఐ మాజీ డైరెక్టర్