
- కలిసికట్టుగా కాంగ్రెస్‌ను గెలిపించుకుంటాం
- మంచిర్యాలలో ఉమ్మడి జిల్లా నేతల ఆత్మీయ సమ్మేళనం
- సీనియర్ లీడర్లకు అన్యాయం జరుగుతోందని ఆవేదన
- కొందరు ముందే టికెట్లు ప్రకటిస్తున్నారని ఆగ్రహం
- మాజీ ఎమ్మెల్సీ పీఎస్సార్ వర్గానికి చెక్ పెట్టే ప్లాన్
మంచిర్యాల, వెలుగు: ‘‘కలిసికట్టుగా ఉందాం.. కాంగ్రెస్‌ను గెలిపించుకుందాం”అని ఆ పార్టీ నేతలు గళమెత్తారు. మంచిర్యాల గద్దెరాగడిలోని ఓ ఫంక్షన్హాల్లో శుక్రవారం ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. టీపీసీసీ జనరల్ సెక్రటరీ గోమాస శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమ్మేళనంలో మాజీ మంత్రి గడ్డం వినోద్, ఆసిఫాబాద్ డీసీసీ చైర్మన్ విశ్వప్రసాద్‌రావు, మంచిర్యాలకు సీనియర్ లీడర్ కేవీ ప్రతాప్, డాక్టర్ నీలకంఠేశ్వర్రావు పాల్గొన్నారు. ఆసిఫాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న మర్సకోల సరస్వతి, ఖానాపూర్ నుంచి ఎస్టీ సెల్ స్టేట్ వైస్‌ప్రెసిడెంట్ భరత్ చౌహాన్, బోథ్టికెట్ రేసులో ఉన్న టీపీసీసీ మెంబర్ ఆదె గజేందర్, లక్సెట్టిపేట జడ్పీటీసీ ముత్తె సత్తయ్య, టీపీసీసీ సెక్రటరీ వొడ్నాల శ్రీనివాస్ , హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్, కారుకూరి రాంచందర్, వంగల దయానంద్తదితరులతో పాటు ఉమ్మడి జిల్లా నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
ఈసందర్భంగా లీడర్లు మాట్లాడుతూ.. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పనిచేస్తూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి తామంతా పనిచేస్తామన్నారు. పార్టీలో కొంతమంది సీనియర్ లీడర్లకు అన్యాయం జరుగుతోందని, ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కొందరు నాయకులు ఒంటెత్తు పోకడలతో పార్టీలో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని పరోక్షంగా మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు తీరుపై మండిపడ్డారు. ఉమ్మడి జిల్లాలో టికెట్లు ఇప్పిస్తామని చెప్పుకుంటున్నారని, కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరి సొత్తూ కాదని హెచ్చరించారు. జిల్లా కాంగ్రెస్‌లో చిచ్చు పెడ్తున్న నేతలపై చర్యల కోసం అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రేమ్‌సాగర్‌రావు వర్గానికి చెక్ పెట్టే ప్లాన్‌లో భాగంగానే ఈ సమ్మేళనం సాగిందని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.