నీటి వనరులను రక్షించుకుందాం : మంత్రి శ్రీధర్​బాబు

నీటి వనరులను రక్షించుకుందాం : మంత్రి శ్రీధర్​బాబు
  • మంత్రి శ్రీధర్​ బాబు పిలుపు 
  • హైటెక్స్​లో 30వ ఇండియన్​ ప్లంబింగ్​కాన్ఫరెన్స్ 

మాదాపూర్, వెలుగు : అన్ని రకాల జీవులకు అవసరమైన నీటి వనరులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్​బాబు అన్నారు. గురువారం మాదాపూర్​లోని హైటెక్స్​లో ‘వాటర్​న్యూ కరెన్సీ’ అనే థీమ్​తో 30వ ఇండియన్​ప్లంబింగ్​కాన్ఫరెన్స్​ప్రారంభమైంది. మూడ్రోజుల పాటు కొనసాగనుంది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్​బాబు ఈ కాన్ఫరెన్స్​ను ఉద్దేశించి వీడియో పంపించారు. 

అందులో మంత్రి మాట్లాడుతూ.. సహజ వనరు అయిన నీటి ప్రాముఖ్యతను ఎవరూ గుర్తించటం లేదన్నారు. భవిష్యత్​ తరాలకు పరిశుభ్రమైన, సురక్షితమైన నీటిని ప్లంబింగ్ ​పరిశ్రమలు అందించాలని సూచించారు. నీటి వనరులను కాపాడుకోవడంలో సమిష్టి బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. హర్కర వేణుగోపాలరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఇటీవల కొత్త విధానం తీసుకొచ్చిందని వివరించారు. కొత్తగా కొనుగోలు చేసే ఎలక్ట్రిక్​ వాహనాలకు పన్ను, రిజిస్ట్రేషన్​ చార్జీలు విధించడం లేదని వెల్లడించారు. 

పట్టణ నీటి వనరులను రక్షించి పునరుద్ధరించడం, రీచార్జ్​ చేసి తిరిగి ఉపయోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మూసీ రివర్ ​ఫ్రంట్ ​బ్యూటిఫికేషన్ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్​ సిటీకి పూర్వ వైభవం వస్తుందని చెప్పారు. ఈ కాన్ఫరెన్స్​లో ఇండియాలోని డెన్మార్క్​ రాయబారి సోరెన్ ​నార్కెలుండ్ ​కన్నిక్​ మార్క్వార్డ్​సెన్, ఇండియన్​ ప్లంబింగ్​అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు గుర్మీత్​సింగ్ అరోరా తదితరులు పాల్గొన్నారు.