కాకా స్ఫూర్తితో మూసీ నిర్వాసితులను ఆదుకుందాం.. రూ.10 వేల కోట్లు ఇవ్వలేమా : -సీఎం రేవంత్ రెడ్డి

కాకా స్ఫూర్తితో మూసీ నిర్వాసితులను ఆదుకుందాం.. రూ.10 వేల కోట్లు ఇవ్వలేమా : -సీఎం రేవంత్ రెడ్డి

మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు విషయంలో.. కాకా స్ఫూర్తితో.. మూసీ నిర్వాసితులను ఆదుకుంటామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన జి.వెంకటస్వామి కాకా 95వ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. మూసీ ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని.. వాళ్లందరూ పేదలు అని.. వాళ్లను అన్యాయం జరక్కుండా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవటానికి సిద్ధంగా ఉందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులోనే ఒక్క ఫ్యామిలీనే లక్ష కోట్లు తిన్నదని.. మూసీ నిర్వాసితులకు 10 వేల కోట్ల రూపాయలు ఇవ్వలేమా అంటూ భరోసా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ నిర్వాసితులు అందరూ పేదలు అని.. జీవనోపాధి కోసం.. ఉపాధి, ఉద్యోగాల కోసం హైదరాబాద్ వచ్చారని.. అలాంటి లక్షల మందిని.. అప్పట్లో కాకా వెంకటస్వామి ఆదుకుని ఆశ్రయం ఇచ్చారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాంటి కాకా స్ఫూర్తితోనే మూసీ నిర్వాసితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారాయన.

మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్ లో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రత్యామ్నాయం చూపిస్తామని.. వాళ్లకు ఇల్లు ఇస్తామని.. స్థలం ఇస్తామని.. నష్టపరిహారం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ నేతలు కేటీఆర్, హరీశ్ లు ఏం సూచనలు చేస్తారో చేయాలని.. అలా కాకుండా పేదలకు నష్టం చేకూర్చే విధంగా రాజకీయం చేస్తే ఊరుకోం అని వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. 

మూసీని ఇలాగే వదిలేస్తే.. భవిష్యత్ లో నగరానికి వరద ముప్పు పొంచి ఉంటుందని.. వికారాబాద్ నుంచి వచ్చే వరద సిటీని ముంచెత్తే ప్రమాదం ఉందన్నారు సీఎం. ఈ విషయంలో బీజేపీని కూడా  ప్రశ్నించారు. గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు సమయంలో 60 వేల కుటుంబాలను మోదీ ప్రభుత్వం ఖాళీ చేయించిందని.. అందులో కేవలం 16 వేల కుటుంబాలకే సాయం చేసిన విషయాన్ని గుర్తు చేశారాయన. గుజరాత్ ఒకలా.. హైదరాబాద్ లో మరోలా ఎలా మాట్లాడతారంటూ బీజేపీ నేతలకు చురకలు అంటించారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే సత్తా ఉందా అని బీజేపీ నేతలను ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి.